తుమ్మ‌ల ఇంటికి కాంగ్రెస్ నేత‌ల క్యూ

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇంటికి కాంగ్రెస్ నేత‌లు క్యూ క‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి ఓడిపోయిన తుమ్మ‌ల‌కు సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేదు. పాలేరు నుంచి తుమ్మ‌ల‌పై…

మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇంటికి కాంగ్రెస్ నేత‌లు క్యూ క‌ట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌త ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి ఓడిపోయిన తుమ్మ‌ల‌కు సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేదు. పాలేరు నుంచి తుమ్మ‌ల‌పై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉపేంద‌ర్‌రెడ్డి ఆ త‌ర్వాత కాలంలో అధికార పార్టీలో చేరారు. ఇటీవ‌ల ఆయన‌కే టికెట్‌ను సీఎం కేసీఆర్ ఖ‌రారు చేశారు. దీంతో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు రాజ‌కీయ భ‌విష్య‌త్ ప్ర‌శ్నార్థ‌క‌మైంది.

ఇటీవ‌ల హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మానికి తుమ్మ‌ల భారీ ర్యాలీ నిర్వ‌హించి బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న చేశారు. ఈ ద‌ఫా ఎట్టి ప‌రిస్థితుల్లోనూ బ‌రిలో వుంటాన‌ని స్ప‌ష్టం చేసిన తుమ్మ‌ల‌, ఏ పార్టీ నుంచో చెప్ప‌లేదు. తుమ్మ‌ల అనుచ‌రులు మాత్రం కాంగ్రెస్‌లో చేరాల‌ని ఆయ‌న‌పై ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తుమ్మ‌ల‌తో టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌, ఖ‌మ్మం జిల్లా కాంగ్రెస్ నాయ‌కుడు పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి క‌ల‌వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాలు చేశార‌ని, ఆయ‌న వ‌స్తే కాంగ్రెస్‌కు బ‌లం అని నేత‌లు అన్నారు. కాంగ్రెస్‌లోకి వ‌స్తే త‌గిన ప్రాధాన్యం ఇస్తామ‌ని ఆ పార్టీ నాయ‌కులంతా హామీ ఇచ్చారు. దీంతో తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కూడా కాంగ్రెస్ వైపు మొగ్గుతున్నారు. 

త‌న‌కు టికెట్ ఇవ్వ‌కుండా అవ‌మానించిన బీఆర్ఎస్‌లో వుండ‌డం కంటే, గౌర‌వించే పార్టీలోకి వెళ్ల‌డం మంచిద‌నే ఆలోచ‌న‌లో తుమ్మ‌ల ఉన్న‌ట్టు తెలిసింది. దీంతో త్వ‌ర‌లో కాంగ్రెస్‌లో చేరేందుకు తుమ్మ‌ల సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది.