వైఎస్‌పై పుస్తకం.. షర్మిలనైనా పిలవలేదే!

వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉండే ప్రజాదరణ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త వ్యూహరచన చేస్తున్నది. ఆయన మరణించిన 13 ఏళ్ల తర్వాత ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన కృషిని…

వైయస్ రాజశేఖర్ రెడ్డికి ఉండే ప్రజాదరణ తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సరికొత్త వ్యూహరచన చేస్తున్నది. ఆయన మరణించిన 13 ఏళ్ల తర్వాత ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఆయన కృషిని ప్రశంసిస్తూ, ‘రైతే రాజైతే’ అనే శీర్షికతో ఓ పుస్తకాన్ని తీసుకురావడం కాంగ్రెస్ పార్టీ సరికొత్త వ్యూహంగా పరిగణించవచ్చు. రాజకీయాలలో ఇలాంటి వ్యూహాలు అనేకం అనుసరిస్తూ ఉంటారు. శనివారం నాడు హైదరాబాదులో ఓ అయిదు నక్షత్రాల హోటల్లో జరిగిన కార్యక్రమంలో జననేత వైఎసఆర్ మీద తీసుకువచ్చిన పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. నిజానికి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులైన కెవిపి రామచంద్రరావు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారథ్యంలోనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. వీరిద్దరూ కూడా చాలా కాలం తర్వాత ఒక పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పీసీసీ సారథులు రేవంత్ రెడ్డి, గిడుగు రుద్రరాజు లతో సహా.. అనేకమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ నాయకులను మాత్రమే కాకుండా.. పాలగుమ్మి సాయినాధ్ వంటి జర్నలిస్టులను, నారాయణ వంటి కమ్యూనిస్టు నాయకులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.

అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి సేవల గురించి, ఒక మంచి పుస్తకం తీసుకువస్తూ ఆయన కుటుంబం నుంచి ఎవ్వరూ లేకపోవడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. అతిథులుగా కాకపోయినా, ఆహ్వానితులుగానైనా కుటుంబాన్ని పిలిచి ఉంటే కుటుంబానికి గౌరవంగా ఉండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కార్యక్రమం గనుక.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పిలవడానికి వారికి బుద్ధి పుట్టకపోవచ్చు. అయితే కనీసం వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మినైనా పిలవడానికి ఏమైంది? ఆమె ఎటూ హైదరాబాదులోనే ఉంటారు. కానీ ఆమెకు కూడా ఆహ్వానం లేదు.

చివరికి, తాను వైఎస్సార్ పేరిట ఒక పార్టీని స్థాపించి.. కొన్నేళ్లుగా తెలంగాణలో కేసీఆర్ మీద పోరాటం సాగిస్తూ వచ్చిన వైఎస్సార్ కూతురు షర్మిలకు కూడా ఆహ్వానం లేదు. ఆమె అసలే తన పార్టీని కాంగ్రెసులో విలీనం చేయడానికి సిద్ధమైపోయారు. నేడో రేపో కాంగ్రెసు నాయకురాలిగానే.. తన జీవితంలో మలివిడత రాజకీయ ఇన్నింగ్స్ ను ఆమె ప్రారంభించబోతున్నారు. 

కనీసం తన కష్టాన్నంతా కాలరాచుకుని.. తమ పార్టీలో చేరడానికి సిద్ధపడిన వైఎస్ షర్మిలనైనా కాంగ్రెసు పార్టీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఉంటే చాలా మర్యాదగా ఉండేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. మరి షర్మిల విషయంలో కాంగ్రెసు పార్టీ ఎలాంటి లెక్కలు వేసుకుంటున్నదో?