విజ‌య‌వంత‌మైన కోచ్ వీడ్కోలు.. కానీ, ఎవ‌రికీ న‌చ్చ‌లేదే!

గ‌ణంకాల‌ను బ‌ట్టి చూస్తే.. టీమిండియాకు ల‌భించిన అత్యంత విజ‌య‌వంత‌మైన కోచ్ ల‌లో ముందు వ‌ర‌స‌లో నిలుస్తాడు రవి శాస్త్రి. ఈ మాజీ ఆట‌గాడు, కామెంటరీ బాక్సును వీడి టీమిండియాకు కోచ్ డ్ర‌స్సింగ్ రూమ్ లోకి…

గ‌ణంకాల‌ను బ‌ట్టి చూస్తే.. టీమిండియాకు ల‌భించిన అత్యంత విజ‌య‌వంత‌మైన కోచ్ ల‌లో ముందు వ‌ర‌స‌లో నిలుస్తాడు రవి శాస్త్రి. ఈ మాజీ ఆట‌గాడు, కామెంటరీ బాక్సును వీడి టీమిండియాకు కోచ్ డ్ర‌స్సింగ్ రూమ్ లోకి ఎంట‌ర‌య్యాడు కొంత కాలం కింద‌ట‌. 

రవిశాస్త్రి కోచ్ బాధ్య‌త‌ల్లో ఉండ‌గా…  భార‌త క్రికెట్ జ‌ట్టు ప‌లు మ‌ర‌పురాని విజ‌యాల‌ను అందుకుంది. వాటిల్లో ఆస్ట్రేలియాలో బోర్డ‌ర్- గ‌వాస్క‌ర్ ట్రోఫీ విజ‌యం, ఇంగ్లండ్ లో ఇటీవ‌ల టెస్టు సీరిస్ లో ఆధిప‌త్యం, కొన్నేళ్ల కింద‌ట ద‌క్షిణాఫ్రికాలో ఒక టెస్టు విజ‌యం, వ‌న్డే-టీ20 సీరిస్ ల ఘ‌న విజ‌యం.. వంటివి ప్ర‌ముఖ‌మైన‌వి. 

ఇదే స‌మ‌యంలో శాస్త్రి కోచ్ గా ఉండ‌గా.. టీమిండియా 2019 ప్ర‌పంచ‌క‌ప్ , ప్ర‌స్తుతం జ‌రుగుతున్న టీ20 ప్ర‌పంచ‌క‌ప్ ల‌లో పాల్గొంది. 2019 వన్డే ప్ర‌పంచ‌క‌ప్ కు హాట్ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగిన టీమిండియా సెమిస్ లో ఓట‌మి పాల‌య్యింది. ఇక ఇప్పుడు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ లో అవ‌మాన‌క‌ర‌మైన రీతిలో నిష్క్ర‌మించింది. 

ఇదే స‌మ‌యంలో ర‌విశాస్త్రి కోచ్ ప‌ద‌వీకాలం కూడా పూర్త‌య్యింది. 60 యేళ్ల‌లో ప‌డిన వ్య‌క్తి టీమిండియా కోచ్ ప‌ద‌వికి అన‌ర్హుడు. ఆ వ‌య‌సుకు రీచ్ కావ‌డంతో శాస్త్రి మ‌రో మాట లేకుండా త‌ప్పుకుంటున్నాడు. ఇప్ప‌టికే నూత‌న కోచ్ ఎంపిక జ‌రిగిపోయింది. రాహుల్ ద్రావిడ్ ఆ బాధ్య‌త‌లు తీసుకోనున్నాడు.

