పవన్ కల్యాణ్ ను యమర్జంటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసేయాల్సిందే. లేకపోతే చాలా కష్టం. అలా చేసేదాకా ఆయన రాష్ట్ర ప్రజలను వదలిపెట్టరు. ఆయన ముఖ్యమంత్రి కాదలచుకున్న తర్వాత.. కాకపోతే ఇప్పటిలాగానే నానా రచ్చా చేస్తుంటారు. తాను ముఖ్యమంత్రిని అయితే ఈ రాష్ట్రాన్ని సమూలంగా ఉద్ధరించేస్తానని పవన్ కల్యాణ్ పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. నిజమేనని ప్రజలు ఎలా నమ్మాలి?
48ఏళ్ల జీవితంలో ఆయన ఇప్పటిదాకా చాలా చాలా రంగాలను సముద్ధరించారు. అందులో ఆయన పరిణతి ఏమిటి? ఎంత మాత్రం సక్సెస్ రేట్ ను నమోదు చేశారు? ఈ విషయాలను ఒకసారి బేరీజు వేసుకుంటే.. అసలు పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రిని చేయాలో వద్దో ప్రజలు నిర్ణయించుకోగలరు.
ముఖ్యమంత్రి సంగతి తర్వాత.. సింగిల్ ఎమ్మెల్యేని పెట్టుకుని, రెండు చోట్ల ఓడిపోయిన ఈ ఎమ్మెల్యే కేండిడేటు మాటల్ని ఆయన పోరాట పటిమను, చిత్తశుద్ధిని ఎంత మేరకు నమ్మాలో.. ప్రజలు స్వయంగా నిర్ణయించుకుంటారు.
పవన్.. తన జీవితంలో గతంలో పోషించిన పాత్రలను పరామర్శించే ప్రయత్నం ఇది.
ఒక గాలివాటు హీరో…
పవన్ కల్యాణ్ ఒక గాలివాటు హీరో. చిరంజీవి మెగాస్టార్‌గా తెలుగు చిత్రపరిశ్రమను శాసిస్తూ ఉండకపోయినట్లయితే… ఇంటర్మీడియట్ చదివిన ఈ కుర్రవాడు ఏమైపోయి ఉండేవాడు. ఏదో ఖాళీగా ఉన్నాడు గనుక.. మార్షల్ ఆర్ట్స్ అంటూ కాస్త తర్ఫీదు పొందాడు గనుక.. సినిమాల్లోకి వచ్చాడు. ఏ రంగంలోనైనా ప్రవేశించిన తర్వాత.. శ్రద్ధగా ఆ రంగాన్ని అధ్యయనం చేసి అంతో ఇంతో రాణించేవారు తప్పకుండా ఉంటారు. పవన్ కల్యాణ్ కూడా అలాంటి గుర్తింపు తెచ్చుకున్నారు.
కెరీర్ ఫ్లాప్‌తో మొదలైనా ఆ తర్వాత వరుసగా కొన్ని హిట్లు రావడం, అప్పటికే మెగాస్టార్ తమ్ముడిగా స్థిరపడిఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఆయనకు అదనపు లాభాలు. కొన్ని సినిమాలు ఆడేసరికి.. ఆయన తనను మించిన హీరో లేనేలేడనే భావనలో పడిపోయారు. అక్కడినుంచి పతనం ప్రారంభం అయింది.
ఖుషీ తర్వాత మెగాఫోన్ పట్టుకున్నారు. తన తాహతు ఎంతో ఏమిటో తెలియకుండా చేసిన సాహసం అది. అక్కడ ప్రారంభమైన పతనం.. జల్సాని హిట్ కింద గుర్తిస్తే ఎనిమిదేళ్లు, ఫ్లాప్ కింద గుర్తిస్తే పన్నెండేళ్లు కొనసాగింది. గబ్బర్ సింగ్ దాకా ఆయన హిట్ కోసం వెయిట్ చేశాడు. తర్వాత.. అత్తారింటికి దారేది హిట్ అనిపించుకుంది.
రాజకీయాల్లోకి పూర్తిస్థాయి ఎంట్రీ ఇచ్చేముందు తన సామాజిక స్పృహ నాయకత్వ లక్షణాలను సినిమాల ద్వారా ప్రజలకు రుచిచూపించడానికి కొన్ని సినిమాలు చేశారు గానీ.. ప్రజలకు ఓపిక లేక వాటిని తిప్పికొట్టారు. ఆయన మొత్తంగా చేసింది 23 సినిమాలు. అందులో హిట్ లు పట్టుమని పది కూడా లేవు. తతిమ్మావాటలో యావరేజీలు లేవు. అన్నీ డిజాస్టర్లే.
