కుప్పం మున్సిపల్ ఎన్నిక టీడీపీకి చావోరేవో అన్నట్టుగా మారినట్టుగా ఉంది. ఇప్పటికే కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ చిత్తు చిత్తు అయ్యింది. ఇక మున్సిపల్ పీఠంపై కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురిపెట్టి ఉంది.
చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీలో పాగా వేయడం ద్వారా.. ఆయన రాజకీయ భవితవ్యంపై సందేహాలు రేపాలనే కృతనిశ్చయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కుప్పం మున్సిపాలిటీలో నెగ్గి దాన్నో ఘన విజయంగా చెప్పుకోవాలని టీడీపీ కూడా అంతే గట్టిగా పని చేస్తూ ఉంది. ఈ క్రమంలో అన్ని రకాల అస్త్రాలనూ టీడీపీ సంధిస్తోందని స్పష్టం అవుతోంది.
ముందుగా ఈ చిన్న మున్సిపాలిటీలో చంద్రబాబు పరువును నిలిపేందుకు ఎక్కడివాడో అయిన నిమ్మల రామానాయుడుని ఇన్ చార్జిగా ప్రకటించారు. ఆ తర్వాత ఇప్పుడు అనేక మంది రంగంలోకి దిగినట్టుగా సమాచారం. టీడీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడితో సహా చిత్తూరు జిల్లాలోని చంద్రబాబు నమ్మకస్తులంతా కుప్పంలో టీడీపీని గెలిపించే పనిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డి కూడా ఇప్పుడు కుప్పంలోనే పాగా వేయడం గమనార్హం. వీళ్లంతా కలిసి ఆ చిన్న మున్సిపాలిటీలో టీడీపీ గెలుపుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. అది కూడా చంద్రబాబు సొంత నియోజకవర్గంలోని మున్సిపాలిటీలో టీడీపీ పరువు నిలిపేందుకు పాట్లు ఇవన్నీ!
ఇక కుప్పంలో ఏం చేయాలి, ఎలా చేయాలనే అంశం గురించి చంద్రబాబు నాయుడు టీడీపీ శ్రేణులకు ఆన్ లైన్ గైడెన్స్ ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ధనం, మద్యం విషయంలో రాజీ వద్దని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో భౌతిక పోరాటానికి కూడా వెనుకాడవద్దనేది చంద్రబాబు నాయుడు ప్రధానంగా చేస్తున్న సూచనగా సమాచారం.
ఒకవైపు ఎన్నికల ప్రక్రియ సవ్యంగా లేదని చంద్రబాబు నాయుడు గగ్గోలు పెడుతూ ఉన్నారు. చంద్రబాబు ఏదైనా బయటకు ఒకటి మాట్లాడుతూ ఉన్నాడంటే.. లోపల మరోటి జరుగుతూ ఉంటుందనేది ఆశ్చర్యకరమైన విషయం ఏమీ కాదు. అధికార పార్టీపై చంద్రబాబు నాయుడు వరసగా ఆరోపణలు చేస్తున్నారంటే, లోపల టీడీపీ ఏదో చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు అదే జరుగుతోందని, ఒకవైపు ప్రభుత్వాన్నీ, ఎస్ఈసీని చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శిస్తూ.. కుప్పంలో మాత్రం విజయానికి అన్ని మార్గాలనూ ఉపయోగించుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది.