కుల సంబంధమా? ఆర్దిక సంబంధమా?

ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవాకులు ,చవాకులు పేలుతూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పత్రిక యజమాని రాధకృష్ణ వికృత రాతలకు సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన చాలా ఉత్తముడైన జర్నలిస్టుగాను, నిజాయితీ…

ఎపి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై అవాకులు ,చవాకులు పేలుతూ ఆంధ్రజ్యోతి పత్రికలో ఆ పత్రిక యజమాని రాధకృష్ణ వికృత రాతలకు సమాధానం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆయన చాలా ఉత్తముడైన జర్నలిస్టుగాను, నిజాయితీ ఆయనతోనే వచ్చినట్లు, నిబద్దత అంటే ఆయనే అన్నట్లుగాను, కులం గురించి అసలు తెలియనట్లుగాను నటిస్తూ రాసిన రాతలు చదవదగినవే. ఆయన చేసిన వ్యాఖ్యలు కాని, పేర్కొన్న అంశాలు కాని అన్ని మేకవన్నెపులి మాదిరిగానే ఉన్నాయి తప్ప మరొకటి కాదు. 

ఆయన తన రాజకీయ బాస్ చంద్రబాబు నాయుడు కోసం వకల్తా పుచ్చుకున్నట్లు ఉంది తప్ప మరొకటికాదు, ఐదు నెలల్లో ప్రజలలో జగన్ పై వ్యతిరేకత వచ్చేసిందని అచ్చం చంద్రబాబు మాదిరే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తోంది తప్ప మరొకటి కాదు. సాక్షి పత్రిక గురించి ఆయన మాట్లాడారు. వారు నిజాయితీగా వైఎస్ రాజశేఖరరెడ్డి బొమ్మ వేసుకున్నారు. తద్వారా తమ భావాలు ఎక్కడా దాచుకోలేదు. అలాగే ఆ మీడియాను వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ఆరంభించిన సంగతి రహస్యం ఏమీకాదు. కాని ఆంధ్రజ్యోతి విషయం కూడా అలాగే  అని చెప్పండి. పెట్టుబడులు ఎవరివో, వాటికి రాధాకృష్ణ ఎలా యజమాని అయ్యారో వివరించండి. 

ఒక పాత్రికేయుడిగా జీవితాన్ని ఆరంభించి ఇప్పుడు స్వయంకృషితో ఒక మీడియా సంస్థకు యజమాని అవడాన్ని అభినందించవలసింది. ఆ క్రమంలో ఆయన ఏమి చేశారన్నవాటి జోలికి, ఎలా సందపాధిచారన్నదానికి, తెలుగుదేశం పార్టీ నేతలతో ఆయనకు ఉన్న సంబంధాల గురించి ఏమీ మాట్లాడను. ఆయన అభివృద్దిలోకి రావడాన్ని మాత్రం అభినందిస్తాను. ఎందుకంటే నేను కూడా ఆ సంస్థలో కొంతకాలం పనిచేశాను కనుక అక్కడ జరిగిన మంచి, చెడు రెంటికి నాకు కూడా కొంత సంబంధం ఉంటుంది కనుక. ఏదైనా వ్యాఖ్యానిస్తే నువ్వు ఎలా అక్కడ ఉద్యోగం చేశావన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. అందువల్ల నేనేమీ అతీతుడని చెప్పే సహాసం చేయలేను.

కాని రాధాకృష్ణ చేసిన కామెంట్లు, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా రాసిన దారుణమైన రాతలు చూసిన తర్వాత  కొన్ని విషయాలు ప్రస్తావించక తప్పదు.

గతంలో సీనియర్ నేత రోశయ్య మంత్రిగా ఉన్నప్పుడు ఈయన ఎలా సచివాలయానికి వచ్చింది? అప్పుడు చేతికి ఎలా సైకిల్ చైన్ కు ఉండే రంగు అంటింది చెప్పిన విషయం బహుశా అయన మర్చిపోయి ఉండవచ్చు. కాని చాలా మందికి గుర్తు ఉండే ఉంటుంది. ఎన్.టిఆర్.ను పదవి నుంచి దించే కృషి లో ఈయన ఎలా చేసింది.. ఆ సందర్భంలో లక్ష్మీపార్వతి బహిరంగ సభలోనే ఈయనను ఉద్దేశించి ఎన్ని విమర్శలు చేసింది.. ఇప్పటి తరానికి తెలియకపోవచ్చు. కాని అప్పటి నుంచి వివిధ పరిణామాలు చూస్తున్నవారికి కూడా  తెలియదని అనుకుంటున్నారు. అదే ఆశ్చర్యం. గురువింద తన నలుపు తెలుసుకోలేదట. కాదు.తెలిసినా తెలియనట్లు నటించవచ్చు. 

