Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: సడక్‍ 2

సినిమా రివ్యూ: సడక్‍ 2

సమీక్ష: సడక్‍ 2
రేటింగ్‍: 1/5
బ్యానర్‍:
విశేష్‍ ఫిలింస్‍, ఫాక్స్ స్టార్‍ స్టూడియోస్‍
తారాగణం: సంజయ్‍దత్‍, ఆలియా భట్‍, ఆదిత్య రాయ్‍ కపూర్‍, జిష్షుసేన్‍ గుప్తా, మకరంద్‍ దేశ్‍పాండే, గుల్షన్‍ గ్రోవర్‍, ప్రియాంక బోస్‍ తదితరులు
రచన: మహేష్‍ భట్‍, సుమిత్ర సేన్‍ గుప్తా
నేపథ్య సంగీతం: సందీప్‍ చౌతా
కూర్పు: సందీప్‍ కురుప్‍
ఛాయాగ్రహణం: జే ఐ. పటేల్‍
నిర్మాత: ముఖేష్‍ భట్‍
దర్శకత్వం: మహేష్‍ భట్‍
విడుదల తేదీ: ఆగస్ట్ 28, 2020
వేదిక: డిస్నీ హాట్‍స్టార్‍

ఇరవై ఒకటవ శతాబ్ధంలోకి అడుగుపెట్టిన ఇరవై ఏళ్లలో ఒక్క సినిమా కూడా డైరెక్ట్ చేయని బాలీవుడ్‍ వెటరన్‍ మహేష్‍భట్‍... 2020లో సడక్‍ 2 అంటూ తాను 1991లో తీసిన సడక్‍కి సీక్వెల్‍ డైరెక్ట్ చేసారు. ఇరవయ్యేళ్ల తర్వాత ఎందుకని ఆయనకు మళ్లీ దర్శకత్వం చేయాలని అనిపించిందనేది తెలియదు కానీ... ఆయన ఎప్పుడయితే మెగాఫోన్‍ పక్కనపెట్టారో... మళ్లీ అక్కడే దానిని చేతబట్టుకున్నట్టు తొంభైల నాటి సినిమాలను తలపించే చిత్రాన్ని ఆలియా భట్‍, సంజయ్‍ దత్‍, జిష్షుసేన్‍, ఆదిత్యరాయ్‍ కపూర్‍ లాంటి నటులతో తెరకెక్కించారు. 

సడక్‍ 2... మొదలయిన కొన్ని నిమిషాలలోనే విషయం బోధపడిపోతుంది. ఇది దర్శకరత్న దాసరి తీసిన ‘పరమవీరచక్ర’ లాంటి అవుట్‍డేటెడ్‍ సినిమా అని. మహేష్‍ భట్‍ పూర్తిగా డైరెక్షన్‍ మానేయకుండా అడపాదడపా అయినా సినిమాలు చేస్తున్నట్టయితే ట్రెండ్‍ పరంగా ఇంత గ్యాప్‍ వచ్చి ఉండేది కాదేమో. డైలాగుల నుంచి, సన్నివేశాల నుంచి, ఆర్టిస్టుల అభినయం నుంచి... చివరకు ఛాయాగ్రహణం, సంగీతం వరకు అన్నీ పాతికేళ్ల నాటికి తీసుకుపోతాయి. 

ఆలియా భట్‍ టైమ్‍ మెషీన్‍లో వెళ్లి తొంభైలలో సినిమా చేసినట్టయితే ఆమె నటన ఎలా వుండేదో చూపించడానికి సడక్‍ 2 తీసినట్టుంది. ఎలాంటి పాత్రలో అయినా అలవోకగా ఒదిగిపోయి, అవలీలగా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే ఆలియా కొన్ని సందర్భాలలో తాను చెబుతోన్న డైలాగులు ఎంత దారుణంగా వున్నాయనేది తనకి కూడా తెలుసు అన్నట్టుగా ఒక విధమయిన కన్‍ఫ్యూజ్డ్ లుక్‍తో, ‘వాట్‍ యామ్‍ ఐ డూయింగ్‍’ మీమ్‍ని తలపించింది. సంజయ్‍ దత్‍ తొంభైలు దాటి వచ్చిన వాడే కనుక అతను ఎక్కువ ఇబ్బంది పడలేదు. తన క్యారెక్టర్‍ని ఎంతగా రక్తి కట్టించి, ఆ ‘రవి’ తాలూకు భావోద్వేగాలను తెలియజేయాలని చూసినా కానీ సిల్లీ సన్నివేశాలు, స్టుపిడ్‍ డైలాగులు అతడిని కట్టి పడేసాయి. 

కథలోకి వెళితే... జనం మూఢ నమ్మకాలను క్యాష్‍ చేసుకుంటోన్న ఫేక్‍ బాబాలపై ఒక ఆర్మీని తయారు చేస్తుంది ఆర్య (ఆలియా). దాంతో ఆమె అడ్డు ఎలాగయినా తొలగించాలని చూస్తారు. ఆమె ఇంట్లోంచి పారిపోయి, తాను ఎప్పుడో బుక్‍ చేసుకున్న క్యాబ్‍ సర్వీస్‍ సెంటర్‍కి వెళుతుంది. భార్య చనిపోవడంతో ఆత్మహత్య చేసుకుని తన దగ్గరికే వెళ్లిపోవాలని చూస్తోన్న రవి (సంజయ్‍దత్‍) అయిష్టంగానే ఆర్యను తన క్యాబ్‍లో తీసుకెళ్లడానికి అంగీకరిస్తాడు. ఇరవై నాలుగ్గంటల సర్వీస్‍తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తానని తన క్యాబ్‍ సర్వీస్‍ మోటో చెప్పే రవి నిజంగానే ఆర్య రక్షణ బాధ్యతలు తీసుకుంటాడు. 

