“దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరు.” రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న టైమ్ లో చంద్రబాబు స్టేట్ మెంట్ ఇది. ఈ ఒక్క డైలాగ్ తో బాబులో దళితులంటే ఎంత చిన్నచూపు, చులకన భావం ఉందో, అగ్రవర్ణాలపై ఆయనకెంత గౌరవం ఉందో తేలిపోయింది. ఆ తర్వాత దాన్ని కవర్ చేసుకోడానికి నానా కష్టాలు పడినా కూడా పరిస్థితి చేయిదాటింది. 2019 ఎన్నికల్లో దళితులతో సహా బడుగు బలహీనవర్గాలన్నీ బాబుకి కర్రు కాల్చి వాత పెట్టాయి.
అయితే అధికారంలో ఉన్నా, ఆ తర్వాత అధికారం ఊడినా కూడా చంద్రబాబులో మార్పు లేదు. అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా అగ్రవర్ణాలకే సొంతం అనేలా ప్రవర్తించారు బాబు. పేదలకు రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తే కోర్టుకెక్కి అడ్డుకున్నారు. పేదలు, ముఖ్యంగా దళితులు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం చదువులతో బాగా లాభపడతారు. అలాంటి అవకాశం దక్కకుండా చేయాలని కుటిల పన్నాగాలు పన్నుతూనే ఉన్నారు.
పోనీ రాష్ట్రంలో ఉన్న దళితుల్ని ఉద్ధరించక్కర్లేదు, కనీసం తమ పార్టీలో ఉన్నవారికైనా ఆయన మేలు చేశారా అంటే అదీ లేదు. గెలుస్తారనుకున్న స్థానాలు బడా బాబులకిస్తారు. కచ్చితంగా పోతుందనుకున్న రాజ్యసభ స్థానాన్ని దళిత నాయకుడికి అప్పగించి సిగ్గులేని రాజకీయం చేయాలనుకుంటారు. ఈ ఉదాహరణలు చాలవా బాబు దళిత ద్రోహి అని చెప్పడానికి.
అయితే చంద్రబాబు రివర్స్ గేమ్ మొదలు పెట్టారు. సీఎం జగన్ ని దళిత ద్రోహిగా చిత్రీకరించేందుకు ఏకంగా ఓ పుస్తకాన్నే విడుదల చేశారు. “దగా పడిన దళిత జాతి దండు కట్టాలి.. దండెత్తాలి” అనే పేరుతో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఇప్పటి వరకు దళితులపై జరిగిన దాడుల్ని గుదిగుచ్చి వాటన్నిటికీ కారణం వైసీపీ సర్కారేనంటూ పుస్తకాన్ని ప్రచురించారు.
అయితే ఈ పుస్తకం వ్యవహారం టీడీపీకి గట్టిగా రివర్స్ కొట్టింది. వైసీపీలోని దళిత నాయకులు తీవ్ర స్థాయిలో బాబుపై మండిపడుతున్నారు. బాబు గత చరిత్ర తవ్వితీస్తున్నారు. ఆయన గతంలో చెప్పిన డైలాగులు, దళితులకు చేసిన మోసాలు, బాబు హయాంలో దళితులపై జరిగిన దాడుల్ని తెరపైకి తెస్తున్నారు.
దళితులపై ఎవరి హయాంలో దాడులు జరిగాయి, దళితులు ఎవరి హయాంలో అభివృద్ధి బాట పడుతున్నారో చర్చిద్దామంటూ సవాల్ విసురుతున్నారు వైసీపీ నేతలు. అంతే కాదు.. వైసీపీ తరపున కూడా బాబు దళిత ద్రోహి అనే పుస్తకాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో టీడీపీ వర్గం సైలెంట్ అయింది, బాబు నోటికి తాళం పడింది. మొత్తమ్మీద వైసీపీ అటాక్ తో బాబు దళిత రాజకీయం రివర్స్ అయింది.