ఆచార్య కథపై ప్రస్తుతం కొనసాగుతున్న వివాదం పలు ప్రశ్నలను తెరపైకి తీసుకొచ్చింది. అటు రాజేష్ అనే వ్యక్తి లేవెనెత్తుతున్న ప్రశ్నలతో పాటు.. ఆచార్య యూనిట్, మరీ ముఖ్యంగా దర్శకుడు కొరటాల శివ ఎత్తిచూపిన అనుమానాలు చర్చకు దారితీస్తున్నాయి.
ఇరువర్గాల ప్రశ్నల్ని ఓసారి చూద్దాం. ముందుగా రాజేష్ వెర్షన్ నుంచి చూస్తే…
రిలీజ్ తర్వాత ఏం చేస్తారు?
ఆచార్య కథను తన నుంచి కాపీ కొట్టారనేది రాజేష్ ప్రధానమైన ఆరోపణ. రాజేష్ కథను కాపీ కొట్టలేదని, రిలీజ్ తర్వాత ఆ విషయం స్పష్టంగా తెలుస్తుందని యూనిట్ సమాధానం చెబుతోంది. అయితే రిలీజ్ తర్వాత చేసేదేం ఉంటుందనేది ఇక్కడ ప్రశ్న. నిజంగా తన కథతోనే సినిమా తీస్తే, రిలీజ్ తర్వాత తను చేసేదేం ఉండదనేది రాజేశ్ వాదన.
పైగా కథలో సన్నివేశాలు మార్చేసినా, పాయింట్ అదే ఉంటుందని.. రిలీజ్ తర్వాత తన కథలో పాయింట్, ఆచార్యలో పాయింట్ ఒకటే అయితే అప్పుడిక తను చేసేదేం ఉండదంటున్నాడు రాజేష్. తను రాసుకున్న కథలో పెద్దాయన పంచె కట్టుకొని ఉంటాడని, ఆచార్య మోషన్ పోస్టర్ లో చిరంజీవిని ప్యాంట్ లో చూపించారని.. ఇలాంటి మార్పులు చేసుకోవడం కొరటాల లాంటి దర్శకుడికి పెద్ద సమస్య కాదంటున్నాడు రాజేష్.
చిరంజీవి ఇంటి తలుపు తట్టే పరిస్థితి ఉందా?
ఇదే సమయంలో ఇండస్ట్రీ పెద్ద దిక్కు ఎవరనే విషయం కూడా చర్చకొచ్చింది. ఇంత వివాదం జరుగుతుంటే చిరంజీవిని కలిసి మొరపెట్టుకోవచ్చు కదా అనేది మీడియా ప్రశ్న. చిరంజీవి ఇంటి తలుపుతట్టే అవకాశం ఉందా అని ఎదురుప్రశ్నిస్తున్నాడు రాజేష్. ఇంటి మెట్టు కూడా ఎక్కనివ్వరని, మెడ పట్టుకొని బయటకు గెంటేస్తారని అంటున్నాడు.
ఇండస్ట్రీ పెద్ద మనిషిగా దాసరి ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని, లైట్ బాయ్ కు సమస్య వచ్చినా నేరుగా వెళ్లి దాసరిని కలిసేవారని.. ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటి “పెద్దాయన” ఎవ్వరూ లేకపోవడమే తనలాంటి వాళ్లకు ఇబ్బందిగా మారిందని అంటున్నాడు.
అందరూ “మెగా” మనుషులేనా?
ఆచార్య కాంట్రవర్సీ సందర్భంగా మరో ఆసక్తికర చర్చ కూడా మొదలైంది. ఇండస్ట్రీలో అందరూ మెగా కాంపౌండ్ మనుషులే అనే డిస్కషన్ మొదలైంది. రాజేష్ కూడా దాదాపు ఇదే అభిప్రాయాన్ని పరోక్షంగా వెల్లడిస్తున్నాడు. రైటర్స్ అసొసియేషన్, డైరక్టర్స్ అసోసియేషన్ లో తనకు న్యాయం జరక్కపోవడానికి ఇదే కారణం అంటున్నాడు. ఎన్.శంకర్, చిన్నికృష్ణ, తమ్మారెడ్డి లాంటి వ్యక్తులు తనకు న్యాయం చేయలేకపోవడానికి కారణం.. వీళ్లంతా చిరంజీవి మనుషులు అని ఆరోపిస్తున్నాడు రాజేష్.