ఇక శాస్త్రి కోచ్ గా ఉండ‌గా.. టీమిండియా 45 టెస్టుల‌కు గానూ 23 టెస్టుల్లో నెగ్గింది. 76 వ‌న్డేల్లో 51, 65 టీ20ల్లో 43 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధించింది. ఇలా అన్ని ఫార్మాట్ల‌లోనూ మెరుగైన విజ‌య‌శాతాన్ని క‌లిగి ఉంది. ఒక అంత‌ర్జాతీయ జ‌ట్టు కోచ్ కు ఇది విజ‌య‌వంత‌మైన ట్రాక్ రికార్డే! ఏ విదేశీ కోచ్ ఆధ్వ‌ర్యంలోనో, మ‌రొకరి ఆధ్వ‌ర్యంలోనో ఈ  స్థాయి విజ‌యాలు సాధ్యం అయి ఉంటే.. భార‌త క్రికెట్ అభిమానులు ఆ కోచ్ వీడ్కోలు సంద‌ర్భంగా పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించే వారు. 

అయితే శాస్త్రికి అలాంటివి ద‌క్క‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూడా అంద‌రికీ తెలిసిందే. టీమిండియా క్లిష్ట ప‌రిస్థితుల్లో ఉండ‌గా శాస్త్రి కోచ్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌లేదు. కొహ్లీ పోక‌డ‌ల వ‌ల్ల మాత్ర‌మేశాస్త్రి కోచ్ గా వ‌చ్చారు. కుంబ్లే కోచ్ గా ఉండ‌గా..టీమిండియా  సాఫీగానే సాగుతున్న కుంబ్లేను కొహ్లీ సాగ‌నంపాడు. త‌న‌కు సెట్ అవుతాడ‌నే లెక్క‌ల‌తో.. త‌న‌ను బ‌య‌ట నుంచి అన్ని ర‌కాలుగానూ స‌మ‌ర్థిస్తున్న ర‌విశాస్త్రిని కోచ్ గా తెచ్చుకున్నాడు. 

అంత‌కు ముందు జ‌రిగిన ఇంట‌ర్వ్యూల్లో ర‌విశాస్త్రిని కోచ్ ఎంపిక ప్యాన‌ల్ తిర‌స్క‌రించింది. కుంబ్లే స‌రైన వ్యూహాల‌తో వ‌చ్చాడ‌ని, శాస్త్రి ఇంట‌ర్వ్యూకు కూడా స‌రిగా అటెండ్ కాలేద‌ని పేర్కొంది. అయితే కెప్టెన్ తో ప‌డ‌క కుంబ్లే ప‌ద్ధ‌తిగా త‌ప్పుకుంటే, శాస్త్రి కోచ్ అయిపోయాడు. అలా ఎంట్రీలోనే స‌గ‌టు క్రికెట్ అభిమాని మ‌న‌సును శాస్త్రి చూర‌గొన‌లేదు. ఇక 2019 ప్ర‌పంచ‌క‌ప్ కు స‌రైన ప్ర‌ణాళిక‌ను ర‌చించ‌డంలో కూడా శాస్త్రి ఏమంత చెప్పుకోద‌గిన ప‌ని చేయ‌లేదు. 

నంబ‌ర్ ఫోర్ ప్లేస్ లో స‌రైన బ్యాట్స్ మెన్ ను త‌యారు చేసుకోలేక‌పోవ‌డం అప్ప‌ట్లో తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీసింది. ఆ త‌ర్వాత కూడా శాస్త్రి కోచ్ గా చ‌లామ‌ణి అయ్యాడు. కెప్టెన్లు ఏం చెబితే అది చేసే కోచ్ గా పేరొచ్చింది. జ‌ట్టు జ‌యాప‌జ‌యాల్లో శాస్త్రికి ఎలాంటి క్రెడిట్ ఇవ్వ‌లేదు, మీడియా- అభిమానులు. దీంతో రవిశాస్త్రీ కీల‌క‌మైన హోదాలోనే ఉన్నా నిమిత్త‌మాత్రుడిగా మిగిలిపోయాడు. అదే రీతిన ఇప్పుడు నిష్క్ర‌మిస్తున్నాడు. మ‌రి శాస్త్రి ఇక మ‌ళ్లీ కామెంట‌రీ బాక్స్ లోకి ఎంట‌ర‌వుతాడో, లేక రిటైర్మెంట్ లైఫ్ ను ఆస్వాధిస్తాడో!