ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసి ఏడాది గడిచిపోయింది. అయితే ఇంకా అంతా ఆయన కనుసన్నల్లోనే వ్యవహారం నడుస్తూ ఉంటుంది. రాజీనామా చేసిన వ్యక్తి తన అధికారాలను వదులుకోవాలి. అయితే రాహుల్ అధ్యక్ష హోదాకు రాజీనామా చేశారేమో కానీ, వారసత్వంగా కాంగ్రెస్ పై లభించిన హక్కుకు కాదన్నట్టుగా ఉంది! అధ్యక్షుడు కాకపోయినా.. అన్ని హక్కులూ ఆయనవే!
అలాగని ఆ హక్కులనైనా బాధ్యతగా తీసుకుని పని చేస్తారా.. అంటే అదీ లేదు! ఉన్నట్టుండి ఎక్కడికో వెళ్తారు, ఆ తర్వాత ఎప్పుడొస్తారో ఎవరికీ తెలీదు. పార్టీ నేతలను కలుపుకునే ప్రయత్నాలు ఉండవు. ఇప్పటికీ అంతఃపురానికే పరిమితం అయినట్టుగా కనిపిస్తారు. కంచుకోటలో ఓడిపోయిన ఘనతనూ సొంతం చేసుకున్నారు. పార్టీ బలోపేతానికి చర్యలు అంటే అవేమిటో కూడా తెలియనట్టుగా వ్యవహరిస్తారు!
ట్విటర్ లో పోస్టు చేస్తే అదే రాజకీయం అన్నట్టుగా సాగిపోతూ ఉన్నారు. ఈ తనయుడిని ప్రమోట్ చేస్తూ ఆ తల్లి! ఇద్దరూ ఇద్దరే! ఇంతకీ వీళ్లు ఎవరిని మోసం చేస్తున్నట్టు? కాంగ్రెస్ పార్టీనే కదా? తమకు బానిసత్వం చేస్తున్న నేతలను మాత్రమే కదా! తమను తాము మోసం చేసుకుంటూ..తమ మీద తామే జాలిని చూపించుకుంటూ.. అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారు సోనియా, రాహుల్, ప్రియాంక. సెల్ఫ్ పిటీ అనేది ఎదగాలనుకునే వారికి అత్యంత ప్రమాదకరమని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతుంటారు.
రాహుల్ చేసింది ఉత్తుత్తి రాజీనామా, కాంగ్రెస్ పార్టీని మరింతగా ముంచేయడానికి ఆయన కంకణం కట్టుకుని పని చేస్తూ ఉన్నారు. కపిల్ సిబల్ తాజాగా మరో మాట అన్నారు.. కాంగ్రెస్ పార్టీ తన మీద తనే సర్జికల్ స్ట్రైక్స్ చేసుకుంటోందని. ఆయన ఎవరో చోటా లీడర్లను ఉద్దేశించి ఆ మాట అన్నట్టున్నారు. అయితే ఆ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోంది మరెవరో కాదు.. సోనియా, రాహుల్ లే అని బయటి వారికి స్పష్టం అవుతోంది.
అయితే పిల్లి మెడలో గంట కట్టే ధైర్యం కాంగ్రెస్ లో ఎవరికీ కనిపించడం లేదు. మరెవరో అన్నట్టు.. కాంగ్రెస్ పునరుత్తేజం కావాలని బయటి వాళ్లు చాలా మంది కోరుకుంటున్నారు, కాంగ్రెస్ వాళ్లు తప్ప!