హుజూరాబాద్ ఎన్నికల్లో విజేతగా నిలిచిన ఈటలకు ఆ సంతోషం కొన్నిరోజులు కూడా లేకుండా చేశారు కేసీఆర్. వెంటనే పాత కేసులు తిరగదోడారు. హుజూరాబాద్ లో టీఆర్ఎస్ పరాజయాన్ని కూడా ఎవరూ ఎక్కువ రోజులు గుర్తు పెట్టుకోకుండా మేనేజ్ చేశారు.
ఎప్పుడూ బయటకి రాని సారు.. రెండ్రోజులు వెంటవెంటనే రెండు సుదీర్ఘ ప్రెస్ మీట్లు పెట్టి కేంద్రాన్ని చెడామడా తిట్టిపడేశారు. బస్తీమే సవాల్ అన్నారు. బండి, గుండు అంటూ వ్యక్తిగతంగా కామెంట్లు చేసి ఓ మెట్టు దిగారు. పెట్రోల్ రేట్లు, వరి కొనుగోళ్లపై కేసీఆర్ ని ప్రతిపక్షాలు టార్గెట్ చేయాలనుకుంటే.. రైతు చట్టాలంటూ మోదీని ఇరుకున పెట్టేందుకు ప్లాన్ గీశారు.
ఒకప్పుడు మాటలే మంత్రం..
కేసీఆర్ మాటల మాంత్రికుడనే విషయం అందరికీ తెలిసిందే. తొలి దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత తన క్రేజ్ తగ్గుతుందని ముందే గ్రహించి, ముందస్తు ఎన్నికలకు వెళ్లారు, అత్యథిక మెజార్టీ కావాలంటూ లాజిక్ లేని రీజన్ చెప్పి, పరువు పూర్తిగా మంటగలవకముందే ఎన్నికలు జరిపించి మమ అనిపించారు.
ఆ తర్వాత కూడా కేసీఆర్ పాలన పెద్దగా కొత్త పుంతలు తొక్కలేదు. ఆదాయం బాగున్న రాష్ట్రం కాబట్టి బండి నడుస్తుంది కానీ, తెలంగాణ ప్రజలు రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా లాభపడింది లేదు, నిరుద్యోగుల కలలు పండింది లేదు. అయితే ప్రతిపక్షాలు బలంగా లేకపోవడం, కేసీఆర్ నోటి బలం.. అక్కడ టీఆర్ఎస్ కి తిరుగులేకుండా చేశాయి.
కానీ ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వచ్చేలా కనపడుతున్నాయి. ఈటల వంటి పోరాట స్ఫూర్తి ఉన్న నాయకులు బయటకు రావడం, కేసీఆర్ నియంతృత్వ, నిరంకుశ ధోరణిపై సర్వత్రా విమర్శలు రావడంతో దుబ్బాక, హుజూరాబాద్ వంటి ఉప ఎన్నికల్లో గులాబి జెండా రెపరెపలాడలేకపోయింది. ఈ క్రమంలో మరోసారి కేసీఆర్ నష్టనివారణ చర్యల కోసం బయటకొచ్చారు. కేంద్రాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. రాష్ట్రంలో జరుగుతున్న అనర్థాలన్నిటికీ కేంద్రమే కారణం అని చెబుతున్నారు.
కేసీఆర్ మంత్రాంగం పనిచేస్తుందా..?
గతంలో కేసీఆర్ మాటలకు జనం పడిపోయేవారు. కానీ ఈసారి ఆయన మాటల విలువ ఏంటో.. దళితబంధు వంటి పథకాల ఫలితం ఏంటో హుజూరాబాద్ తేల్చేసింది. సో.. ఇకపై కేసీఆర్ మాటల మంత్రాంగం ఫలించదు, అంతకు మించి ఆయన ఏదైనా చేయగలిగితేనే అధికారం నిలుపుకోగలరు.
పదే పదే కేంద్రంపై దుమ్మెత్తి పోసినా ఫలితం లేదనే విషయం కేసీఆర్ కి తెలుసు. అయినా కూడా వరుస ప్రెస్ మీట్లతో కేంద్రాన్ని టార్గెట్ చేశారు. ప్రశ్నిస్తే దేశద్రోహి అనే ముద్ర వేస్తారా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు.
నీళ్లొచ్చాయి.. నిధులున్నాయి.. ఉద్యోగాలేవి..?
తెలంగాణ ఏర్పాటుకి మూలకారణమైన ఉద్యోగాల విషయంలో కేసీఆర్ ఇప్పటివరకూ సరైన చర్యలు చేపట్టలేదు. గతంలో ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని మాట తప్పారు, ఆ తర్వాత ఇంటికో ఉద్యోగం అన్నారు. ఇప్పుడు అదీ లేదు.
సాఫ్ట్ వేర్ రంగం పరుగులు పెడుతోందంటూ చంకలు గుద్దుకుంటున్నా.. అందులో తెలంగాణ పిల్లలు ఎంతమందికి కొలువులున్నాయని లెక్క తీస్తే నిరుద్యోగులు రగిలిపోవాల్సిందే. ఇక ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సైతం కేసీఆర్ మీనమేషాలు లెక్కబెడుతున్నారు.
అంతెందుకు.. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలోకి వచ్చారు, తెలంగాణలో మాత్రం ఇంకా సంస్థతోపాటే కష్టాల్లో కుస్తీ పడుతున్నారు. రేవంత్ రెడ్డి, షర్మిల కూడా ఉద్యోగాల విషయంలోనే కేసీఆర్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇకనైనా సారు మారితే కారుకి ఢోకా లేదు. మాటలనే నమ్ముకుంటే మాత్రం ప్రతి నియోజకవర్గానికి ఓ ఈటల రెడీ అవుతారు.