డబ్బు-పేరు రెండూ అక్కర్లేదా?
ఇదే వివాదం వేదికగా మరో ప్రశ్న కూడా తలెత్తుతోంది. పరిశ్రమలో ఏ చిన్న వివాదం వచ్చినా దాన్ని డబ్బుతో పరిష్కరించడం ఆనవాయితీగా మారింది. ముందు సినిమా చేసేద్దాం, ఎవరైనా అభ్యంతరం వ్యక్తంచేస్తే డబ్బుతో కొనేద్దాం అనే తెంపరితనం ఇండస్ట్రీలో పాతుకుపోయింది. గతంలో ఇలాంటి ఉదంతాలు కొన్ని జరిగాయి కూడా.
అయితే ఆచార్య కథకు సంబంధించిన వివాదంలో తనకు ఈ రెండూ అక్కర్లేదంటున్నాడు రాజేష్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒకవేళ అది తన కథే అయితే పిలిచి ఐదో, పదో చేతిలో పెడతారని.. అంతకంటే ముందే విషయం సీరియస్ అయితే.. టైటిల్స్ లో తన పేరు వేస్తారని చెబుతున్న రాజేష్.. తనకు ఆ రెండూ అక్కర్లేదంటున్నాడు. తనకు న్యాయం జరగాలని, ఇండస్ట్రీలో ఇకపై ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నాడు.
ఓవైపు రాజేష్ వాదనలు.. ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ఇలా ఉంటే.. మరోవైపు సినిమా యూనిట్ చెబుతున్న అభ్యంతరాలు కూడా సహేతుకంగానే ఉన్నాయి. ఇప్పుడు వాళ్లు చెబుతున్న అభ్యంతరాలేంటో చూద్దాం
రిలీజ్ కు ముందే కథ చెప్పాలా?
కోట్ల రూపాయల బడ్జెట్ తో తీస్తున్న సినిమాకు సంబంధించి కథ ముందే చెప్పాలా అనేది యూనిట్ నుంచి వస్తున్న ప్రధానమైన ప్రశ్న. ఒకవేళ అలా చెబితే, ఆ కథ అతడితోనే ఆగదని.. అలా అలా మీడియాకు లీక్ అయి.. మొత్తంగా సినిమాపైనే ప్రభావం చూపిస్తుందని, మూవీపై ఉన్న క్రేజ్ మొత్తం పోతుందని యూనిట్ వాదిస్తోంది. ఈ వాదనలో కూడా లాజిక్ ఉంది.
రేపు ఇంకో వ్యక్తి వస్తే పరిస్థితేంటి?
ఇక్కడే యూనిట్ మరో అభ్యంతరం కూడా వ్యక్తంచేస్తోంది. ఇప్పుడు రాజేష్ వచ్చాడు, ఏదో అనుమానించాడు కాబట్టి అతడికి కథ చెబుతాం. రేపు ఇంకో వ్యక్తి వచ్చి నా కథ అంటే.. అతడ్ని కూడా కూర్చోపెట్టి కథ మొత్తం చెప్పాలా అని ప్రశ్నిస్తోంది యూనిట్. మరీ ముఖ్యంగా రాజేష్ మీడియాకెక్కి రచ్చ చేయడంపై యూనిట్ తీవ్ర అభ్యంతరం చెబుతోంది.
ఇది ఇలానే కొనసాగితే ఛానెల్ లైవ్ లో కథ చెప్పమని డిమాండ్ చేసే వాళ్లు కూడా పుట్టుకొస్తారని వాదిస్తోంది. సంబంధిత శాఖలు (రైటర్స్, డైరక్టర్స్ అసోసియేషన్స్) ద్వారా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ ఇలా చేస్తే.. రాబోయే రోజుల్లో ఇదొక కామన్ ప్రాక్టీస్ అయిపోతుందంటోంది యూనిట్.
ఓవరాల్ గా చూసుకుంటే… ఆచార్య వివాదం కొన్ని సీరియస్ ప్రశ్నల్నే తెరపైకి తీసుకొచ్చింది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలకు ఇప్పటికిప్పుడు సమాధానాలు దొరకవు. ఆచార్య కాంట్రవర్సీ కొలిక్కి వచ్చినా.. భవిష్యత్తులో మరో సినిమా వివాదం తెరపైకొచ్చినప్పుడు ఇవే ప్రశ్నలు అక్కడ కూడా ఉత్పన్నం అవుతాయి.