ఆర్ఆర్ఆర్ లోని నాటు-నాటు పాటకి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంపై చాలామంది చాలా రకాలుగా స్పందించారు. ఏపీ సీఎం జగన్ కూడా ట్వీట్ వేసి సినిమా యూనిట్ కి శుభాకాంక్షలు తెలిపారు. అయితే ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీ ఇచ్చిన సమాధానంతో జగన్ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. జగన్ కి ఏదో హితబోధ చేయాలనుకున్న అద్నాన్.. నెటిజన్ల నుంచి, ముఖ్యంగా తెలుగు వారి నుంచి ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు.
జగన్ ఏమన్నారు..?
“తెలుగు జెండా ఉవ్వెత్తున ఎగురుతోంది. ఆంద్రప్రదేశ్ తరపున కీరవాణి, రాజమౌళి, తారక్, రామ్ చరణ్, ఆర్ఆర్ఆర్ టీమ్ కి శుభాకాంక్షలు. మిమ్మల్ని చూసి మేము గర్వపడుతున్నాం.” అని ట్వీట్ చేశారు సీఎం జగన్.
అద్నాన్ రియాక్షన్ ఏంటి..?
ఇందులో తెలుగు జెండా అనేది అద్నాన్ సమికి నచ్చలేదట. తెలుగు జెండా కాదు, భారతీయ జెండా అని అనాలంటున్నారాయన. అక్కడితో ఆగలేదు. మనమంతా ముందు భారతీయులం, ఆ తర్వాతే ప్రాంతాల వారీగా వేర్వేరుగా ఉంటున్నాం. ఇలా ప్రాంతాలు, భాషల పేర్లు చెప్పి మిమ్మల్ని మీరు దేశం నుంచి వేరు చేసుకోవద్దు. అంతర్జాతీయ అవార్డుల విషయంలో మనమంతా ముందు భారతీయులమే అని సెలవిచ్చాడు అద్నాన్. ఇలాంటి సెపరేటిస్ట్ యాటిట్యూడ్ వల్లే 1947లో దేశ విభజన జరిగిందని పెద్దపెద్ద మాటలు మాట్లాడాడు.
అసలు జగన్ ట్వీట్ లో తప్పేంటి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. తెలుగు సినిమాకి అవార్డు రావడాన్ని, తెలుగు జెండా ఎగిరింది అనడాన్ని తప్పుబడితే ఎలా. గతంలో పీవీ సింధు ఒలంపిక్ గెలిచినప్పుడు కూడా తెలుగు తేజం అన్నారు కదా. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన సినిమాని ఇండియన్ సినిమాగా అందరూ ఓన్ చేసుకోవచ్చు కానీ, అసలది ముందుగా తెలుగు సినిమా అనే విషయం అద్నాన్ గుర్తుంచుకోవాలి.
కోడిగుడ్డుపై ఈకలు పీకాలనుకునే ఆయన ఇలా కామెంట్ చేశారంటూ నెటిజన్లు క్లాస్ తీసుకుంటున్నారు. తెలుగువారు ఏ రంగంలో విజయం సాధించినా తెలుగు జాతి, తెలుగు జెండా, తెలుగు వెలుగు, తెలుగు తేజం..వంటి పదాలు వాడడం సహజం. ఇంకా చెప్పాలంటే తెలుగులో ఇదొక ఉపమానం. తెలుగువాడు కాదు కాబట్టి అద్నాన్ కు ఈ విషయం తెలియదు. అలాంటప్పుడు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది.