వైవాహిక వ్యవస్థలో ఇదొక విచిత్రమైన ఘటన. ఇంకా చెప్పాలంటే అప్పుడెప్పుడో ఈవీవీ సత్యనారాయణ తీసిన ఓ సినిమాను గుర్తుకుతెచ్చే ఉదంతం ఇది. పెళ్లికి ముందు ఉన్న రిలేషన్ షిప్ ను వదిలేసి, వేరే వ్యక్తిని పెళ్లాడుతుంది మహిళ. కానీ ప్రియుడు మాత్రం ప్రేయసిని వదలడు. భర్తను వదిలి వచ్చేయమంటాడు. తీరా భర్తను వదిలి వచ్చిన తర్వాత ప్రియుడు పరార్. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది ఈ ఘటన.
జిల్లాలోని ఇల్లెంతకుంట మండలానికి చెందిన రజిత-రమేష్ ప్రేమించుకున్నారు. అయితే అనుకోని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారు. అదే టైమ్ లో రజితకు ఇంట్లో సంబంధాలు చూశారు. శేఖర్ అనే వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే రజిత ప్రియుడు రమేష్ మాత్రం ఆమెను వదల్లేదు. ఏకంగా రజిత అత్తవారింటికి వెళ్లి, రజితను తనతో పంపించమని వేడుకునేవాడు. రజితను కూడా తనతో వచ్చేయమని బలవంతం చేయసాగాడు. ఈ క్రమంలో విసిగిపోయిన శేఖర్ తల్లిదండ్రులు.. రజితను ఇంటి నుంచి పంపించేశారు.
అలా భర్తకు దూరమైన రజిత.. ప్రియుడు రమేష్ ఇంటికి చేరుకుంది. అయితే అక్కడ రమేష్ తల్లిదండ్రులు అడ్డంతిరిగారు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు. కానీ న్యాయం రజితవైపే మొగ్గుచూపింది. పెద్దల సమక్షంలో 6 నెలల్లో రజిత-రమేష్ పెళ్లి చేయాలనే ఒప్పందం కుదిరింది.
అంతా ఓకే, కథ సుఖాంతం అనుకున్న టైమ్ కు ఊహించని పరిణామం. రమేష్, తన కుటుంబ సభ్యులతో సహా ఇంటికి తాళం వేసుకొని పరారయ్యాడు. దీంతో రజిత రోడ్డున పడింది. అటు భర్త దగ్గరకు వెళ్లలేక, ఇటు ప్రియుడి ఆచూకి తెలియక ఆమె సతమతమౌతోంది.