మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి అచ్చెదిన్ (మంచిరోజులు) వచ్చినట్టేనా?. ఎందుకంటే ఆయన జబ్బులను నయం చేసే మందు బెయిల్ రూపంలో దొరికింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి హైకోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది. ఈఎస్ఐ భారీ కుంభకోణం కేసులో ఏసీబీ అధికారులు రెండు నెలల క్రితం అచ్చెన్నను అరెస్టు చేశారు.
అరెస్ట్ నాటికి ఆయనకు పైల్స్‌కు శస్త్ర చికిత్స జరగడంతో కోర్టు ఆదేశాల మేరకు గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో కొంత కాలం ఉ న్నారు. అయితే సుదీర్ఘ ప్రయాణంతో ఆయనకు గాయం తిరగబడింది. దీంతో ఆయనకు మరోసారి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అనంతరం ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. అయితే తనకు ఇంకా ఆనారోగ్యంగా ఉందని, మెరుగైన వైద్యం కోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాలని హైకోర్టును ఆయన ఆశ్రయించారు.
హైకోర్టు మానవీయ కోణంలో ఆలోచించి మెరుగైన వైద్యం అచ్చెన్న కోరినట్టు వైద్యం చేయించుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన రమేశ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆల్రెడీ అయిపోయిన ఆపరేష న్‌కు రమేశ్ ఆస్పత్రిలో దాదాపు నెలకు పైబడి వైద్యం అందించి పేరుకు తగ్గట్టే “సూపర్” అనిపించారు. ఆయన్నుఇక జైలుకు తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో అచ్చెన్నను కరోనా కరుణించిందనే సెటైర్లు పేలాయి.
ఇటీవల కోర్టు ఆదేశాలతో ఆయన్ను రమేశ్ ఆస్పత్రి నుంచి మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి తరలించి కరోనాకు చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయనకు హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో టీడీపీ శ్రేణుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రూ.2 లక్షల ష్యూరిటీ, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లొద్దని, సాక్షులను తారుమారు చేయవద్దని, దర్యాప్తు అధికారికి అందుబాటులో ఉండాలనే షరతులతో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఇదిలా ఉండగా బెయిల్ మంజూరు కావడం, జైలు భయం కూడా లేకపోవడంతో, జబ్బులు ఆయన దగ్గరికి పోవడానికి సాహసించే అవకాశం లేదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇదేం లాజిక్కో మరి!