హైదరాబాద్ లో భారీ ఆన్ లైన్ మోసం

అడిగిన వెంటనే వ్యక్తిగత వివరాలు చెప్పుకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్డు డీటెయిల్స్, సీవీవీ నంబర్, పాస్ వర్డ్ లాంటివి ఎవ్వరికీ చెప్పడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఓవైపు ఇన్ని జాగ్రత్తలు…

అడిగిన వెంటనే వ్యక్తిగత వివరాలు చెప్పుకుండా జాగ్రత్త పడుతున్నారు. కార్డు డీటెయిల్స్, సీవీవీ నంబర్, పాస్ వర్డ్ లాంటివి ఎవ్వరికీ చెప్పడం లేదు. ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఓవైపు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ, మరోవైపు ఏదో ఒక రూపంలో ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ ఇలానే ఆన్ లైన్ మోసానికి గురైంది. ఏకంగా 24 లక్షల రూపాయలు పోగొట్టుకుంది.

చందానగర్ ప్రాంతంలో ఉండే బాధితురాలు లోకల్ గా రకరకాల వ్యాపారాలు చేస్తోంది. ఆమెకు ఆన్ లైన్ లావాదేవీలపై అవగాహన ఉంది. పరిమిత లావాదేవీలు జరిగేలా ఖాతాకు లిమిట్ కూడా పెట్టుకుంది. అయినప్పటికీ ఆమె లక్షల్లో డబ్బు కోల్పోయింది. దీనికి కారణం సిమ్ క్లోనింగ్.

బాధితురాలి మొబైల్ కు ఎస్ఎంఎస్ లేదా ఇతర మార్గాల ద్వారా మాల్ వేర్ ను పంపించారు. అది ఆమె క్లిక్ చేయగానే, ఆమె ఫోన్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పుడు ఆటోమేటిగ్గా బాధితురాలికి సిమ్ బ్లాక్ అయినట్టు చూపిస్తుంది. దీనిపై ఆమె కస్టమర్ కేర్ ను సంప్రదించింది. అదే నంబర్ పై సిమ్ యాక్టివేట్ అయ్యేందుకు దరఖాస్తు చేసుకుంది. కొన్ని గంటల్లోనే సిమ్ అన్ లాక్ అయింది. అయితే ఆ వెంటనే ఆమె ఎకౌంట్ నుంచి 24 లక్షల 14వేల రూపాయలు వేరే ఎకౌంట్ కు ట్రాన్సఫర్ అయ్యాయి.

సిమ్ ను యాక్టివేట్ చేయించేలోపు ఆన్ లైన్ దొంగలు.. ఆమె ఖాతాను ఆపరేట్ చేశారు. ముందుగా సంబంధిత బ్యాంక్ కు ఫోన్ చేసి (బాధితురాలి రిజిస్టర్ మొబైల్ నంబర్) ఎకౌంట్ లావాదేవీల లిమిట్ ను పెంచుకున్నారు. ఆ వెంటనే డబ్బులు వేరే ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. బాధితురాలు తన రోజువారీ లావాదేవీల్ని 5 లక్షలకే పరిమితం చేసుకునేలా లిమిట్ విధించుకున్నారు. దాన్ని ఆన్ లైన్ మోసగాళ్లు 25 లక్షలకు పెంచారు. ఆ వెంటనే డబ్బు కాజేశారు.

ఇక్కడ బాధితురాలు చేసిన తప్పు ఏంటంటే.. తన సిమ్ బ్లాక్ అయిన వెంటనే ఆ విషయాన్ని బ్యాంక్ అధికారులకు కూడా చెప్పకపోవడం. సిమ్ బ్లాక్ అయిన వెంటనే బ్యాంక్ కు ఫోన్ చేసి తన లావాదేవీల్ని తాత్కాలికంగా ఆపేయమని ఆమె కోరి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. జరిగిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఏఏ ఖాతాల్లోకి డబ్బులు వెళ్లాయో గుర్తించారు. ఆ ఖాతాల్ని ఫ్రీజ్ చేసే పనిలో ఉన్నారు.