కానీ మన తెలుగు ప్రజల ఔదార్యం ఎలాంటిదంటే.. 40 శాతం సక్సెస్ రేషియో లేని ఒక నటుడిని సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటాం. తమిళంలో రజనీకాంత్ తో పోల్చడానికి అత్యుత్సాహపడిపోతూఉంటాం.
పవన్.. ఒక సక్సెస్‌ఫుల్ నటుడని ఎలా అనగలం?
ఒక యూత్ నేత…
చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ఆయన తన సినీరంగ స్టార్‌డం ద్వారా వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ లో తమ్ముడికి అఖండిత వాటా ఇచ్చినట్టే… రాజకీయాల్లో తన ఎంట్రీకంటె ముందు.. పవన్ కల్యాణ్ ఏలుకోడానికి ఒక సామంత రాజ్యం రాసిచ్చారు. ఆ సామంతరాజ్యం పేరే యువరాజ్యం.
యువరాజ్యం రాజుగా పవన్ కల్యాణ్ ఏ రేంజిలో చెలరేగిపోయారో.. అందరికీ తెలుసు. ఇప్పుడు రాజకీయ వేదికల మీద నాటకాల రాయుడి మాదిరిగా పంచెకట్టుకుని ఊరేగుతున్న ఈ పెద్దమనిషి.. అప్పట్లో కాంగ్రెస్ వాళ్లని ఉద్దేశించి.. వీళ్లందరినీ పంచెలూడదీసి తరిమి కొట్టాలని మిడిసిపడ్డాడు.
ఎన్టీఆర్ కంటె రికార్డు స్థాయిలో తాను ముఖ్యమంత్రి అయిపోతానని అదేపనిగా కలలు కన్న చిరంజీవికి కూడా లేనంత పొగరు పవన్ కల్యాణ్ మాటల్లో వ్యవహారంలో నిండుగా కనిపించింది. ఆయన వ్యవహార సరళి పార్టీకి ఎన్నో చిక్కులనుకూడా తెచ్చి పెట్టింది. వాటిగురించి ఆయన ఇటీవల కూడా చాలా ఘనంగా తన వెర్షన్లోంచి చెప్పుకున్నారు.
చిరంజీవి సీఎం అయిపోతున్నాడని పవన్ కూడా నమ్మారు. అందుకే అంత తెంపరితనంతో అప్పుడు వ్యవహరించారు. తీరా ఫలితాలు వచ్చేసరికి ఆయన పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. చిరంజీవి పార్టీలోని అనేక మంది ఇతర నాయకులమీద ఒక రకమైన కక్ష కట్టారు. ఆ కక్షను ఇప్పటికీ పలు సందర్భాల్లో ప్రకటిస్తూనే ఉంటారు.
యువరాజ్యం అధినేతగా ఆయన ఒక ప్రాంతీయ పార్టీని.. విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అపరిమిత అధికారాలను కలిగిఉన్నారు. ఆ క్రమంలో ఆయన రాష్ట్రమంతా విస్తారంగా పర్యటనలు సాగించారు. సినీ ప్రేక్షక జనం ఎగబడిన సమావేశాలు తప్ప.. ఆయన తన మాటలతో ప్రజల్లో ఏం ఆలోచన రేకెత్తించారు. తమ పార్టీకి అనుకూలంగా ఎలాంటి అనుకూలతను సృష్టించగలిగారు. యువరాజ్యాధినేతగా ఏం సాధించారు?
పవన్.. ఒక సక్సెస్‌ఫుల్ యువనాయకుడని ఎలా అనగలం?
