తెలుగు ప్రజలు అమాయకులా, పాపాత్ములా..?

దాదాపు దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు తగ్గాయి. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత ధరలు తగ్గించాయి. కాంగ్రెస్ పాలిత పంజాబ్ కూడా పెట్రోల్ రేట్లు తనవంతుగా తగ్గించింది. మరి తెలుగు రాష్ట్రాల…

దాదాపు దేశవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు తగ్గాయి. కేంద్రంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కొంత ధరలు తగ్గించాయి. కాంగ్రెస్ పాలిత పంజాబ్ కూడా పెట్రోల్ రేట్లు తనవంతుగా తగ్గించింది. మరి తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఏమిటీ శాపం. వారు చేసిన పాపం ఏంటి..? కేంద్రం విదిల్చిన అరకొర తగ్గింపు మినహా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా అడుగు ముందుకేయలేదు. 

ఇన్నాళ్లూ కరోనా పేరు చెప్పి, ప్రభుత్వ ఆదాయం తగ్గిందంటే.. కష్టమైన భరించారు.. కరోనా పరిస్థితులు కుదుటపడి ఆదాయాలు పెరుగుతున్నా కూడా ఇంకా ప్రజలు భారం మోయాల్సిందేనా..?

కేంద్రానికి శత్రువులేం కాదు కదా..?

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, కేంద్రంలో ఎన్డీఏ వైరి పక్షాల పాలనలో ఉన్న రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గలేదంటే అర్థం చేసుకోవచ్చు. ఇగో వల్లనో, ఇంకేదైనా కారణం వల్లనో వారు కేంద్రంతో పాటు తాము కూడా ట్యాక్స్ తగ్గించడానికి ఇష్టపడలేదు. మరి వైసీపీ, టీఆర్ఎస్ రెండూ కేంద్రానికి పలు బిల్లుల్లో సాయం చేశాయి కదా. 

అప్పుడు మద్దతిచ్చి, ఇప్పుడు పెట్రోల్ రేట్ల తగ్గింపులో మద్దతివ్వలేం అంటే ఎవరికి నష్టం..? ఎవరిదీ కష్టం..? కేంద్రం తీసుకున్న చాలా నిర్ణయాలకు మద్దతిచ్చారు కదా, మరిప్పుడు పెట్రోల్ రేట్లు ఎందుకు తగ్గించరు..? అనేది సగటు తెలుగోడి ప్రశ్న.

తెలుగు ప్రజలకు ఫుల్ క్లారిటీ..

ఏపీ సీఎం జగన్ రేట్లు తగ్గించేది లేదంటూ ఇన్ డైరెక్ట్ గా చెప్పేశారు, ఫుల్ పేజీ యాడ్ ఇచ్చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మేం పెంచలేదు, సో తగ్గించేది లేదంటూ డైరక్ట్ గా చెప్పేశారు. మిగతా రాష్ట్రాలు రేట్లు తగ్గించే సరికి.. ఇప్పటికే సరిహద్దుల్లో ఉన్న పెట్రోల్ బంకులు మూసేసుకోవాల్సిన పరిస్థితి. 

తెలుగు రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటున్న ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రాంతాల్లో పెట్రోలు రేట్లు తగ్గిన విషయాన్ని కరపత్రాలు ముద్రించి మరీ ప్రచారం చేస్తున్నారు. 3-4 కిలోమీటర్లు ప్రయాణించి బోర్డర్ దాటితే, 15-16 రూపాయలు తక్కువకే పెట్రోల్ దొరుకుతుందని పబ్లిసిటీ చేస్తున్నారు.

రేట్లలో స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తుండే సరికి వినియోగదారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను తిట్టుకోవడం మినహా వారు చేయగలిగిందేమీ లేదు. పెట్రో-డీజిల్ ధరలు తగ్గించడం వల్ల ఎన్నో రంగాల్లో రేట్లు అందుబాటులోకి వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. 

చివరికి కూరగాయల ధరలు కూడా తగ్గుతాయనే విషయం తెలిసిందే. ఇప్పటికైనా ప్రభుత్వాలు పెద్ద మనసు చేసుకుని ఆలోచించాలి. తెలుగు ప్రజలకు మాత్రమే ఎందుకీ శాపం అనే కోణంలో కనికరం చూపాలి. ప్రభుత్వానికి ఆదాయ మార్గం కేవలం పెట్రోడీజిల్ మాత్రమే కాదనే విషయాన్ని గ్రహించాలి.