ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని దాదాపు 95 శాతం కోరుకుంటున్నారని ఆన్‌లైన్ ఓటింగ్‌లో తేలిందని టీడీపీ, దాని అనుబంధ మీడియా తెగ సంబరపడిపోతోంది. ఈ సందర్భంగా పచ్చ పత్రికలో ఈ రోజు ఓ సింగిల్ కాలమ్ వార్తను కూడా ప్రచురించారు. అయితే ఆన్‌లైన్ ఓటింగ్ ఉత్త మోసమని ఆ చిన్న వార్తను చదివితే ఎవరికైనా అర్థమవుతుంది.
రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై ఆంధ్రప్రదేశ్ విత్ అమరావతి పేరుతో ఆన్ లైన్‌లో ఓటింగ్‌కు టీడీపీ శ్రీకారం చుట్టింది. ఈ వెబ్‌సైట్‌ను గత సోమవారం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పచ్చ పత్రికలో రాసిన వార్త ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
బాబు ప్రారంభించిన ఈ ఆన్‌లైన్ ఓటింగ్ ప్రక్రియ వెబ్‌సైట్‌ను టీడీపీ సామాజిక మాధ్యమాల ఆన్‌లైన్ వేదికలపైకి విస్తృతంగా తీసుకెళ్లింది. ఇందులో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధితో పాటు అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా మీరు కోరుకుంటున్నారా? అన్న ఒకే ఒక్క ప్రశ్న ఉంటుంది. దాని కింద అవును/ కాదు అన్న ఆప్షన్లు ఉంటాయి. ఒకరు ఒకసారి మాత్రమే ఓటు వేసేలా ఈ వెబ్‌సైట్‌ను రూపొందించారు.
ఓటింగ్‌లో పాల్గొన్న వారి పేరు, ఫోన్ నంబర్, వారు ఏ జిల్లా , అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన వారు? వయస్సు, మహిళలా? పురుషులా? అన్న వివరాలు నమోదు చేయాలి. నాలుగు రోజుల వ్యవధిలోనే సుమారు 3.68 లక్షల మంది ఆన్‌లైన్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. వారిలో 94.36 శాతం మంది రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలని అభిప్రాయపడ్డారు. ఇలా సాగింది ఆ అమరావతి వార్త.
ఒకే అమరావతికి అంత భారీస్థాయిలో అనుకూలత వ్యక్తమవుతుందనే అనుకున్నాం. నిజంగా ఈ స్థాయిలో తమ డిమాండ్‌కు ప్రజాదరణ లభిస్తోందని టీడీపీ నమ్ముతోంటే…ఓటింగ్‌లో పాల్గొన్న వారి పేరు, ఫోన్ నెంబర్, జిల్లా, నియోజకవర్గ వివరాలను వెబ్‌సైట్‌లో బహిరంగ పరచాలి.
ఈ చిన్న వార్తలో ఏఏ ప్రాంతాల నుంచి అమరావతికి ఎంతెంత మద్దతు లభిస్తున్నదో వెల్లడించకపోవడంలోనే అసలు కిటుకు దాగి ఉంది. ఇదంతా టీడీపీ ఆడుతున్న మైండ్ గేమ్‌గా ఇట్టే తెలిసిపోతోంది. అమరావతిలోనే రాజధాని ఉండాలని ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి భారీ స్థాయిలో ఓట్లు పడి ఉంటే…ఆ వివరాలను ఖచ్చితంగా పెద్ద కథనమే రాసి ఉండేవారు.
కేవలం మొక్కుబడిగా…దాదాపు 95 శాతం మద్దతు ఉందని చెప్పుకోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ వెబ్‌సైట్‌ను చంద్రబాబు ప్రారంభించడంతోనే దాని విశ్వసనీయత పోయింది. ఏడాది క్రితం ఘోర పరాజయం పాలైన చంద్రబాబు చేపట్టే ఏ పనికైనా జనం నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిన విషయమే.
ఎటూ వెబ్‌సైట్‌లో వివరాలన్నీ పొందు పరిచారు కాబట్టి…ఓటర్ల ప్రాంతీయ, వయస్సుల వారీగా అదే వెబ్‌సైట్‌లో ప్రకటిస్తే, అసలు నిజానిజాలేంటో ప్రజలు నిగ్గు తేలుస్తారు. 95 శాతం అనుకూలతలో ఆ 29 గ్రామాలు మినహాయించి, మిగిలిన ప్రాంతాల ఆకాంక్ష ఏంటో జనం కూడా తెలుసుకోవాలనే ఆసక్తితో ఉన్నారు. కావున టీడీపీ ఆ వివరాలను పొందుపరిచి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.