ఒక సంఘ సంస్కర్త…
పవన్ కల్యాణ్ కు మరొక భ్రమ కూడా ఉంది. తనలో అంతర్లీనంగా ఒక అత్యద్భుతమైన సంఘ సంస్కర్త కూడా ఉన్నాడని ఆయన నమ్మకం. ఆ విషయాన్ని ప్రజలు గుర్తించేలా చేయడానికి ఆయన అనేక రకాలుగా తపన పడుతూ ఉంటారు. తాను విశ్వమానవుడినని ఆయన పదేపదే చెప్పుకుంటూ ఉంటారు. తన పిల్లలకు తెలుగు-రష్యన్, హిందూ-క్రిస్టియన్ కలగలుపు పేర్లు పెట్టుకుని.. అక్కడికేదో తాను అంతర్జాతీయ పౌరసత్వం కలిగి ఉన్నట్లుగా ఆయన మురిసిపోతూ ఉంటారు. ఒకరికి విడాకులు ఇచ్చేదాకా రెండో అమ్మాయిని ‘పెళ్లి చేసుకోలే’దు గనుక తనకు మించిన నియమబద్ధమైన మనిషి మరొకడు లేనేలేడని ఆయన భావిస్తూ ఉంటారు.
కులాలు లేవు మతాలు లేవు.. ధనిక పేద తారతమ్యాలు లేవు.. అని వేదికలెక్కినప్పుడు తిరుగులేని ఉపన్యాసాలు దంచుతూ ఉండే పవన్ కల్యాణ్.. ఆ ముసుగులో కాపుల రిజర్వేషన్‌కు మద్దతివ్వమని ఆ కులాల వారు కోరినప్పుడు.. చంద్రబాబును నొప్పించలేక దాటవేసిన పవన్ కల్యాణ్ వాస్తవంలో చేసిందేమిటి? తన అన్నయ్య కూతురు, ఒక స్నేహితుడిని పెళ్లి చేసుకోదలచుకుంటే.. పవన్ ఎంత రాద్ధాంతం చేశారో అందరికీ తెలుసు. కేవలం పవన్ తమను చంపేస్తాడనే భయం ఉన్నందువల్లే పారిపోతున్నట్లు ఆ అమ్మాయి చెప్పిందంటే ఆయనలోని సంఘసంస్కర్తని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
ఆ సందర్భంలో.. రివాల్వర్ ను తీసుకువెళ్లి.. దాన్ని పోలీసు స్టేషన్లో అప్పగించడం అనే పేరిట పవన్ ఎంతటి హైడ్రామా నడిపించారో కూడా అందరికీ తెలుసు. సొంత కుటుంబం వద్దకు వచ్చేసరికి ఆయనకు అన్ని రకాల తారతమ్యాలూ అనుభవంలోకి వచ్చాయి. వెలివేసినట్లుగా ఆయన అన్నయ్య కుటుంబానికి చాలా కాలం దూరం ఉండిపోయినట్లుగా, వివాహాది శుభకార్యాల్లో కూడా అంటీముట్టనట్టు వ్యవహరించినట్లుగా కూడా గుసగుసలు వినిపించాయి. ఇదేనా ఆయనలోని సంఘసంస్కర్త ఎరిగిన మర్యాద!
పవన్.. ఒక సామాజిక సంస్కర్త అని ఎలా నమ్మగలం?
ఒక జనసేనాని..
ఇప్పుడిక వర్తమానంలోకి రావాలి. 2014 ఎన్నికలకు పూర్వం పవన్ కల్యాణ్ తన రాజకీయ పార్టీ జనసేనను స్థాపించారు. అప్పటికి పవన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రెండేళ్లలో రెండు హిట్ చిత్రాలతో మాంచి జోరు మీద ఉన్నారు. అయితే ఆయన తన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ‘అమ్మేసుకున్నారు’! ఆయన అభిమానులకు చేదుగా ధ్వనించినప్పటికీ ఇది నిజం. రాష్ట్రంలో బలమైన కాపు వర్గం ‘తమ’ అంటూ ‘ఓన్’ చేసుకున్న హీరో ఆయన. చంద్రబాబు నాయుడు వేసిన ఎరకు ఆయన సులువుగా లొంగిపోయారు.
అప్పట్లో వైఎస్ జగన్మోహన రెడ్డికి అంతో ఇంతో సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. ఆయనను ఓడించడానికి అన్ని రకాల మాయోపాయాలను పన్నితే తప్ప.. గండం గట్టెక్కలేమని అప్పటికే పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉండడం వల్ల కుదేలైపోయి ఉన్న చంద్రబాబునాయుడు వ్యూహరచన చేశారు. తాను తీవ్రంగా తిట్టిపోసిన మోడీ పల్లకీని భుజాన మోయడానికి సిద్ధపడ్డారు. మోడీ హవాను తనకు అనుకూలంగా వాడుకోదలచుకున్నారు. ఏమాత్రం చాన్స్ తీసుకోకూడదని.. పవన్ తోనూ బేరం సెట్ చేసుకున్నారు.