‘సడక్‍’ కథలోని కొన్ని కథా లక్షణాలను రిపీట్‍ చేయడం వలన దీనికి సడక్‍ 2 అని పేరు పెట్టినట్టున్నారు. అలా చేయడం వల్ల సడక్‍లోని పూజాభట్‍ మాంటేజెస్‍ని ఇందులో వాడుకునే వీలు చిక్కడంతో ఆ అంశాన్ని వాడుకున్నారు. అది ఈ చిత్రానికి వున్న నైంటీస్‍ సినిమా ఫీల్‍ని మరింత పెంచిందే తప్ప మరో విధంగా ఉపయోగపడలేదు. ఇక దాదాపు ముప్పయ్యేళ్ల తర్వాత తీసే సీక్వెల్‍లో అప్‍ టు డేట్‍ ఎలిమెంట్‍ ఏమిటంటే... మూఢనమ్మకాలకు, ఫేక్‍ బాబాలకు వ్యతిరేకంగా యువత పోరాడడం. కనీసం దాన్నయినా ట్రెండీగా తీయలేదు. వాళ్లంతా కలిసి ఏమి చేస్తారంటే... గుంపుగా కూర్చుని స్పీచ్‍లు ఇచ్చుకోవడంతో పాటు రోడ్లపై తిరుగుతూ పాంప్లెట్లు పంచుతారు. ‘ఈ కాలంలో ఇదేమిటి’ అని అడిగితే ‘సోషల్‍ మీడియా బయట చాలా పెద్ద ప్రపంచం వుంది’ అనేది సమాధానం. 

డెబ్బయ్‍ ఏళ్ల పెద్దాయన మీ ఇంట్లో వున్నట్టయితే... ఆయన ఏది చెప్పినా తల ఊపేస్తామే తప్ప కాదు, లేదు అంటూ వాదించం కదా. ఆయన చెబుతున్నది తప్పయినా కానీ ఆయన అభిప్రాయంతో విబేధించడం దేనికని గౌరవ సూచకంగా తల ఊపేస్తుంటాం. ‘సడక్‍ 2’ చిత్ర బృందానిది ఇంచుమించు అదే పరిస్థితి అనిపించింది. ఇదంతా ఇప్పుడు అవుట్‍డేటెడ్‍ అని చెప్పాలని వున్నా కానీ పెద్దాయన నొచ్చుకుంటారని, ఆయనకు మరో సినిమా డైరెక్ట్ చేయాలనే ముచ్చట తీర్చడానికి ఇందులోని నటీనటులు, దీనికి పని చేసిన సాంకేతిక నిపుణులు తల ఊపేసారనిపిస్తుంది. 

ప్రియాంక బోస్‍ తెరపై కనిపించిన ప్రతిసారీ ఇది సినిమాలా కాకుండా టీవీ సీరియల్‍లా అనిపిస్తే అది మీ తప్పు కాదు. బోనస్‍గా ఇది ఓటిటిలో రిలీజ్‍ అవడంతో డిస్నీ హాట్‍స్టార్‍లో ఏదో హిందీ సీరియల్‍ యాడ్‍ వచ్చిన భావన కలుగుతుంది. మకరంద్‍ దేశ్‍పాండే విలక్షణ నటుడు. అతను కూడా టీవీ సీరియల్‍ యాక్టర్‍లా కనిపించాడిందులో. మహేష్‍భట్‍ సినిమాల్లో కథ, కథనాలు బలంగా వుండేవి. అయితే ఇన్నాళ్ల సిరాసన్యాసం తర్వాత ఆయన ఆలోచనలు సవ్యంగా కాగితంపైకి రాలేదు. 

ప్రతి పాత్రకూ విడిగా ఒక ఫ్లాష్‍బ్యాక్‍ ఇస్తూ, చాలా క్యారెక్టర్లను ట్విస్ట్ చేసి అదే పెద్ద మలుపు అన్నట్టు రూపొందిన ఈ చిత్రాన్ని పొరపాటున కొత్త సినిమా అనేసుకుంటారేమోనని మొండిచెయ్యితో గుల్షన్‍ గ్రోవర్‍ని, హీరోతో అసలు సంబంధమే లేకుండా అతని ఆజ్ఞలు పాటిస్తూ విలన్లను చెండాడే గుడ్లగూబని పెట్టారు. తలతిక్క స్పీచ్‍లిచ్చే జనాల మాటలను కామెడీ చేస్తూ యూట్యూబ్‍లో బ్రహ్మానందం రియాక్షన్స్ తో వీడియోలు చేస్తారు చూసారా? ఈ సినిమా అంతటికీ రివ్యూ ఇవ్వాలంటే అలాంటి బ్రహ్మానందం రియాక్షన్లతో కూడిన వీడియో రిలీజ్‍ చేయాలి. 

థియేటర్లలో విడుదలయితే ఈ రోడ్డెక్కినందుకు జనం హాహాకారాలు పెట్టి వుండేవాళ్లు. డిస్నీ హాట్‍స్టార్‍ ఎలాగో ఈ సినిమా హక్కులు కొనేసింది కనుక ఇప్పుడు వాళ్లు చేయడానికి ఏమీ లేదు. బహుశా సినిమాల జాబితా నుంచి తప్పించి టీవీ సీరియళ్ల పక్కన పెట్టేస్తే ఆ ఆడియన్స్ ఈ చిత్రాన్ని కొంచెం అడ్వాన్స్ డ్ అని ఫీలవుతారు. 

బాటమ్‍ లైన్‍: గతుకుల రోడ్డు!  

గణేష్‍ రావూరి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?