చిత్రం: తెగింపు
రేటింగ్: 2/5
తారాగణం: అజిత్ కుమార్, మంజు వారియర్, అజయ్ తదితరులు
కెమెరా: నీరవ్ షా
ఎడిటింగ్: విజయ్ వేలుకుట్టి
సంగీతం: గిబ్రాన్
నిర్మాత: బోనీ కపూర్
రచన-దర్శకత్వం: హెచ్ వినోద్
విడుదల తేదీ: 11 జనవరి 2023
పండగ సీజన్లో ఏ సినిమా వచ్చినా దాని మీద దృష్టి పడుతుంది. కాస్త పెద్ద హీరో ఉంటే చూడాలనిపిస్తుంది అది డబ్బింగైనా సరే. సోలో రిలీజైతే ఆ తరహా సినిమాకి మరింత కలిసొస్తుంది. అజిత్ హీరోగా వచ్చిన తాజా సినిమాకి అలాగే కలిసొచ్చింది. పెద్దగా హైప్ లేకపోయినా కేవలం సోలో రిలీజవ్వడం చేత ప్రేక్షకులు థియేటర్స్ వైపు అడుగులు వేశారు.
టైటిల్ “తెగింపు” అన్నా కూడా పండగ మూడ్ లో పోస్టర్ మీద అజిత్ ని చూసి హల్లోకి వెళ్లిన ప్రేక్షకుల పరిస్థితి ఎలా ఉందో చూద్దాం.
దర్శకుడు చెప్పదలచుకున్న పాయింట్ బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాలు. అయితే ఈ పాయింట్ ని కథగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
సినిమా మొదలవడమే కొన్ని వేల కోట్ల స్కాం కు సంబంధించిన వార్తలు టీవీల్లో ప్రసారమవుతుంటాయి. కట్ చేస్తే ఒక డాన్ లాంటి వాడు స్విమ్మింగ్ పూల్లో అమ్మాయిలతో ఉంటే కబడ్డి ఆటలో “కబడ్డి కబడ్డి” అని అరిచే టైపులు “సీబీఐ సీబీఐ” అని అరుస్తూ కొంతమంది సీబీఐ ఆఫీసర్స్ అక్కడికొచ్చి అతన్ని అరెస్ట్ చేస్తారు.
వెంటనే ఒక బ్యాంకులో దాచి పెట్టి ఉన్న 1500 కోట్లు రాబరీ చేయడానికి మరొక ముఠా ప్రణాళికలు సిద్ధం చేస్తుంటుంది (క్రమంగా వాళ్లకి ఆ బ్యాంకులో ఉన్నది 1500 కోట్లు కాదు 25000 కోట్లు అని తెలుస్తుంది లేండి).
ఆ వెంటనే ప్లాన్ ప్రకారం రాబరీ సన్నివేశం మొదలవుతుంది. ఈ సన్నివేశం ఇంటర్వల్ దాకా ఉంటుంది. మీరు చదివింది నిజమే. దాదాపు గంట సేపు సింగిల్ సీన్ అన్నమాట. ఆ సీన్లోనే మరొక దోపిడీదారుడుగా అజిత్ ప్రవేశించండం, పబ్జీ గేం ఆడుతున్నట్టుగా గన్స్ తో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ ప్రత్యర్ధి ముఠాని చంపేస్తుండడం జరుగుతుంది. బ్యాంకులో బిక్కుబిక్కుమంటున్న హోస్టేజెస్, బయటినుంచి పోలీసులతో ఫోన్ మంతనాలు, మరో పక్క ఒక టీవీ చానల్ హెడ్ తో కామెడీలాంటి (కామెడీ మాత్రం కాదు) సీన్లు ఏవేవో వస్తుంటాయి.
చివరిదాకా ఇదే తంతు జరిగి ఒక చిన్నపాటి ఫ్లాష్ బ్యాక్ చెప్పి ఆ తర్వాత బ్యాంకులు జనాన్ని ఎలా మోసం చేస్తున్నాయో చెప్తాడు. ఆ తర్వాత ఆ 25000 కోట్ల డబ్బుని పట్టిస్తాడు.