రాదాకృష్ణ తన ప్రస్తావనలో తన పత్రిక ఏదో నిష్పక్షపాతంగా రాస్తున్నట్లు బిల్డప్ ఇస్తున్నారు. ఒకసారి  చంద్రబాబు 2014 నుంచి 2019  వరకు  అధికారంలో ఉన్నప్పుడు తమ పత్రికలో ఎలా రాసింది? ఇప్పుడు ఎలా రాస్తున్నది  పాత పత్రికలు తిరగేస్తే అన్నీ తెలుస్తాయి. అప్పుడు చంద్రబాబు ఏది చేసినా ఆహో, ఓహో అన్నది అవాస్తవమా? వైసిపి నుంచి టిడిపిలోకి ఎమ్మెల్యేలను పిరాయింపు చేయడంలో ఈయనకు పాత్ర ఎంత ఉందన్నదాని గురించి నేను మాట్లాడడం లేదు. టిడిపి తరపున అనేక ఆర్దిక లావాదేవీలు చేశారని నేను చెప్పడం లేదు. అప్పుడు చంద్రబాబు చేస్తున్న అభివృద్దిని చూసి, జగన్ నాయకత్వ వైఫల్యంతో టిడిపిలోకి వస్తున్నారని, ఒకటికి రెండుసార్లు రాశారా? లేదా? అది విలువలతో కూడిన జర్నలిజమేనని మీరు నమ్మితే నమ్మండి.. జనాన్ని కూడా అదే నమ్మాలని చెప్పడమే బాగోలేదు.

ఎన్నికల ముందు ధర్మ పోరాట దీక్షల పేరుతో చేసిన తంతు, కోట్ల రూపాయల దుర్వినియగం, ప్రదాని మోడీని దూషించిన వైనం, అంతకుముందు నవనిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు కాంగ్రెస్ ను, సోనియాగాందీని దూషించిన తీరుపై ఎలాంటి వార్తలు రాశారో గుర్తుకు తెచ్చుకోండి.

ఇప్పుడు బిజెపి నేతల కరుణ కోసం ఎవరు పాకులాడుతున్నది తెలుసుకోవడం కష్టం కాదు. నిజమే పత్రికలకు స్వేచ్చ ఉండాల్సిందే. కాని ద్వేషం ప్రచారం చేయడానికి కూడా స్వేచ్చ ఉండాలన్నది వీరి ఉద్దేశంగా ఉంది. సచివాలయ ఉద్యోగాల పరీక్షలు అంత పకడ్బందిగా చేస్తే పేపర్లు అవుటాయ్యాయని విష ప్రచారాలు చేసింది ఎవరు? వాటికి ఇప్పటికైనా ఆధారాలు చూపించగలిగారా? అయినా మీ జోలికి ఎవరైనా వచ్చారా?మరి ఇదంతా కుల సంబంధమా? లేక ఆర్థిక వ్యవహారాల సంబంధమా అంటే ఏమి చెబుతాం.

ఇంత గొప్ప పత్రికా స్వేచ్చావాది సాక్షి పత్రికను  కూడా సమానంగా చూడండని చంద్రబాబుకు ఎందుకు చెప్పలేదు? మీడియా సమావేశాలలో సాక్షిని నోటికి వచ్చనట్లు చంద్రబాబు మాట్లాడినా, అసలు ప్రశ్నలే వేయడానికి అర్హత లేనట్లు మాట్లాడినా ఒక్కసారైనా అది తప్పు అని చెప్పారా? సాక్షి టివీని, ఎన్.టి.విని ఎపిలో బాన్ చేసినప్పుడు మీరంతా సంతోసించారేకాని మీడియా స్వేచ్చను హరించడం అని ఎన్నడైనా చెప్పారా? అసలు చంద్రబాబుకు ఇంత దారుణమైన ఓటమికి మీకు బాధ్యత ఉందన్న సంగతి మీకు తెలియదేమోకాని, చాలామంది టిడిపి నేతలకు తెలుసు.

టిక్కెట్ల మొదలు, ఇతర అనేక విషయాలలో సలహాలు ఇచ్చి, అచ్చంగా విజయవాడలోనే మకాం చేసి, చంద్రబాబు పక్కనే ఉండి మీరు చేసిన రాజకీయాలు వీడియోలలోనే వచ్చాయి కదా.. అదంతా కుల సంబంధమా?ఆర్థిక సంబంధమా? మీకు ఇచ్చిన లైవ్ కాంట్రాక్టుల కోసం చంద్రబాబుతో రోజూ ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి గంటల తరబడి ఉపన్యాసాలు చెప్పించి, చివరికి చంద్రబాబు గబ్బు అయ్యేలా చేయడంలో మీకు విశేష పాత్ర ఉందని చాలా మంది టిడిపి నేతలు చెబుతుంటారే.. చంద్రబాబుకు మీరు ఎన్.టి.ఆర్.గురించి, ఆ పేరు లేకుండా చేయాలని ఇచ్చిన సలహా, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధిచి మీరు చేసిన వ్యాఖ్యలు వీడియో సహితంగా వచ్చాయే? అవన్ని కుల సంబంధమా? ఆర్థిక సంబంధమా? వీటిపై మీకు క్లారిటీ లేనట్లు కనిపించాలని అనుకున్నా, ప్రజలందరికి క్లారిటీ ఉంది. 