‘జగన్‌ను అధికారంలోకి రానివ్వకపోవడం’ అనే ఒకే ఒక ఎజెండాతో.. పవన్ కల్యాణ్ మోడీ-చంద్రబాబు లతో కలిసి రాష్ట్రమంతా ముమ్మర ప్రచారం నిర్వహించారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా కొద్ది తేడాతో తెదేపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత ఒకవైపు సినిమాలు చేసుకుంటూ అడపాదడపా ప్రజా సమస్యల మీద టూర్లు, ప్రకటనలు చేస్తూ వచ్చారు. 2019 ఎన్నికలకు సొంతంగా బరిలోకి దిగారు. జగన్ ను ఓడించడానికి సర్వశక్తులూ ఒడ్డి పోరాడారు. రెండు పెద్ద పార్టీలు కొట్టుకుంటూ ఉంటే.. తనకు పిడికెడు సీట్లు దక్కినా.. ప్రభుత్వాన్ని శాసించే హోదా వస్తుందనే ఆశతో ఎగబడి ప్రచారం చేశారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ నాయకుడూ కనబరచనంత ఆత్మవిశ్వాస లేమితో రెండు సీట్లలో పోటీచేశారు. చివరికి రెండింటా ఓడారు. జనం ఆయనను ఛీకొట్టారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత చేపట్టిన తొలి బహిరంగ కార్యక్రమం విశాఖ లాంగ్ మార్చ్ ఎక్కడ ఫెయిలవుతుందో నని తెదేపా, భాజపా మద్దతు కోరారు. భాజపా ఛీత్కరించుకుంది. చంద్రబాబు.. పవన్ కు మద్దతివ్వడానికి ఉత్సాహపడ్డారు. ఆ మార్చ్‌కు ఆ రీతిగా జనసమీకరణ పూర్తయింది.
ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే.. ఇప్పటికీ.. రాష్ట్రవ్యాప్తంగా ఒక కార్యక్రమానికి, ఉద్యమానికి, పోరాటానికి, ఆందోళనకు పిలుపు ఇవ్వగల దమ్ము పవన్‌కు లేదు. రాష్ట్రవ్యాప్త పోరాటాలకు పిలుపు ఇస్తే.. చాలాచోట్ల స్థానికంగా తమ పార్టీకి దిక్కులేదనే సంగతి బయటపడిపోతుందని ఆయనకు భయం.
కోట్లకు కోట్ల ఆదాయాన్ని వదులుకుని రాజకీయాల్లోకి వచ్చేశానని, ఇక సినిమాలు చేయనని ప్రకటించిన పవన్ మళ్లీ కథలు వింటున్నారు. తాను తిరిగి సినిమాలు చేయబోతున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ నంగనాచి కబుర్లు చెబుతున్నారు. మాట తప్పుతున్నారు. మడమ తిప్పుతున్నారు. జనసేన భవిష్యత్ రాజకీయాలు అనేవి షాట్‌గ్యాప్‌లో చేసే రాజకీయాలు మాత్రమే అని ఆయన చాలా తెలివిగా నిరూపించుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ప్రజలను మాయచేసే ప్రయత్నంలో ఉన్నారు.
పవన్.. ఒక జనసేనాని అని ఎలా విశ్వసించడం?
ఒక నాయకుడు…
జనసేనాని కాకపోయినా పర్లేదు. ప్రజాజీవితంలో గడపదలచుకున్నప్పుడు… కనీసం ఆ విషయంలో చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పటిదాకా పవన్ తనంతగా తాను గుర్తించి.. పరిష్కారం వరకు అండగా ఉండి పోరాడిన ప్రజాసమస్య ఏదైనా ఉందా? ఉద్ధానం అన్నారు. హడావిడి చేశారు. చంద్రబాబును కలిశారు. అక్కడితే వదిలేశారు. వారికోసం జగన్ ప్రత్యేకపథకాలు తెస్తే.. కనీసం అభినందన పూర్వకంగా ఒక్కమాట కూడా అనలేదు. గోదారి జిల్లాలో ఆక్వా గొడవ అన్నారు. తిరుపతిలో భూమి గొడవలు అన్నారు. రాజధానిలో రైతుల గోడు అన్నారు. మెడికల్ కాలేజీ గొడవ అన్నారు…. ఇవే కాదు! ఇప్పటిదాకా పవన్ చేపట్టిన ఏ అంశంపై కూడా ఆయన నిర్దిష్టంగా సమస్య తీరే వరకు పట్టించుకున్నది లేదు. ఆయన స్వయంగా ప్రజల బాధలను గుర్తించి, తెలుసుకుని, పోరాడింది కూడా లేదు.
