టీడీపీ అధినేత చంద్రబాబు పేరిట ఆగస్టులో చాలా రికార్డులే ఉన్నట్టున్నాయి. ఆగస్టు నెలతో టీడీపీకి ప్రత్యేక అనుబంధం ఉంది. టీడీపీ పాలిట ఆగస్టు సంక్షోభాల నెలగా విస్తృత ప్రాచుర్యం పొందింది. ఆగస్టు అంటే చాలు…టీడీపీ నేతలకు గుండె దడే. దీనికి గల కారణాల గురించి అనేక సార్లు చెప్పుకున్నాం.
తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్ గతం తాలూకూ రక్త జ్ఞాపకాలు కళ్ల ముందు మెదిలేలా చేస్తున్నాయి. ట్విటర్ వేదికగా చంద్రబాబుపై విజయసాయిరెడ్డి ఘాటైన ట్వీట్ చేశారు. చంద్రబాబు పాలనలో బషీర్‌బాగ్‌లో కాల్పులకు ముగ్గురు వామపక్షాల కార్యకర్తలు మృత్యువాత పడ్డారు.
ఆ దుర్ఘటనకు నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అదిరిపోయే పంచ్‌లతో ఆ ట్వీట్ వైసీపీ శ్రేణులకు ఎంతో స్వీట్‌గా, టీడీపీ శ్రేణులకు హాట్‌గా ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. ఆ ట్వీట్ కథాకమామీషూ ఏంటో తెలుసుకుందాం.
“విశ్వాస ఘాతకుడిగా 25 ఏళ్లు పూర్తి చేసుకొని ఆగస్ట్25న ''వెన్నుపోటు'' దినోత్సవం జరుపుకున్న బాబు.. ఆగస్ట్28 ''చంద్రన్న రక్తపాత దినోత్సవం'' జరుపుకుంటున్నారు. బషీర్‌బాగ్‌లో బాబు సృస్టించిన మారణహోమం నేటికి 20 ఏళ్లు. నీవు ఎంత క్రూరుడివో, ఎంతటి విధ్వంసకారుడివో చరిత్రే చెబుతుంది బాబు” అంటూ విజయసాయిరెడ్డి చురకలంటించారు.
ప్రపంచబ్యాంక్ షరతులకు తలొగ్గి విద్యుత్‌రంగ సంస్కరణల్లో భాగంగా చంద్రబాబు సర్కార్ విద్యుత్‌చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. సరిగ్గా 20 ఏళ్ల కిందట.. 2000 సంవత్సరం ఆగస్టు 28న నాటి సీఎం చంద్రబాబు నాయుడి నిరంకుశత్వానికి హైదరాబాద్ నడిబొడ్డున, అసెంబ్లీకి సమీపంలో పోలీసుల దాష్టీకానికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బాబు దుష్ట పాలనకు ఆ దుర్ఘటన పరాకాష్టగా నిలిచింది. దాన్ని గుర్తు చేస్తే విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం…ఆయనలోని సమయోచిత స్పందనను తెలియజేస్తోంది.