తెలుగులోకి డబ్బింగైనా కూడా అర్థం కాని అరవ సంభాషణల్లాగ అనిపించే కొన్ని సీన్లున్నాయి. డబ్బింగ్ రాసిన విధానం అంత దయనీయంగా ఉంది. సబ్మెరీన్ అంటే సింపుల్ గా అర్థమయ్యే రోజుల్లో జలాంతర్గామి అనే పదం పదే పదే వాడడం, టీవీ చానల్ హెడ్ కి ఒక ఎస్సై కి మధ్యన జరిగే అర్థం పర్థం లేని అయోమయ సంభాషణ, “వెనక్కి తిరిగితే ఎక్స్ క్లూజివ్ గా చేస్తా” లాంటి డబుల్ మీనింగ్ పైత్యపు డైలాగ్, అస్సలు పసలేని పాచిపోయిన పాత చింతకాయలాంటి పాటలోని సాహిత్యం..వెరసి ప్రేక్షకులని దిక్కుతోచక దిక్కులు చూసుకునేలా చేస్తాయి.
అలాగే ఆర్మీ ఆఫీసర్స్ సీన్లోకి దిగి పోలీసాఫీసర్ కి గన్ పెట్టి కూర్చోపెడతారు, పైగా రాకెట్ లాంచర్స్ లాంటివి పెట్టి లోపల హోస్టేజెస్ ఉన్నా కూడా బ్యాంకుని పేల్చేస్తుంటారు. తాము చూస్తున్నది ఆర్మీ ఆఫీసర్స్ నా, సుపారీ రౌడీలనా అనేది అర్థం కాక ఆడియన్స్ బుర్రగోక్కోవాల్సిందే. మరొక సీన్లో ఫైరింజన్ లో డబ్బు నోట్లు పెట్టి వాటిని రోడ్డు మీద వెదజల్లుతాడు అజిత్! ఈ సీనేంటో సాధారణ మెదళ్ళకి అందదు.
ఈ సినిమాకి ప్రధాన విలన్ రచయిత కం దర్శకుడు అయిన హెచ్ వినోద్. ఇంత లో-ఐక్యూతో కథ, స్క్రీన్ ప్లే రాసుకోవడం నిజంగా తెగింపే. ఈ స్క్రిప్టుని ఓకే చేయడం బోనీ కపూర్, అజిత్ ల తెగింపే. ఏం చూసుకుని ఈ సినిమా తీయడానికి దిగారో, ఏమి ఆశించి ఇంత కష్టపడ్డారో ఊహిస్తేనే జాలేస్తుంది. భారీ యాక్షన్ సన్నివేశాలు పెట్టేస్తే చాలు..కథ, కాకరకాయ అక్కర్లేదు అని ఒక సామూహిక నిర్ణయానికి వచ్చి తెగించారేమో.
కెమెరా వర్క్ మాత్రం చాలా రిచ్ గా ఉంది. పాటలో సంగీతం పరమ చెత్తలా ఉంది. సెకండాఫులో వచ్చే ఈ ఊకదంపుడు ట్యూన్ కనీసం రెండు దశాబ్దాల క్రితం అటకెక్కించి ఇప్పుడు బూజు దులిపి దింపినట్టుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ కాలం నాటి సినిమాల స్టాండర్డ్ లో లేదు.
సింగిల్ లొకేషన్లో 90% సినిమాని లేపేసి మిగతాది సముద్రంలోనూ, ఒకటి రెండు ఇండోర్ లొకేషన్స్ లోనూ లాగించేశారు.
ఎక్కడా ఎమోషన్ కానీ, హత్తుకునే సన్నివేశం కానీ ఉండదు. అజిత్ బ్యాక్ స్టోరీ చూపించినా కూడా అర్ధం కాని పరిస్థితి. అసలు మంజు వారియర్ పాత్ర ఏమిటో కూడా క్లారిటీ లేదు. అజయ్, సముద్రఖని రొటీన్ పద్ధతిలో తమ పని తాము చేసుకుపోయారు. అజిత్ మాత్రం కాసేపు సీరియస్ గా, కాసేపు సిల్లీగా కనిపించాడు.
ఈ డిజిటల్ యుగంలో ఒక సాధారణ బ్యాంకులో 25000 కోట్లు ఉండడం సాధ్యమా? ఉంటే గింటే రిజర్వ్ బ్యాంకులో ఉండాలి కానీ ఒక మామూలు ప్రైవేట్ బ్యాంకు బ్రాంచ్ లో ఉండడం అసాధ్యం. ఈ బేసిక్ కామన్ సెన్స్ కూడా లేకుండా తీసుకుపోయాడు సినిమాని.
ఎలా చూసుకున్నా “తెగింపు” చూడడానికి చాలా తెగింపు ఉండాలి. పండగ సీజన్లో మూడాఫ్ చేసే సినిమా ఇది. ఎంత హార్డ్ కోర్ అజిత్ ఫ్యాన్స్ కి అయినా కూడా విసుగెత్తించగలిగే సామర్ధ్యం ఈ చిత్రానికి ఉంది.
బాటం లైన్: తెగించొద్దు