ఒక్క పెద్ద హీరోతో సినిమా తీయడం అంటేనే చాలా టఫ్ టాస్కు. హీరోల మనోభావాలకు అనుగుణంగా నడుచుకుంటూ, అస్సలు ఇబ్బంది రాకుండా, సమస్యలు తలెత్తకుండా సినిమా నిర్మించి, విడుదల చేయాలి. అడుగు అడుగునా హీరోల అప్రూవల్స్ అవసరం పడుతూనే వుంటాయి. స్క్రిప్ట్ దగ్గర నుంచి ప్రీ రిలీజ్ పబ్లిసిటీ వరకు. పైగా వీటన్నింటి మధ్యలో ఫ్యాన్స్ వ్యవహారం వుండనే వుంటుంది.
అలాంటిది ఒకేసారి ముగ్గురు బడా హీరోలతో మూడు సినిమాలు ప్లాన్ చేయడం అంటే ఇలాంటి అలాంటి వ్యవహారం కాదు. కత్తి మీద సామే. బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ ఇప్పుడు ఇలాంటి టాస్క్ నే తలకు ఎత్తుకుంటోంది ఒకేసారి ముగ్గురు మెగా హీరోలతో మూడు బడా సినిమాలు ప్లాన్ చేసింది.
ఇప్పటికే పుష్ప సినిమా సెట్ మీదకు వెళ్లడానికి అంతా రెడీ అయిపోయింది. బన్నీ-సుకుమార్-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్. పైగా వంద కోట్ల భారీ సినిమా. అడవుల నేఫథ్యంలో కథ.
ఇదిలావుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తో సినిమా. దీనికి కూడా దాదాపు గ్రౌండ్ అంతా ప్రిపేర్ అయిపోయింది. ఫిబ్రవరి నుంచి ఇది కూడా సెట్ మీదకు వెళ్లే అవకాశం వుంది. పవన్ సినిమా అంటే ఇది కూడా వంద కోట్లకు పైగా బడ్జెట్ నే.
ఈ రెండు ఇలా వుండగానే బాబీ డైరక్షన్ లో మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లానింగ్ లో వుంది. అయితే ఇది ఇమ్మీడియట్ గా వుండదు. కనీసం ఓ ఏడెనిమిది నెలల టైమ్ పట్టే అవకాశం వుంది. ఇది కూడా ఎలాగూ వంద కోట్లకు పైబడిన వ్యవహారమే.
ఇక్కడ సమస్య పెట్టుబడి కాదు. మైత్రీ స్టామినా కు అదేమీ సమస్య కాదు. కానీ ఎక్కడ ఏ సినిమా కూడా ఏమీ తగ్గకూడదు. ఫ్యాన్స్ ఫీలయిపోతారు. అసలే మెగా ఫ్యాన్స్ లో బన్నీ ఫ్యాన్స్ సెపరేట్. పెట్టుబడులే కాదు, కలెక్షన్లు, రికార్డులు, ఇలా అన్నీ చూస్తారు. అందరూ ఎంత మెగా హీరోలే అయినా, మిగిలిన వాటితో పోల్చుకుంటారు.
అందువల్ల అడుగు అడుగునా మైత్రీ మూవీస్ కు సవాలే. నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక నుంచి విడుదల తరువాత కలెక్షన్ల వివరాల వరకు. ఆ విధంగా మైత్రీ మూవీస్ కు సరైన సవాల్ ఈ మూడు సినిమాలు అనుకోవాలి.