మెగా తండ్రికొడుకులు చిరంజీవి, రామ్ చరణ్. ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉంటారు. కానీ ఎన్ని రోజులకు కలుసుకుంటారు? ఇదే ప్రశ్న చిరంజీవికి ఎదురైంది. దీనిపై చిరు కాస్త బాధ వ్యక్తం చేశారు. చరణ్ ను బాగా మిస్ అవుతున్నానని బాధపడ్డారు.
“చరణ్ జపాన్ వెళ్లాడు, ఆ టైమ్ లో కలవలేదు. అట్నుంచి ఇలా వచ్చి అలా టాంజానియా వెళ్లిపోయాడు. రాగానే 2 రోజులాగి షూట్ కోసం న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అట్నుంచి వచ్చి మరో 2 రోజులుండి అమెరికా వెళ్లిపోయాడు. ఈమధ్యలో చరణ్ ఇంటికొచ్చినప్పుడు నేను ఇంట్లో లేను.”
ఇలా చరణ్ ను మిస్సవుతున్న విషయాన్ని బయటపెట్టారు చిరు. తామిద్దరం రెగ్యులర్ గా కలుసుకోవడం లేదని అన్నారు. చరణ్ చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు తను ఎదుర్కొన్న పరిస్థితి, ఇప్పుడు మళ్లీ రిపీట్ అయిందంటున్నారు.
“వాడు చిన్నగా ఉన్నప్పుడు అస్సలు కలవలేకపోయేవాడ్ని. పొద్దున్న వెళ్లిపోయి రాత్రి వచ్చేవాడ్ని. నా భార్య పదేపదే కలవమని చెప్పేది. నిద్రపోతున్న చరణ్ ను ఓ ముద్దుపెట్టి వెళ్లిపోయేవాడ్ని. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి వచ్చింది. నేను బిజీ, వాడు కూడా బిజీ అయిపోయాడు.”
అయితే ఇకపై ఆ పరిస్థితి ఉండదంటున్నారు చిరంజీవి. తన ఇంట్లోనే పై పోర్షన్ ను చరణ్ కోసం ఆయన సిద్ధం చేశారు. మరికొన్ని రోజుల్లో ఉపాసనతో కలిసి చరణ్ తన ఇంటికి వచ్చేస్తున్నాడని, ఇకపై తనతోనే ఉంటాడని, షూటింగ్స్ లేకపోతే కలిసి లంచ్ చేస్తామని ఆనందంగా చెప్పుకొచ్చారు చిరు.