ఎన్నికల్లో ఎవరో ఒకరు మాత్రమే గెలుస్తారు. అలాగని ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎవరూ ఉండరు. గెలుపోటమలు శాశ్వతం కాదు. అదేంటో గానీ జనసేన మాత్రం ఎన్నికలంటే భయపడుతున్నట్టుంది. కేవలం మాటలతో టైం పాస్ చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిగిలిపోయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా తనకు అనుకూలమైన చోట కూడా ఆ పార్టీ పోటీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఉదాహరణకు కడప జిల్లా రాజంపేట మున్సిపాల్టీనే తీసుకుందాం. అక్కడ బలిజ సామాజిక వర్గం బలంగా ఉంది. తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌కల్యాణ్ స్థాపించిన జనసేన అంటే వారికి అభిమానం. రాజకీయంగా పవన్‌కల్యాణ్‌ను ఉన్నతంగా చూడాలని ముఖ్యంగా ఆయన సామాజిక వర్గానికి చెందిన యువత ఆకాంక్షిస్తోంది. అయితే అసలు ఎన్నికల్లోనే పాల్గొనకపోతే ఏం చేయాలని వారు ప్రశ్నిస్తుండడం గమనార్హం.
రాజంపేట మున్సిపాలిటీలో 29 వార్డులున్నాయి. ఇక్కడ 35 శాతం ఓటర్లు బలిజలే. ప్రస్తుతం రాజంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో జనసేన 5, ఆ పార్టీ మిత్రపక్షం 4 వార్డుల్లో పోటీ చేస్తున్నాయి. ఇద్దరూ పొత్తులో ఉన్నారా? లేదా? అనే విషయమై స్పష్టత లేదు. 10,17 వార్డుల్లోని బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బలమైన ఓటు బ్యాంకు, అభిమానులున్న రాజంపేటలో పూర్తిస్థాయిలో పోటీ చేయలేని నిస్సహాయ స్థితిపై జనసైనికులు అసంతృప్తిగా ఉన్నారు.
కనీసం తన సామాజిక వర్గానికి పట్టున్న చోట కూడా జనసేన అభ్యర్థులను నిలపలేకపోతే ఎలా అని కార్యకర్తలు మండిపడుతున్నారు. ఇలాగైతే 2024లో ఎలా పోటీ చేస్తుందని పవన్‌ను జనసైనికులు నిలదీస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి పలు దఫాలు బలిజ సామాజిక వర్గం నేతలు ప్రాతినిథ్యం వహించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
నిన్నటి వరకూ టీడీపీ వైపు మెజార్టీ బలిజలున్నారు. జనసేన వచ్చిన తర్వాత మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ నాయకుడికి పార్టీని బలోపేతం చేసుకో వాలనే ధ్యాస లేనప్పుడు తాము చేయగలిగిందేముంది? అని ప్రశ్నిస్తుండడం గమనార్హం. అన్నీ ఉండి సొమ్ము చేసుకోకపోవడం అంటే ఏంటో జనసేనను చూసి నేర్చుకోవాలనే సెటైర్స్ వెల్లువెత్తుతున్నాయి.