ఎవడో ఒక దళారీ ఉంటాడు. వాడికి కొన్ని వక్ర ప్రయోజనాలు ఉంటాయి. వాడు ఒక సమస్యను హైప్ చేస్తాడు. వాడు ఆ బాధితులకు పవన్ కల్యాణ్ చెంతకు ‘యాక్సెస్’ను కొనుగోలు చేయగలడు. ఆయన వద్దకు తీసుకువస్తాడు. వారందరూ పవన్ ఎదుట కూర్చుని.. తమ గోడు వెళ్లబోసుకోగానే.. గదిలోంచి ఆయన బయటకు వచ్చి.. వారి తరఫున తాను పోరాడుతానని.. ప్రభుత్వం తాటతీస్తానని హెచ్చరిస్తారు. ఒక ప్రెస్ నోట్ వస్తుంది. అంతటితో ఆ ఎపిసోడ్ ముగిసిపోతుంది. మహా అయితే.. ఒక ట్రిప్.. ఆ ప్రాంతానికి వెళ్లి రావడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత పట్టించుకున్నది మాత్రం ఇప్పటిదాకా లేదు! నిన్న తెలంగాణ ఆర్టీసీ కార్మికుల గోడు అయినా అంతే.. ఇవాళ ఏపీలో ఇసుక సమస్య అయినా అంతే! వారి ఏడుపులు కొనసాగుతూ ఉండగానే.. పవన్ తన కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టేసి.. మేకప్ పులుముకున్నా ఆశ్చర్యం లేదు.
విపక్షంలో ఉన్నందుకు ప్రభుత్వానికి ఒక సలహా చెప్పడం లేదు. నిందించడం హీరోయిజం కాదు.. ప్రభుత్వానికి సరైన మార్గదర్శనం చేయడం హీరోయిజం అనిపించుకుంటుంది. విపక్షంలో ఉన్నప్పుడు అలాంటి దార్శనికతను చూపిస్తే.. ప్రజలు మెచ్చుకుని.. ఈయన సామర్థ్యాలను గుర్తించి.. ఈసారి పట్టం కడతారు. అర్థం పర్థం లేకుండా అరుస్తూపోతే.. వాటికి జనంలో మన్నన ఉండదు. కోటలు దాటే మాటలు ఓట్లు వేయించవు. ఆ విషయం గత ఓటములనుంచే ఆయన పాఠంగా నేర్చుకుని ఉండాలి.
ఇలాంటి పవన్ కల్యాణ్.. ఒక నాయకుడు అని ఎలా ఆమోదించడం?
రాజకీయం ‘షాట్ గ్యాప్ ఎరీనా’ కాదు. షూటింగ్ షాట్‌కు షాట్‌కు మధ్య గ్యాప్‌లో మొబైల్‌లో గేమ్స్ ఆడుకుంటే బాగుంటుంది. లేదంటే ఫోటోలకు మంచిగా కనిపించడానికి, తనకు ఇష్టం కూడా ఉన్నది గనుక పుస్తకాలు, కవిత్వమూ చదువుకుంటే బాగుంటుంది. అంతే తప్ప ఆ షాట్ గ్యాప్‌లో ఓ ప్రజాసమస్యపై ప్రెస్‌నోట్ రిలీజ్ చేసేద్దాం అనుకోకూడదు.
షూటింగ్ షెడ్యూలుకు షెడ్యూలుకు మధ్య గ్యాప్ సకుటుంబంగా ట్రిప్‌లు వెళ్తే బాగుంటుంది. అంతే తప్ప.. ప్రజల చెంతకు అంటూ ఓ యాత్ర సాగిస్తే లాభపడతాం అనుకోకూడదు.
రాజకీయం అనేది ఆటవిడుపు కాదు. పైన ప్రస్తావించిన అన్ని రకాల హోదాల్లోనూ పూర్తిస్థాయిలో విఫలమైన వ్యక్తి.. పవన్ కల్యాణ్ తాను ‘ఆల్ ఫెయిల్’ కేండిడేట్ అని తెలుసుకోవాలి. కొత్త హోదాను కోరుకుంటే.. తదనుగుణంగా సరైన దిశలో కసరత్తు చేయాలి.