ఎట్టకేలకు రెండు వారాల తర్వాత టీడీపీలో బోస్డీకే నామధ్యేయుడు , ఆ పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కలుగులోంచి బయటికొచ్చారు. కొన్ని రోజులుగా ఆయన అదృశ్యమైన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను బీస్డీకేతో పాటు తీవ్ర అభ్యంతరకరంగా దూషించి వివాదాస్పద నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు.
ఛీప్ ట్రిక్స్ చేస్తూ గత కొంత కాలంగా టీడీపీలో కీలక నాయకుడిగా ఎదుగుతున్న క్రమం అందరికీ తెలిసిందే. కేవలం ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటూ అనతికాలంలోనే టీడీపీలో ముఖ్య నాయకులను సైతం పక్కకు తోసి లోకేశ్ మనసెరిగిన నాయకుడిగా పెత్తనం చెలాయిస్తున్నారు.
ఈ క్రమంలో సీఎంపై తన సహజశైలిలో మరింత దూకుడుగా నోరు పారేసుకోవడం, దానిపై వైసీపీ శ్రేణులు తీవ్రస్థాయిలో రియాక్ట్ కావడం తెలిసిందే. సీఎంపై దూషణకు దిగిన పట్టాభిపై కేసు, అనంతరం 24 గంటలు కూడా గడవకనే రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 23న జైలు నుంచి విడుదలైన పట్టాభి విజయవాడలోని తన ఇంటికి కూడా రాకుండా, అటు నుంచే అటే మాల్దీవులకు కుటుంబ సభ్యులతో సహా వెళ్లిపోయారు.
అప్పటి నుంచి నిన్నటి వరకూ ఆయన ఆచూకీ లేదు. రెండు వారాల తర్వాత ఆయన కాసేపటి క్రితం మీడియా ముందుకొచ్చారు. సీఎంపై ప్రయోగించిన బోస్డీకే అనే పదానికి బాగున్నారా అని టీడీపీ సరికొత్త అర్థం చెప్పిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిని అంత మర్యాదగా పిలిచిన పట్టాభి… ఎందుకని కనిపించకుండా పోయారనే ప్రశ్న తలెత్తింది. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని, పట్టాభి నోటికొచ్చినట్టు మాట్లాడి… అనంతరం భయంతో దాక్కోవడం ఎందుకని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
నిజానికి పట్టాభి అంటే పార్టీలో ఎవరికీ గిట్టదని సమాచారం. కేవలం చంద్రబాబునాయుడు, లోకేశ్ అండ చూసుకుని, పార్టీలోని మిగిలిన నాయకులంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తారనే ఆగ్రహం టీడీపీలో బలంగా ఉంది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు, అలాగే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, విద్యుత్ కొనుగోళ్లు, రాష్ట్రం విచ్చలవిడిగా అప్పుల చేయడంపై పయ్యావుల కేశవ్, ఇతర నాయకులు మాట్లాడాల్సి వస్తోంది. పట్టాభి వుంటే ఇతరులకు అవకాశం ఇచ్చే వారు కాదని పార్టీ నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.
ఇలా భయంతో బోస్డీకే అలియాస్ పట్టాభి రెండు వారాలకు పైబడి కలుగులో దాక్కోవడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది. తాజాగా మీడియా ముందుకొచ్చిన ఆయన తన మాటలు వైసీపీ వాళ్లు జీర్ణం చేసుకోలేకపోతే ఏం చేయలేనని, అన్నీ ఆధారాలతోనే మాట్లాడ్తానని చెప్పుకొచ్చారు. ఆధారాలతో మాట్లాడితే సమస్యే లేదు. అడ్డగోలుగా, నోటి దురుసు ప్రదర్శిస్తేనే ఆయనకే కాదు, పట్టాభి ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీకి, రాష్ట్రానికి నష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.