గంజాయి అక్రమ రవాణాపై గట్టిగా దృష్టి పెట్టిన తెలంగాణ పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు కళ్లముందు కనిపిస్తున్నాయి. గంజాయి కేవలం సరిహద్దుల నుంచి మాత్రమే వస్తోందని ఇన్నాళ్లూ భావించారు పోలీసులు. కానీ హైదరాబాద్ నడిబొడ్డున పూల కుండీల్లో గంజాయి మొక్కలు పెంచి మరీ అమ్మేస్తున్న విషయాలు తెలుసుకొని అవాక్కవుతున్నారు.
సికింద్రాబాద్ లోని యాప్రాల్ లో ఇంట్లోనే గంజాయి మొక్కలు పెంచుతోంది ఓ ముఠా. ఇంట్లో 7 పెద్ద పెద్ద పూల కుండీలు ఏర్పాటు చేసి గంజాయి సాగు చేస్తోంది. ఎప్పటికప్పుడు ఈ మొక్కల నుంచి ఆకుల్ని సేకరించి, ప్రాసెస్ చేసి హైదరాబాద్ లో విక్రయిస్తోంది.
యాప్రాల్ లో ఏడాదికి పైగా సాగుతున్న ఈ దందాను తాజాగా పోలీసులు రట్టు చేశారు. పూల కుండీల్ని ధ్వంసం చేయడంతో పాటు ముఠాలోని సభ్యులందర్నీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన సభ్యులంతా ఉద్యోగస్తులే. ఓవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, మరోవైపు సైడ్ బిజినెస్ కింద ఇలా ఇంట్లో గంజాయి మొక్కలు పెంచుతున్నారు.
సరిగ్గా ఇలాంటిదే మరో ఘటన శంషాబాద్ లో కూడా 2 రోజుల కిందట బయటపడింది. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజ్ పుత్ రోజు కూలీ. కొన్నేళ్లుగా ఇతడికి గంజాయి అలవాటు ఉంది. దీంతో తన సొంతానికి ఇంట్లోనే ఓ గంజాయి మొక్క పెంచుకున్నాడు. 4 నెలలుగా మొక్క కింది భాగం నుంచి ఆకులు తెంచుతూ, దాన్ని ప్రాసెస్ చేసి సొంతంగా వాడుకోవడం మొదలుపెట్టాడు. మొక్క బాగా పెరిగి అందరికీ కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి అతగాడ్ని అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ లో ఇలా ఎంతమంది ప్రైవేట్ గా గంజాయి సాగు చేస్తున్నారో..! ఇకపై ఫామ్ హౌజ్ ల్ని కూడా పోలీసులు జల్లెడ పట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.