టీ20 ప్రపంచకప్ సెమిఫైనల్ ఫిక్చర్స్ ఖరారు అయ్యాయి. ఆఫ్గానిస్తాన్, న్యూజిలాండ్ ఫలితం మీద గ్రూప్ బీ లో ఎవరు సెమిస్ లోకి అడుగుపెడతారనే అంశం కొంత వరకూ ఆధారపడింది. ఒకవేళ కివీస్ ను ఆఫ్గాన్ ఓడించి ఉంటే.. టీమిండియా దాదాపు సెమిస్ లోకి అడుగుపెట్టడం ఖరారు అయ్యేది.
అది జరగలేదు కాబట్టి.. కివీస్ జట్టు మరోసారి ఐసీసీ ఈవెంట్ లో సెమిఫైనల్ లోకి ఎంటరయ్యింది. తన తొలి మ్యాచ్ లో పాక్ తో ఓడినా, రెండో మ్యాచ్ లో ఇండియాపై సాధించిన విజయమే కివీస్ ను ఇప్పుడు సెమిస్ కు చేర్చింది.
సెమిఫైనల్ లో కివీస్ జట్టు ఇంగ్లండ్ తో తలపడబోతోంది. గ్రూప్ ఏ లో టాప్ ప్లేస్ లో నిలిచిన ఇంగ్లిష్ జట్టుతో కివీస్ జట్టు సెమిస్ లో తలపడనుంది. ఇక గ్రూప్ బీ లో అజేయంగా టాప్ పొజిషన్లో నిలిచిన పాక్ జట్టు గ్రూప్ బీ లో సెకెండ్ ప్లేస్ లో నిలిచిన ఆస్ట్రేలియాతో సెమిఫైనల్ ఆడనుంది.
బుధ, గురువారాల్లో ఈ సెమిఫైనల్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఈ సారి టీ20 ప్రపంచకప్ ఆరంభం అయినప్పుడు.. టీమిండియా సెమిఫైనల్ కు చేరడం ఖాయమని చాలా మంది విశ్లేషకులు కుండబద్ధలు కొట్టారు. పాక్, కివీస్ లపై టీమిండియా కనీసం ఒక్క మ్యాచ్ లో అయినా నెగ్గుతుందని.. వారంతా అంచనా వేశారు. అయితే ఆ అంచనాలన్నీ తలకిందుల చేస్తూ.. టీమిండియా లీగ్ దశ నుంచినే నిష్క్రమించింది. తన చివరి మ్యాచ్ మిగిలే ఉన్నా.. దాని ప్రభావం ఇంకేమీ లేదు.
ఇక సెమిస్ మ్యాచ్ లలో కూడా టాస్ కీలక పాత్ర పోషించడం ఖాయంగా కనిపిస్తూ ఉంది. ముందుగా ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్ జరగనుంది. ఈ రెండు జట్లే వన్డే ప్రపంచకప్ ఫైనల్లో కూడా తలపడ్డాయి. అప్పుడు ఇంగ్లండ్ సాంకేతిక తరహా విజయం సాధించి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఇప్పుడు కివీస్ అందుకు బదులు తీర్చుకునే అవకాశం వచ్చింది. అయితే ఇంగ్లండ్ జట్టు మంచి ఫామ్ లో ఉంది.
ఇక లీగ్ దశలో అజేయంగా నిలిచిన పాక్ జట్టు.. సెమిస్ లో ఆస్ట్రేలియాతో ఏ స్థాయిలో ఆడుతుందనేది అంచనాలు లేని అంశం. ఇండియా, న్యూజిలాండ్ జట్లతో మ్యాచ్ లలో పాక్ కు టాస్ కలిసి వచ్చింది. టాస్ నెగ్గడం వల్లనే ఆ మ్యాచ్ లలో పాక్ తేలికగా నెగ్గిందనేది స్పష్టమైన అంశం.