ఆర్టీసీతో తెలంగాణ ప్రభుత్వం తెగతెంపులు

ఆర్టీసీ వివాదానికి పరిష్కార మార్గంగా ఈరోజు హైకోర్టులో ఏదోఒక కీలక తీర్పు వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తమ వద్ద ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతోంది. Advertisement ఆర్టీసీతో తెలంగాణ ప్రభుత్వానికి ఇక…

ఆర్టీసీ వివాదానికి పరిష్కార మార్గంగా ఈరోజు హైకోర్టులో ఏదోఒక కీలక తీర్పు వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం తమ వద్ద ఉన్న ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించబోతోంది.

ఆర్టీసీతో తెలంగాణ ప్రభుత్వానికి ఇక ఏమాత్రం సంబంధం లేదని హైకోర్టును విన్నవించబోతోంది. ఈ మేరకు శనివారం జరిగిన కీలక సమావేశంలో కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఆర్టీసీకి ఇప్పటికే చెల్లించాల్సిన బకాయిలు చెల్లించామని, తిరిగి ఆర్టీసీనే రవాణా శాఖకు కోట్ల రూపాయల్లో బకాయిలు పడిందని, అవసరమైతే వాటిని కూడా మాఫీ చేస్తామని, ఇకపై ప్రభుత్వంతో ఆర్టీసీకి ఎలాంటి సంబంధం ఉండదని కోర్టుకు చెప్పబోతోంది తెలంగాణ సర్కార్.

ఆర్టీసీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి ప్రభుత్వం సాయం చేస్తూనే ఉందని, ఇలా ఎంతకాలం చేయాలని కోర్టునే ప్రశ్నించబోతోంది ప్రభుత్వం. పైగా విలీనం అనే అంశం ఎజెండాలో ఉన్నంతకాలం చర్చలు సాగవని కూడా స్పష్టంచేయబోతోంది.

తెలంగాణ సర్కార్ నేరుగా విషయంలోకి రావడంతో ఈరోజు ఆర్టీసీపై హైకోర్టులో కీలక తీర్పు వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఒకవేళ హైకోర్టు తీర్పు ఆర్టీసీకి అనుకూలంగా వస్తే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కూడా ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. అదే కనుక జరిగితే ఆర్టీసీ సమ్మె వ్యవహారం ఇప్పట్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉండదు. ఎటొచ్చి ప్రభుత్వం మాత్రం ఆర్టీసీ విలీనానికి అంగీకరించడం లేదు.

మరోవైపు కార్మికులు తమ సమ్మెను కొనసాగించాలని నిర్ణయించారు. 38వ రోజు సమ్మెలో భాగంగా ఈరోజు మంత్రుల ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని నిర్ణయించారు. ఇక 13, 14 తేదీల్లో ఢిల్లీ వెళ్లి మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్ ను కూడా కలవబోతున్నారు కార్మికులు. ఆ తర్వాత 18న రాష్ట్రవ్యాప్తంగా సడక్ బంద్ కు పిలుపునిచ్చారు.