జగన్ ముఖ్యమంత్రి అయితే ఏదో జరిగిపోతోందని ప్రచారం చేసింది ఎల్లో మీడియా కాదా? ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉండేసరికి గగ్గోలు పెడుతున్నది వాస్తవం కాదా? వైఎస్ హయాంలో ఆ రెండు పత్రికలు అని ఎందుకు అన్నారో, అసలు సొంత పత్రికలు ఎందుకు పెట్టవలసి వచ్చిందో మీకు గుర్తు లేకపోయినా, చాలామందికి తెలుసు. అప్పుడు కూడా మీరు చంద్రబాబుకోసమే పనిచేశారు కనుకే. అది కుల సంబంధమా? ఆర్థిక సంబంధమా.. అంటే ఏమి చెబుతాం.

ఏడు కొండుల, మూడు కొండులు అయిపోయాయంటూ విద్వేషపూరిత తప్పుడు కధనాలు రాయడం తగదు అని నేను చెప్పినా పత్రికలో ప్రధాన కధనంగా ఇవ్వడంలో కుల సంబంధం ఉందా? ఆర్థిక సంబంధం ఉందా అంటే ఏమి చెబుతాం. ఏదైనా కావచ్చు. రెండూ కావచ్చు. ప్రతిపక్ష నేతపై విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగితే కోడి కత్తి కేసు అంటూ రాయాలని ఏ జర్నలిజం చెప్పింది. ఈనాడు, ఆంధ్రజ్యోతికి కులాన్ని ఆపాదిస్తారా అంటూ ఆక్రోశం వినడానికి బాగానే ఉంది. 

అసలు కులం ఏమిటో తెలియదని అమాయకంగా చెప్పడమే బాగోలేదు. కమ్మ సామాజికవర్గంపై ద్వేషం రగలించారని అని చెప్పడంలోకాని, ఆ కులం పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అనడంలోకాని రాధాకృష్ణ కులతత్వం బహిర్గతం అవుతూనే ఉంది కదా? తమ మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమి చేసినా సమర్దించడం ద్వారా కుల విభజన తెచ్చింది ఈ మీడియానే అన్న సంగతి అందరికి తెలిసిన రహస్యమే. మేము కులం ప్రకారం మద్దతు ఇస్తాం కాని, మీరు మాత్రం కులాల వారీగా చూడకండి అంటే ప్రజలు పిచ్చోళ్లుకాదు కదా.. అందుకే వీరు చేస్తున్న దిక్కుమాలిన కుల రాజకీయాలను ప్రజలు అర్దం చేసుకున్నారు కనుకే వివిధ కులాలలో మెజార్టీ వర్గాలు ఏకమై టిడిపిని ఓడించాయి. ఇప్పుడు మళ్లీ కుల రాజకీయాలను ప్రేరేపించి ప్రయోజనాలను ఆశిస్తున్నట్లుగా రాధాకృష్ణ రాతలు స్పష్టంగా తెలియచేస్తున్నాయి. 

స్వార్ద ప్రయోజనాల కోసం ఆ కులంలో పుట్టినవారందరిని వీరు బధనాం చేస్తున్నారన్న భావన కలుగుతుంది. మీడియాకు సంబందించిన జిఓలో నిజంగానే ఏదైనా అభ్యంతరం ఉంటే దాని గురించి చెప్పడం తప్పు కాదు. కాని మొత్తం ప్రపంచం అంతా తలకిందులైనట్లు పత్రికల యజమానులను ఆ జిఓ ద్వారా తీసుకు వెళ్లి జైలులో పెట్టినట్లు గగ్గోలు పెట్టడం వెనుక లక్ష్యం తెలసుకోవడం కష్టం కాదు. మేము ఏ పార్టీకి సంబందం కాదని అబద్దాలు చెప్పడం కాదు.. మీరు దైర్యంగా జగన్ కు వ్యతిరేకం..అని చెప్పండి. తెలుగుదేశం, చంద్రబాబే ఎల్లప్పటికీ ముఖ్యమంత్రిగా ఉండాలన్నది మా అభిమతం అని చెప్పండి. తప్పు లేదు. అప్పుడు మీరు ఏ రాతలు రాసినా ఆక్షేపణ లేదు. అలాకుండా మీ నటనతో జనాన్ని మోసం చేయాలని ప్రయత్నించవద్దని మాత్రమే చెప్పగలం.

నిజంగా నిష్పాక్షికంగా ఇవ్వాళ్టి నుంచి అయినా రాయండి..అప్పుడు కచ్చితంగా మాబోటి వాళ్లం కేసులు వస్తే నిలబడతాం. కాని అలా మీరు చేస్తారని ఆశించడం అత్యాశే అవుతుందేమో!

కొమ్మినేని శ్రీనివాసరావు