పవన్ మీద ఎంత నమ్మకమో…?

ఆయనేమో జనసేనకు బీజేపీకి మధ్య మితృత్వం ఉంది అన్న సంగతికి కనీసంగా ఎక్కడా ప్రస్థావించిన దాఖలాలు లేవు. బీజేపీ నేతలు మాత్రం జనసేన మా మిత్రపక్షం అని కనిపించిన ప్రతీ చోటా చెబుతారు. కానీ…

ఆయనేమో జనసేనకు బీజేపీకి మధ్య మితృత్వం ఉంది అన్న సంగతికి కనీసంగా ఎక్కడా ప్రస్థావించిన దాఖలాలు లేవు. బీజేపీ నేతలు మాత్రం జనసేన మా మిత్రపక్షం అని కనిపించిన ప్రతీ చోటా చెబుతారు. కానీ బీజేపీ వారు కూడా ఒంటరిగానే కార్యక్రమాలు చేపడతారు తప్ప జనసేనను దేనికీ పిలవరు.

ఇక జనసేన సొంత కార్యక్రమాలు ఎలాగూ ఉన్నాయి. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికి రెండు సార్లు చంద్రబాబుతో సమావేశం అయ్యారు. రెండవసారి స్వయంగా ఇంటికి వెళ్ళి మరీ రెండున్నర గంటల పాటు వన్ టూ వన్ భేటీ జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట పోరాటం చేస్తామని మీడియాకు చెప్పుకున్నారు.

కళ్ల ముందు ఇంత జరుగుతున్నా బీజేపీ మాత్రం పవన్ మా మిత్రుడే అంటోంది. పైగా జస్ట్ అలా పవన్ వెళ్ళి చంద్రబాబుని కలిశారంతే అని చెబుతోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అయితే బీజేపీ జనసేన బంధం కొనసాగుతుంది అని నమ్మ బలుకుతున్నారు.

ఏపీలో మా రెండు పార్టీల మధ్యనే పొత్తు ఉంది అని చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబును ఎందుకు కలిశారు అంటే కలవడంలో తప్పు లేదు కదా అంటున్నారు. పైగా అంశాల వారీగా రెండు పార్టీల మధ్య అవగాహన కావచ్చు అని ఎవరికీ అర్ధం కానీ కొత్త బంధాన్ని తెర మీదకు తెచ్చారు.

రెండు పార్టీల అధినేతలు కలిస్తే ఎన్నికల పొత్తులే అని ఎలా చెబుతామని మీడియాను నిలదీశారు. ఈ రోజుకీ బీజేపీ జనసేన కలసి ఉన్నాయని ఆయన చెబుతూంటే నమ్మాల్సిందే. నిజమే బీజేపీ నుంచి వేరు పడుతున్నామని జనసేన ఎక్కడా చెప్పడంలేదు, కానీ జగన్ సర్కార్ మీద చేసే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం ఏదో బీజేపీతో కలసి ఎందుకు చేయడం లేదు అంటే కమలనాధులు మాటలు రాక తడుముకుంటున్నారు.

అవన్నీ మాకు తెలియవండీ బీజేపీ జనసేన మిత్రులు అంతే ఇదే మా మాట మీరు అదే వినేసి ఒప్పేసుకోండి అని బీజేపీ వారు డబాయింపుగా అంటూంటే మధ్యలో మీడియాకు ఏమి పోయింది. ఓకే ఈ రెండు పార్టీలు మంచి మిత్రులే కాదు భలే మిత్రులు అని కూడా అనుకోవాల్సి వస్తోంది.