రోజుకు మూడు సార్లు కుప్పంలోని టీడీపీ నేతలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డితో సహా అరడజను మంది టీడీపీ అరివీరభయంకర నేతలు ఆ మైనర్ మున్సిపాలిటీలో టీడీపీని గెలిపించేందుకు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నారు! అన్ని రకాల అస్త్రశస్త్రాలనూ సంధించాలని.. ఎలాగైనా టీడీపీని కుప్పంలో గెలిపించాలని చంద్రబాబు నాయుడు వారికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు.
అంతేకాదు.. డబ్బు, మద్యం విషయంలో కూడా రాజీ వద్దని.. చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులకు ఆదేశాలు ఇస్తూ ఉన్నారు.. గెలుపే ప్రధానం తప్ప మరో మాటే వద్దని, ప్రత్యర్థులపై ఎదురు కేసులు పెట్టాలనే తన మార్కు వ్యూహాలను కూడా చంద్రబాబు నాయుడు జారీ చేస్తూ ఉన్నారు! ఇవన్నీ కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో వస్తున్న వార్తలు.
అయితే చంద్రబాబు నాయుడు మరీ అంత టెన్షన్ పడుతున్నారా? కుప్పంలో ఓటమి ఎదురైనా.. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అదో గెలుపా? అంటూ చంద్రబాబు నాయుడు వితాండవాదం చేసే అవకాశాలు ఎలాగూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కుప్పం ఎన్నికను చంద్రబాబు నాయుడు అంత సీరియస్ గా తీసుకుంటున్నారా? అనేది కొంతమంది డౌటు!
ఇదైతే నిజమే, ఎలాగూ ఓడిపోతే.. ఎన్నికల ప్రక్రియను చంద్రబాబు విమర్శిస్తారు. అక్రమాలు జరిగాయంటారు. అది వేరే కథ. అయితే అంతలోపు వీలైనంతగా విజయం కోసం మాత్రం అన్ని రకాల అస్త్రశస్త్రాలనూ సంధిస్తున్నారు. అంతర్గత వ్యూహాలే కాదు, అధికారిక వ్యూహాల్లో కూడా చంద్రబాబు తాపత్రయం బయటపడుతోంది.
కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక విషయంలో చంద్రబాబు నాయుడు ఎక్స్ అఫిషియో ఓటును నమోదు చేసుకోవడం గమనార్హం. కుప్పం నియోజకవర్గం ఎమ్మెల్యే హోదాలో చంద్రబాబు నాయుడు ఎక్స్ అఫిషియో ఓటు హక్కును నమోదు చేయించుకున్నారు! తద్వారా మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో పాల్గొనడానికి చంద్రబాబు అర్హత పొందారు! వార్డుల మెంబర్ల ఎన్నికలో పోటాపోటీ పరిస్థితి తలెత్తితే.. ఈ ఓటు కీలకం అవుతుంది.
ఒకటీ అర వార్డు మెంబర్ల ఓటు కూడా కీలకం అయినప్పుడు.. ఎక్స్ అఫిషియో ఓటుతో అయినా గట్టెక్కాలనే లెక్కలతోనే చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారు! ఇలా ఏ చిన్న అవకాశాన్నీ వదలకూడదని అనుకుంటున్నారనే క్లారిటీని ఇవ్వనే ఇచ్చారు!
తనది ప్రధాన మంత్రి స్థాయి అని స్వయంగా చెప్పుకునే చంద్రబాబు ఇలా సొంత నియోజకవర్గంలోని చోటా మున్సిపాలిటీ ఎన్నికలో గెలుపు కోసం ఇలా తొలిసారి ఎక్స్ అఫిషియో ఓటర్ గా మారిపోయి.. కుప్పం విషయంలో తన టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అందరికీ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మరి చంద్రబాబు ఇంతకు దిగాకా.. కుప్పంలో ఓటమి ఎదురైతే మాత్రం.. ఆయనకూ, టీడీపీకి అంతకన్నా అవమానం ఉండదు!