నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనానికి తలనొప్పి తప్పలేదు. ఏపీలో దళిత యువకుడికి శిరోముండనం అనే వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన నేపథ్యంలో.. ఏకంగా పోలీసులే విచారణ ఎదుర్కుంటున్న సందర్భంలో.. మళ్లీ అలాంటి కేసే బైటపడింది. అయితే ఈసారి అనుకోకుండా పవన్ కల్యాణ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది.
పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే నూతన్ నాయుడు, రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన నాతన్ నాయుడు ఇప్పుడు నిందితుడుగా మారాడు.
దీంతో వ్యవహారం మరింత హాట్ గా మారింది. పవన్ కల్యాణ్ కి పరాన్నజీవి సినిమాకి సంబంధం లేకపోయినా పవన్ వీరాభిమాని కావడం వల్లే నూతన్ నాయుడు వర్మపై పగ తీర్చుకున్నాడు. అయితే ఇప్పుడు నూతన్ నాయుడు, అతని భార్య కేసులో బుక్కవడం పవన్ కి కూడా పరోక్షంగా ఇబ్బందిగా మారింది. అందులోనూ ఓ దళిత యువకుడికి గుండు గీయించడం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ కావడంతో ఈ వ్యవహారం రాష్ట్రస్థాయిలో సంచలనంగా మారింది.
దీంతో జనసేన నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. నూతన్ నాయుడితో జనసేనకు సంబంధం లేదు, మాపై తప్పుడు ప్రచారం చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిందితుడు పవన్ కల్యాణ్ అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి సంఘటనల్లో ఆయన పేరు తీసుకురావొద్దని జనసేన పేరుతో ఓ ప్రెస్ నోట్ విడుదలైంది. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు.. జనసేన పార్టీ వాళ్లు ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ నూతన్ నాయుడు వ్యవహారాన్ని మరింత రచ్చకీడ్చారు.
ఎక్కడ ఏం జరిగినా బాధితుల పక్షాన బైటకొచ్చే జనసైనికులు ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారనేదే ఇప్పుడు ప్రశ్న. పార్టీ తరపున బాధితుడికి జరిగిన అవమానం గురించి ప్రస్తావించకుండా నూతన్ నాయుడుకి మాకు ఏ సంబంధం లేదు అని చెప్పుకున్నారంటే.. వీరికి ప్రజా సమస్యలపై ఉన్న శ్రద్ధ ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జగన్ ని నిందించడానికి లేచిన నోళ్లన్నీ ఇప్పుడు మూగబోయాయి.
కనీసం టీడీపీ తరపున కూడా ఎవరూ నిరసన తెలపలేదు. లోకేష్ ట్వీట్ వేసినా.. ప్రభుత్వాన్ని, పోలీసుల్ని నిందించారు కానీ, నూతన్ నాయుడు అనే పేరే బైటపెట్టలేకపోయారు. జగన్ పై దాడి జరిగితే.. కత్తితో పొడిచిన వాడు కూడా జగన్ వీరాభిమాని అని తప్పుడు గ్రాఫిక్స్ సృష్టించిన “దేశం” నేతలు.. నూతన్ నాయుడు పవన్ కల్యాణ్ అభిమాని అని తెలిసి తేలుకుట్టిన దొంగల్లా మారారు.