ద‌మ్ముంటే న‌న్ను ఎదుర్కోండ్రా…తరిమి కొడ్తాం!

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల వైసీపీలో వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. వైఎస్సార్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన స‌భ‌లో ప‌ర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఆయన త‌మ్ముడు స్వాముల్ని చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ క‌ర‌ణం…

ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లా చీరాల వైసీపీలో వ‌ర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. వైఎస్సార్ వ‌ర్ధంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన స‌భ‌లో ప‌ర్చూరు వైసీపీ ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌, ఆయన త‌మ్ముడు స్వాముల్ని చీరాల వైసీపీ ఇన్‌చార్జ్ క‌ర‌ణం వెంక‌టేశ్ తీవ్ర‌స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ప్ర‌భుత్వానికి చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం మ‌ద్ద‌తుగా నిలిచారు. గ‌త ఎన్నిక‌ల్లో చీరాల‌లో వైసీపీ అభ్య‌ర్థి ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌పై క‌ర‌ణం బ‌ల‌రాం గెలుపొందారు.

ఆమంచి కృష్ణ‌మోహ‌న్ సోద‌రుడు స్వాములు ఇటీవ‌ల జ‌న‌సేన‌లో చేరారు. చీరాల టికెట్‌ను ఆశించిన ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌కు సీఎం జ‌గ‌న్ న‌చ్చ‌చెప్పి ప‌ర్చూర్‌కు ఇన్‌చార్జ్‌గా నియ‌మించారు. అయిన‌ప్ప‌టికీ క‌ర‌ణం, ఆమంచి బ్ర‌ద‌ర్స్ మ‌ధ్య మ‌నస్ప‌ర్థ‌లు త‌గ్గ‌లేదు. తాజాగా ఆమంచి సోద‌రుల‌పై క‌ర‌ణం వెంకటేశ్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డంతో పార్టీలో విభేదాలు వీధికెక్కిన‌ట్టైంది.

వైఎస్సార్ వ‌ర్ధంతి స‌భ‌లో క‌ర‌ణం వెంక‌టేశ్ మాట్లాడుతూ చీరాల‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణాన్ని చెడ‌గొట్ట‌డానికి కొన్ని దుష్ట‌శ‌క్తులు ప్ర‌య‌త్నిస్తున్నాయని విమ‌ర్శించారు. ఒక‌డేమో సొంత పార్టీలోనే ప‌క్క నియోజ‌క‌వ‌ర్గంలో వుంటూ, మ‌రొక‌డు ప‌క్క పార్టీలోకి వెళ్లి రెచ్చ‌గొట్టేలా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. వీళ్ల‌కి ద‌మ్ము, ధైర్యం వుంటే త‌న‌తో తేల్చుకోవాల‌ని స‌వాల్ విసిరారు.అలా కాకుండా ఎక్క‌డో కూచుని ఫేస్‌బుక్‌లో ఏదో మాట్లాడితే చెంప చెళ్లుమ‌నిపిస్తామ‌ని హెచ్చ‌రించారు. ఏం త‌మాషా ప‌డుతున్నారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 

ఒక‌డేమో ప‌క్క నియోజ‌క‌వ‌ర్గానికి వెళ్లి కొంద‌రితో మాట్లాడిస్తున్నాడ‌ని, మ‌రొక‌డు ప‌క్క పార్టీలోకి వెళ్లి అది చేస్తాం, ఇది చేస్తామ‌ని రెచ్చ‌గొడుతున్నార‌ని, అలాంటి వాళ్ల ప‌ళ్లు రాల‌గొడ‌తామ‌ని ఆయ‌న వార్నింగ్ ఇచ్చారు.

త‌మ నినాదం స్వేచ్ఛ‌, ప్ర‌శాంత‌త అని క‌ర‌ణం వెంక‌టేశ్‌ అన్నారు. వాటికి భంగం క‌లిగిస్తూ ఎద‌వ వేషాలు వేస్తే ప‌రిగెత్తిచ్చి ప‌రిగెత్తిచ్చి వెంట ప‌డి కొడ్తామ‌ని వార్నింగ్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రి ప‌ని వాళ్లు చేసుకుంటే ప్ర‌శాంత వాతావ‌ర‌ణం వుంటుంద‌న్నారు. అది చేత‌కాక‌పోతే, ఏ విధంగా చేయాలో తాము నేర్పుతామ‌ని స‌భాముఖంగా చెబుతున్నామ‌ని ఆమంచి సోద‌రుల‌కు స్ప‌ష్టం చేయ‌డం విశేషం.

వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను బెదిరించ‌డం కాద‌ని, తాను చీరాల‌లో పోటీ చేస్తున్నాన‌ని, ద‌మ్ముంటే ఇక్క‌డికి రండిరా తేల్చుకుందామ‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. త‌న‌ను ఎదుర్కొనే ద‌మ్ములేక‌, కార్య‌క‌ర్త‌ల జోలికి వెళ్ల‌డం ఏంట‌ని ఆయ‌న నిల‌దీశారు.