“బీడీలు తాగండి బాబులూ.. తాగి స్వర్గాన్ని తాకండి బాబులు” అంటూ గతంలో పాట అందుకున్నాడు బాలయ్య. అలా స్వర్గాన్ని తాకాలంటే చుట్టను ఎలా తాగాలో స్వయంగా వివరిస్తున్నాడు.
“నాన్నగారిలా నాకు చుట్ట అలవాటుంది. పొద్దున్నే మూడున్నరకు లేచి చుట్ట కాలుస్తాను. అది నాకు అలవాటు. పైగా వాయిస్ కు చుట్ట చాలా మంచిది. స్ట్రా నుంచి లోపలకు డ్రింక్ ఎలా తాగుతామో అలా చుట్ట పొగను లోపలకు పీల్చుకోవాలి. అలా పొగను లోపలకు తీసుకున్నప్పుడు లంగ్స్ లో ఉన్న శ్లేష్మం అంతా బయటకు వచ్చేస్తుంది. మాకు వాయిస్ చాలా ఇంపార్టెంట్. డైలాగ్ చెప్పేటప్పుడు జీర వస్తే నాకు కాన్ఫిడెన్స్ పోతుంది. అందుకే చుట్ట తాగుతాను. దాన్ని బలంగా లోపలకు పీల్చుకుంటాను.”
ఇలా తన చుట్ట వేదాంతాన్ని బయటపెట్టారు బాలయ్య. సిగరెట్ కంటే చుట్ట చాలా మంచిదంటున్నారు. సిగరెట్ అయితే పొగను బాగా లోపలకు పీలుస్తారట. అదే చుట్ట అయితే పైపైన పీల్చి వదిలేస్తే సరిపోతుందట. ఇదేం లాజిక్కో బాలయ్యకే తెలియాలి.
“నాటు పొగాకు చుట్టల స్టాక్ నా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. లొకేషన్ కు ఎప్పుడూ నాతో పాటు నా చుట్టల పెట్టె తీసుకెళ్తాను. పాత్రకు ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలీదు, అందుకే చుట్టల పెట్టె ఉంచుకుంటాను. వీరసింహారెడ్డి పాత్రకు చుట్ట పెట్టాం. గుండెలో రగులుతున్న కోపం, ఆవేశాన్ని పొగ రూపంలో సింబాలిక్ గా వదిలితే చాలా బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పాను.”
ఇలా తన చుట్టకు, వీరసింహారెడ్డి సినిమాకు బలీయమైన సంబంధం పెనవేసుకుపోయిందన్నారు బాలయ్య. సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.