పవన్ మాకు అక్కర్లేదు, మా లెక్కలు మాకున్నాయి

పవన్ ను ఓ నటుడిగా అభిమానిస్తాను కానీ, రాజకీయ నాయకుడిగా అస్సలు ఇష్టపడనని అంటున్నారు వైసీపీ నేత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజకీయాల్లో పవన్ వ్యవహారశైలి అస్సలు బాగాలేదన్నారాయన. పవన్ పై రెగ్యులర్…

పవన్ ను ఓ నటుడిగా అభిమానిస్తాను కానీ, రాజకీయ నాయకుడిగా అస్సలు ఇష్టపడనని అంటున్నారు వైసీపీ నేత, మంత్రి అనిల్ కుమార్ యాదవ్. రాజకీయాల్లో పవన్ వ్యవహారశైలి అస్సలు బాగాలేదన్నారాయన. పవన్ పై రెగ్యులర్ గా విమర్శలు చేసే మంత్రి అనీల్, ఈసారి పవన్ రెండు నాల్కల ధోరణిని ఎండగట్టారు.

“చిరంజీవి, పవన్ అంటే నాకు చాలా అభిమానం. ఆ తర్వాత రామ్ చరణ్ సినిమాలు కూడా చూశాను. ఆ కుటుంబం అంటే నాకు చిన్నప్పట్నుంచి అభిమానం. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ నాకు నచ్చలేదు. సినిమాల్లో ఉన్నప్పుడు చిరంజీవిని తన అన్నగా చెప్పుకున్న పవన్ కల్యాణ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మా నాన్న కానిస్టేబుల్ అని చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా. దాన్నే రెండు నాల్కల ధోరణి అంటారు.”

ఇదే వ్యవహారశైలితో ఉంటే పవన్ ఎప్పటికీ నిజమైన రాజకీయనాయకుడు కాలేరన్నారు అనీల్. మాటల్లో నిజాయితీ ఉండాలని, పవన్ లో తనకు ఆ నిజాయితీ కనిపించలేదంటున్నారు. భవిష్యత్తులో కూడా పవన్ తమకు అక్కర్లేదని, మా లెక్కలు మాకు ఉన్నాయంటున్నారు.

“పవన్ కల్యాణ్ జెన్యూన్ పొలిటీషియన్ కాదు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ను విమర్శించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్ ను విమర్శిస్తున్నారు. అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబును ఏం అనలేదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏం అనడం లేదు. ధర్నాల వల్ల సమస్యలు తీరవని మూడేళ్ల కిందట అన్నారు. ఇప్పుడేమో తనే ధర్నాలు చేస్తానంటున్నారు. టీడీపీ ఎన్ని తప్పులు చేసినా ఐదేళ్ల వరకు ఏం అనలేదు. వైసీపీని మాత్రం అధికారంలోకి వచ్చిన వంద రోజులకే టార్గెట్ చేస్తారు. ఇలా పొంతన లేకుండా ఉన్నారు పవన్.”

నాయకుడు అనేవాడు ముందుండి నడిపించాలని, మిగతా నేతలంతా సైనికుల్లా నాయకుడి వెంట ఉంటారని అన్న అనీల్.. జనసైనికుడు అని చెప్పుకునే పవన్ మాత్రం ఎప్పుడూ  వెనకే ఉంటారని, కార్యకర్తల్ని ముందుకు తోస్తుంటారని ఆరోపించారు. పవన్ ఈ వ్యవహారశైలి మార్చుకుంటేనే అతడికి, జనసేన పార్టీకి భవిష్యత్ ఉంటుందని చెప్పారు.