న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ చేపట్టిన మహాపాదయాత్ర… ఎల్లో బ్యాచ్ అతి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం అడ్డుకుంటుందని, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తుందనే వారి ఆశలు అడియాసలవుతున్నాయి. తమ పాదయాత్రను అడ్డుకోవాలని, తద్వారా బాగా ప్రచారం పొందాలనే వారి పబ్లిసిటీ స్టంట్ కళ్లకు కడుతోంది.
ప్రచారం పొందడం ఎలా? నిబంధనలు ఉల్లంఘిస్తూ దబాయించడం ఎలా? అనేవి నేర్చుకోవాలంటే అమరావతి రాజధాని రైతుల ముసుగులో టీడీపీ చేపట్టిన మహాపాదయాత్రను అధ్యయనం చేస్తే చాలు. ఈ పాదయాత్రను ప్రభుత్వం విస్మరించడాన్ని ఎల్లో బ్యాచ్ జీర్ణించుకోలేకున్నారు.
అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనే డిమాండ్‌పై టీడీపీ ముసుగులో ఇతరేతర పేరుతో మహాపాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైకోర్టును ఆశ్రయించి, షరతులతో కూడిన అనుమతి పొందారు. పాదయాత్రలో పాల్గొనే 157 మంది పేర్లతో కూడిన జాబితాను హైకోర్టుకు సమర్పించారు. మహాపాదయాత్ర చేపట్టి వారం రోజులైంది. ఈ సందర్భంగా 2 వేల మంది పాదయాత్రలో పాల్గొంటున్నట్టు, అద్భుతమైన ప్రజాస్పందన లభిస్తోందని నిర్వాహకులు చెప్పుకొచ్చారు.
న్యాయస్థానం నిబంధనలు ఉల్లంఘించినా తమకేమీ కాదనే ధైర్యమో, వ్యవస్థల మద్దతు ఉందనే భరోసానో, కారణాలేంటో తెలియదు కానీ ప్రభుత్వాన్ని రెచ్చగొట్టేలా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారనేది వాస్తవం. రాజకీయ విమర్శలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని హైకోర్టు స్పష్టంగా షరతులు విధిస్తే… అది నామమాత్రం కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఎందుకంటే ఊరికే పాదయాత్ర నిర్వహిస్తే ప్రజల దృష్టిని ఆకర్షించేది ఎలా? అనేది వారి ప్రశ్న.
అసలే ప్రచారం పొందే విద్యలో రాంగోపాల్‌వర్మను మించిన నిపుణులున్న టీం ఉండనే ఉంది. అయితే ప్రభుత్వం నుంచి యాక్షన్ వస్తే… తాము వంద రెట్లతో రియాక్షన్ ఇవ్వాలని ఎదురుచూస్తున్నా, వారి పప్పులుడకలేదు. వైసీపీ ప్రభుత్వం కూడా వ్యూహా త్మకంగా నడుచుకుంటోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని తెలిసినా… ఎక్కడా అడ్డుకోలేదు. మహాపాదయాత్ర నిర్వాహకులు ఆశించినట్టుగా ప్రభుత్వం దుందుడుకు చర్యలకు దిగలేదు. హైకోర్టు షరతులను గుర్తు చేస్తూ… రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు ఇవ్వగానే, ఒక్కసారిగా నానాయాగీ చేయడాన్ని గమనించొచ్చు.
పోలీసులు ఎంతగా అణచివేయాలని చూసినా, ఎన్ని రకాల అడ్డంకులు కల్పించినా, ఏ స్థాయిలో నిరోధించాలని చూసినా … అమరావతి రైతుల ఉక్కు సంకల్పం సడలలేదనే ఎల్లో మీడియా రాతలు చూస్తే…. వారేం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అమరావతి రైతుల పాదయాత్ర గురించి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దానికి తగినంత ప్రచారం రావడం లేదు. పాదయాత్ర గురించి ప్రజల్లో చర్చనీయాంశం కావాలంటే… అంతా ప్రభుత్వం చేతల్లోనే ఉంది.
హైకోర్టు షరతులను ఉల్లంఘించారనే కారణంతో నిర్వాహకులపై కేసులు, అరెస్టులు లాంటి చర్యలకు పాల్పడాలి. ఇప్పటి వరకైతే అలాంటి తప్పు ప్రభుత్వం చేయలేదు. అదే ఎల్లో బ్యాచ్‌కు ఏ మాత్రం నచ్చడం లేదు. ప్రభుత్వం గోరంత తప్పు చేస్తే… కొండంత క్రియేట్ చేయడానికి వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాళ్ల కళ్లు కాయలు కాచేలా ఉన్నాయే తప్ప మహాపాదయాత్రకు మహాప్రచారం తీసుకొచ్చే మార్గమేదబ్బా!