పుష్కలంగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అదే స్థాయిలో పుష్కలంగా థియేటర్లు అందుబాటులో ఉంటున్నాయి. అదేంటి.. సినిమాలు ఎక్కువగా రిలీజైతే థియేటర్ల కొరత ఉండాలి కదా? అలాంటిదేం లేదు. వీకెండ్ అయ్యేసరికి సినిమాలొస్తున్నాయి. వీకెండ్ ముగిసేసరికి థియేటర్లు ఖాళీ అవుతున్నాయి. అలా తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నాటికి సినిమా హాళ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఒక్కటంటే ఒక్క సినిమా కూడా నిలబడడం లేదు.
గత వారం సినిమాల్నే తీసుకుంటే.. ఎనిమి, పెద్దన్న, మంచిరోజులు వచ్చాయి సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. వీటిలో పెద్దన్న సినిమా రెండో రోజుకే దుకాణం సర్దేసింది. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించాడనే కనికరం కూడా లేకుండా ప్రేక్షకులు తిప్పికొట్టారు ఈ సినిమాని. ఇక ఎనిమి సినిమా మొదటి 3 రోజులు మాత్రమే ఆడింది. గట్టిగా నిలబడుతుందనుకున్న మారుతి సినిమా పరిస్థితి కూడా మూడు రోజుల ముచ్చటే అయింది.
ఏ సినిమాకు ఎంత వసూళ్లు?
కలెక్షన్ల వారీగా చూసుకుంటే.. రజనీకాంత్ నటించిన పెద్దన్న సినిమాకు మొదటి 4 రోజులు (గురువారం రిలీజైంది కాబట్టి ఫస్ట్ వీకెండ్ కింద లెక్క) కేవలం 3 కోట్ల 16 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. ఈ సినిమాను సురేష్ బాబు, సునీల్ నారంగ్ కలిసి తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేశారు. తమకు చెందిన అన్ని థియేటర్లలో ఒకేసారి సినిమాని డంప్ చేశారు. కానీ ఫలితం మాత్రం శూన్యం. బ్రేక్ ఈవెన్ కు ఆమడ దూరంలోనే ఆగిపోయాడు పెద్దన్న.
ఇక ఎనిమి సినిమా విషయానికొస్తే, ఈ మూవీపై తెలుగు ఆడియన్స్ లో పెద్దగా బజ్ లేదు. విశాల్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్తున్నాయి. అందుకే ఎనిమిని కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. రిలీజైన మొదటి రోజు ఆక్యుపెన్సీ లేక చాలా చోట్ల ఈ సినిమా షోలు రద్దయ్యాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా 4 రోజుల్లో ఈ సినిమాకు కేవలం 2 కోట్ల 12 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది.
ఇక మంచి రోజులు వచ్చాయి సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చినప్పటికీ, మౌత్ టాక్ మంచిగా లేక రెండో రోజు నుంచి చతికిలపడింది. ఓవైపు యూనిట్ అంతా కలిసి థియేటర్లు చుట్టొచ్చినా ఫలితం కనిపించలేదు. మొదటి రోజు కోటి రూపాయల షేర్ సాధించిన ఈ సినిమా, 4 రోజులు తిరిగేసరికి కేవలం రెండున్నర కోట్ల రూపాయల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వీటికంటే ముందొచ్చిన వరుడు కావలెను, నాట్యం లాంటి సినిమాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.
ప్రస్తుతం పరిస్థితేంటి?
గతవారం చెప్పుకోదగ్గ సినిమాలు 3 వచ్చినప్పటికీ.. ఏదీ నిలబడలేదు. దీంతో నిన్నట్నుంచే తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లన్నీ ఖాళీ అయ్యాయి. ఆక్యుపెన్సీ లేక చాలా చోట్ల షోలు రద్దు చేస్తున్నారు. కొత్త సినిమాల కోసం మళ్లీ ఎదురుచూపు మొదలైంది. ఈ వారాంతం పుష్పకవిమానం, రాజా విక్రమార్క లాంటి సినిమాలొస్తున్నాయి. చిన్న సినిమాలు కదా, వీటికి థియేటర్లు దొరుకుతాయా అనే సందేహం అస్సలు అక్కర్లేదు. కోరినన్ని థియేటర్లు కేటాయించడానికి అంతా సిద్ధంగా ఉన్నారు.
గీతా నుంచి సురేష్ ప్రొడక్షన్స్, వెంకటేశ్వర క్రియేషన్స్ వరకు అన్ని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎర్ర తివాచీ పరిచి మరీ ఎదురుచూస్తున్నాయి. కాస్త లాభాలు తగ్గించుకొని మరీ ఆకర్షణీయమైన పర్సంటేజీలు ఆఫర్ చేస్తున్నాయి. మొన్నటికిమొన్న ఓ చిన్న సినిమా థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటే.. చాలా డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు ఎగబడ్డాయి. ఏమాత్రం బజ్ లేకపోయినా అటుఇటుగా 200 థియేటర్లు కేటాయించడానికి సిద్ధపడ్డాయి. మరోసారి థియేటర్లు మూసుకోవడం కంటే, కనీసం కరెంట్ బిల్లు, టాక్స్ ఖర్చులొచ్చినా చాలు అన్నట్టుంది పరిస్థితి.
అమెజాన్ ప్రైమ్ ఓ కొత్త కండిషన్ తీసుకొచ్చింది. బడా సినిమాలు తప్పిస్తే, చిన్న సినిమాల్ని అది నేరుగా డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కింద తీసుకోవడం లేదు. అమెజాన్ ప్రైమ్ రిలీజ్ అనే కార్డ్ వేయడానికి ఇష్టపడడం లేదు. దీంతో తమ సినిమాను డైరక్ట్ గా అమెజాన్ కు ఇచ్చేద్దామనుకునే చిన్న నిర్మాతలకు చిక్కొచ్చి పడింది.
ఇతర ఓటీటీలు డైరక్ట్ రిలీజ్ కింద సినిమాలు తీసుకుంటున్నప్పటికీ అమెజాన్ అంత జోరుగా తీసుకోవడం లేదు, అంత ఎక్కువగా డబ్బులు ఇవ్వడం లేదు. దీంతో చిన్న నిర్మాతలంతా తప్పనిసరి పరిస్థితుల మధ్య నామ్ కే వాస్తే తమ సినిమాల్ని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఆ తర్వాత అమెజాన్ కు అమ్మేస్తున్నారు. అమెజాన్ కనుక ఆ కండిషన్ పెట్టకపోయి ఉంటే, వీకెండ్ లో కూడా సినిమా హాళ్లు ఖాళీగా ఈగలు తోలుకుంటూ ఉండేవి.
మొన్నటివరకు ఏపీకి సంబంధించి టిక్కెట్ రేట్లను బూచిగా చూపించారు చాలామంది టాలీవుడ్ పెద్దలు. కానీ కొన్ని సినిమాలకు వచ్చిన వసూళ్లతో అది కేవలం అపోహ అని తేలిపోయింది. కంటెంట్ బాగుంటే ఆక్యుపెన్సీ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిగ్గా డబ్బులొస్తాయి. కటౌట్ ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి, ఆ కటౌట్ కు తోడు సరైన కంటెంట్ పడితేనే థియేటర్లలో ఆదరణ. లేదంటే, సినిమాల జాతకమే కాదు, థియేటర్ల పరిస్థితి కూడా తారుమారు అయ్యే ప్రమాదం ఉంది.