ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ -కార్పొరేషన్ల పెండింగ్ ఎన్నికల్లో టీడీపీకి కంచుకోటల్లాంటి ఊర్లు ఉన్నాయి. వాటిల్లో తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోని కుప్పం మున్సిపాలిటీ ముఖ్యమైనది. ఇటీవలే మున్సిపాలిటీగా మారిన కుప్పం తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో తీర్పును ఇవ్వనుంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు గ్రాఫ్ పరిస్థితి ఏమిటి? అనే ప్రశ్నకు కుప్పం మున్సిపల్ తీర్పు క్లారిటీ ఇవ్వనుంది.
ఇటీవలి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజారిటీలతో విజయాలను నమోదు చేసింది. ఆ పార్టీ కుప్పం మున్సిపాలిటీ పరిధిలో కూడా అలాంటి విజయం పట్లే ధీమాతో కనిపిస్తూ ఉంది. ఇక కుప్పం మున్సిపల్ పోరు విషయంలో చంద్రబాబు నాయుడే డైరెక్టుగా దిగారు. ఈ నేపథ్యంలో అక్కడ మున్సిపోల్స్ ఫలితంపై భారీ ఉత్కంఠత నెలకొనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇక ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీల్లో మరి కొన్ని టీడీపీ కంచుకోటలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒకటి అనంతపురం జిల్లాలోని పెనుకొండ మున్సిపాలిటీ. ఇది టీడీపీ కంచుకోట. గతంలో తెలుగుదేశం నేతగా పరిటాల రవి పెనుకొండ ఎమ్మెల్యేగానే వ్యవహరించారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కూడా పెనుకొండ నియోజకవర్గం టీడీపీకి పెట్టని కోటగా నిలిచింది.
భారీ ఎత్తున బీసీల జనాభా కలిగిన పెనుకొండ నియోజకవర్గంలో టీడీపీ మంచి మెజారిటీలతోనే విజయాలను నమోదు చేసింది గతంలో. టీడీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిన.. 2004,2009 ఎన్నికల్లో కూడా పెనుకొండలో టీడీపీ ఎమ్మెల్యేనే నెగ్గారు. ఇక 2014లో కూడా ఈ సీటు టీడీపీదే. అయితే 2019లో మాత్రం కథ మారింది. ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
కురుబ సామాజికవర్గానికి చెందిన పార్థసారధి టీడీపీ తరఫున ఈ నియోజకవర్గంలో వరస విజయాలు సాధించగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అదే సామాజికవర్గానికి చెందిన శంకరనారాయణ గత ఎన్నికల్లో నెగ్గారు. 2014లో తొలిసారి పోటీ చేసి ఓటమి పాలయ్యారు శంకర నారాయణ. 2019లో మాత్రం భారీ మెజారిటీతో నెగ్గారు. ప్రస్తుతం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్లో శంకరనారాయణ మంత్రిగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పెనుకొండ మున్సిపాలిటీకి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి.
సార్వత్రిక ఎన్నికల్లో తమకు ఈ కంచుకోటలో ఎదురైన ఓటమి నుంచి ఏమైనా కోలుకున్నది ఉంటే టీడీపీ ఇప్పుడు నిరూపించుకోవాలి. ప్రస్తుతం పార్థసారధి హిందూపురం పార్లమెంటరీ నియోజకవర్గం ఇన్ చార్జిగా ఉన్నారు టీడీపీలో. ఇలాంటి నేపథ్యంలో పెనుకొండలో టీడీపీ విజయం ఆ పార్టీ సత్తాకు పెద్ద పరీక్షగా మారింది.
ఇలాంటి టీడీపీ కంచుకోటలో కూడా వైఎస్ఆర్సీపీ మరోసారి పాగా వేస్తే.. టీడీపీకి అది గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. ఈ మున్సిపాలిటీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టి పట్టుతోనే ఉన్నట్టుగా ఉంది. ఇక్కడ పాగా వేయడానికి అనుగుణంగా చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డిని ఎన్నికల బాధ్యులుగా ప్రకటించారు. మరి గతంలో తమకు తిరుగులేని పెనుకొండలో టీడీపీ పెద్ద పరీక్షనే ఎదుర్కొంటూ ఉన్నట్టుంది.