మరో వివాదంలో ఫేస్ బుక్ అలియాస్ మెటా

ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమౌతూ వస్తోంది ఫేస్ బుక్. వాటి నుంచి తప్పించుకునేందుకు తమ సంస్థ పేరును మెటాగా మార్చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్ బుక్ అనే పదాన్ని కేవలం ఆ యాప్…

ఇప్పటికే ఎన్నో వివాదాలతో సతమతమౌతూ వస్తోంది ఫేస్ బుక్. వాటి నుంచి తప్పించుకునేందుకు తమ సంస్థ పేరును మెటాగా మార్చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్ బుక్ అనే పదాన్ని కేవలం ఆ యాప్ కు మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయమిది. దీనివల్ల కంపెనీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా చేయాలనేది అతడి ప్రయత్నం. అయితే ఇప్పుడీ ప్రయత్నమే జుకర్ కు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. కొత్త పేరుకు సంబంధించి కంపెనీ కోర్టు కేసు ఎదుర్కోవాల్సి వచ్చింది.

నిజానికి మెటా అనే సంస్థ ఆల్రెడీ ఉంది. అది కూడా అమెరికాలోనే ఉంది. 2016లోనే చికాగోలో ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయించారు. అయినప్పటికీ ఆ కంపెనీ పేరును జుకర్ బర్గ్ వాడేశారు. దీనిపై కోర్టు మెట్లు ఎక్కింది ఒరిజినల్ మెటా సంస్థ. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఫేస్ బుక్ ప్రతినిధులు 3 నెలలుగా ఒరిజినల్ మెటా సంస్థతో చర్చలు జరుపుతున్నారట. అయితే సరైన ఆఫర్ దక్కకపోవడంతో తమ కంపెనీ ట్రేడ్ మార్క్ ను ఇచ్చేందుకు సదరు సంస్థ నిరాకరించిందట. దీంతో అమెరికా, యూరోప్ కు చెందిన రెండు లీగల్ సంస్థలు.. ఒరిజినల్ మెటా సంస్థపై అక్రమంగా ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేశాయట. పైగా మీడియా సహకారంతో ఫేస్ బుక్  ఈ విషయాన్ని కవర్ చేయడానికి ప్రయత్నించిందనేది మెటా సంస్థ ప్రధాన ఆరోపణ.

“ఫేస్ బుక్ వాళ్లు మమ్మల్ని కొనలేకపోయారు. కాబట్టి మీడియా సహకారంతో నిజాల్ని పాతిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. నిరంతరం పైకి ఒకటి చెప్పి, ఇంకోటి చేసే ఫేస్ బుక్ నుంచి ఇలాంటి చర్యలు ఉంటాయని మేం ముందే ఊహించాం. దీనిపై మేం పెద్దగా ఆశ్చర్యపోవడం లేదు. కోర్టులోనే తేల్చుకుంటాం. ఫేస్ బుక్ కంపెనీ మమ్మల్నే కాదు, ప్రపంచంలోని ప్రజలందర్నీ మోసం చేస్తోంది. వాళ్లు మాకు తక్కువ ఆఫర్ చేశారు. ఎంత తక్కువ అంటే, మా కంపెనీ పేర్లు మార్చడానికి అయ్యే ఖర్చును కూడా అది కవర్ చేయదు.”

ఇలా ఫేస్ బుక్ సాగించిన అకృత్యాల్ని బయటపెట్టారు మెటా ఫౌండర్ నాట్ స్కులిక్. కనీసం తమ కంపెనీ పేరును ఎందుకు అడుగుతున్నారనే అంశంపై కూడా ఫేస్ బుక్ సరైన వివరణ ఇవ్వలేదన్నరు స్కులిక్.

విషయ గోప్యత, యూజర్ పాలసీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు జుకర్ బర్గ్. ఇప్పుడీ కాపీరైట్, ట్రేడ్ మార్క్ వివాదం అతడికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది.