జైలులో పాట పాడాడు.. సినిమా ఛాన్స్ కొట్టేశాడు

రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ జీవనం సాగించిన రాణు మండల్ గురించి అందరికీ తెలుసు. బిచ్చగత్తెగా ఉన్న ఆమె ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ గా మారింది. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కన్నయ్య అనే…

రైల్వే స్టేషన్లో పాటలు పాడుతూ జీవనం సాగించిన రాణు మండల్ గురించి అందరికీ తెలుసు. బిచ్చగత్తెగా ఉన్న ఆమె ఆ తర్వాత బాలీవుడ్ సింగర్ గా మారింది. ఇప్పుడు అలాంటి ఛాన్స్ కన్నయ్య అనే వ్యక్తికి వచ్చింది. జైలులో ఊసుపోక అతను పాడిన పాట ఇప్పుడతడిని సోషల్ మీడియా సెలబ్రిటీగా మార్చింది.

మందు కొట్టి సరిహద్దుల్లో రచ్చ చేశాడంటూ బీహార్ పోలీసులు అతడిని పట్టుకొచ్చి లాకప్ లో వేశారు. మత్తు దిగాక అతడు లాకప్ లోనే కొన్ని పాటలు పాడాడు. అప్పటి వరకూ అతడిని ఓ తాగుబోతుగా చూసిన పోలీసులు అతడి గొంతు విని మైమరచిపోయారు, అతడి గాత్ర మాధుర్యానికి అబ్బురపడ్డారు. పోలీసుల్లో ఒకరు అతడు పాడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇంకేముంది కన్నయ్య సెలబ్రిటీ అయిపోయాడు.

బాలీవుడ్ ఛాన్స్..

కన్నయ్య వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే శలభ్ మణి అతడికి త్రినేత్ర స్టూడియో తరపున పాటలు పాడేందుకు అవకాశం ఇస్తానన్నాడు. అతడికి కావాల్సిన న్యాయసహాయం కూడా చేస్తానన్నాడు శలభ్ మణి. సాక్షాత్తూ ఓ ఎమ్మెల్యేనే అతడి గాత్ర మాధుర్యాన్ని మెచ్చుకోవడం, పాటలు పాడే ఛాన్స్ ఇస్తాననడంతో.. మరికొంతమంది కన్నయ్యకు అవకాశాలిచ్చేందుకు ముందుకొచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు అంకిత్ తివారీ కన్నయ్యకు సినిమా ఛాన్స్ ఇస్తానన్నాడు. మిస్ట్ మ్యూజిక్ తరపున అతడి కోసం ఆల్బమ్ రూపొందిస్తానన్నాడు.

వరుస అవకాశాలతో కన్నయ్య పేరు మారుమోగిపోతోంది. గతంలో కూడా రాణు మండల్ ఇలాగే ఫేమస్ అయింది, ఇప్పుడిలాంటి అవకాశం కన్నయ్యకు దక్కింది. భోజ్ పురి గాయకుడు పవన్ సింగ్ పాటను పాడి, ఎక్కడలేని పబ్లిసిటీ సాధించాడు కన్నయ్య. కన్నయ్య కారణంగా ఇప్పుడు పవన్ సింగ్ అనే భోజ్ పురి సింగర్ కూడా ఫేమస్ అయ్యాడు.

సుడి ఉంటే జైలుకెళ్లినా అవకాశాలు వాటంతట అవే వస్తాయనడానికి కన్నయ్యే ఓ ఉదాహరణ. తాగుబోతుగా అతడి ప్రతిభ ఎవరూ గుర్తించలేదు, కానీ పోలీసులు లాకప్ లో పెట్టిన తర్వాత అతడ్ని అదృష్టం వరించింది. బాలీవుడ్ ఛాన్స్ వచ్చేలా చేసింది.