1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్‌కల్యాణ్ వచ్చాడు. చిరంజీవి తమ్ముడిగా తప్ప ఆయనకి ఏ గుర్తింపు లేదు. జనం కూడా పెద్దగా పట్టించుకోలేదు. గోకులంలో సీత, సుస్వాగతంతో అభిమానులు ఏర్పడ్డారు. తొలి ప్రేమ తర్వాత వెనక్కి చూడలేదు. పవర్‌స్టార్‌గా ఎప్పుడు మారాడో తెలియదు. 27 ఏళ్లలో గట్టిగా 27 సినిమాలు లేవు. ప్లాప్‌లు, డిజాస్టర్లు, బ్లాక్‌బస్టర్లు ఉన్నాయి. ఆయన డైరెక్ట్ చేసిన జానీని ఎవరూ చూడలేదు. దాన్ని కొన్న వాళ్లు కొన్ని జిల్లాల్లో రోడ్డు మీద పడేంత దివాళా తీశారు.
బద్రి, ఖుషీ, జల్సా, గబ్బర్‌సింగ్, అత్తారింటికి దారేది ఇవన్నీ రేంజ్ పెంచేశాయి. సెన్సిబుల్ హ్యూమర్‌తో, యాక్షన్ హీరోగా నటించడం స్టైల్. సినిమాల్లో కనిపించినట్టే , లైఫ్‌లో కూడా ఆవేశపరుడు. ఒకసారి ఆంధ్రభూమి కెమెరామన్‌తో గొడవపడి రచ్చకెక్కాడు. సికింద్రాబాద్‌లో ధర్నా వరకూ వెళ్లింది. తర్వాత రివాల్వర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అప్పగించడం ఇంకో ఎపిసోడ్. ఎక్కువ ఆలోచించకుండా ఆవేశంగా మాట్లాడ్డం అలవాటు. యువరాజ్యం అధ్యక్షుడిగా పంచలు ఊడదీస్తామని వార్తల్లోకి ఎక్కాడు. ప్రజారాజ్యం ఓటమి తర్వాత రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకున్నాడు.
2014లో జనసేన పార్టీ పెట్టాడు. ఎన్నికల్లో యుద్ధం చేయకుండా తెలుగుదేశానికి మద్దతు పలికాడు. ఆ మాత్రానికి పార్టీ పెట్టడం ఎందుకు? ఐదేళ్ల పాటు పార్టీ క్రియాశీలకంగా లేదు. తెలుగుదేశాన్ని వ్యతిరేకించింది లేదు. ఒక్క స్థానిక ఎన్నికల్లో కూడా పాల్గొనలేదు. 2019లో ఎన్నికల్లో పోటీ చేసి తాను కూడా ఓడిపోయాడు. ఇదంతా తెలుగుదేశం ప్లాన్, పవన్‌కి ప్యాకేజీ వచ్చిందని ప్రత్యర్థులు అంటారు. అయితే అంత వ్యూహాత్మకంగా వ్యవహరించే తెలివి, కుట్ర వుంటే చంద్రబాబు ట్రాప్‌లో ఎందుకు ఇరుక్కుంటాడని అభిమానులు, జనసేనానుల ప్రశ్న.
నిజానిజాల సంగతి పక్కన పెట్టి, సినిమాకి, రాజకీయాలకి ఉన్న తేడాని పవన్ గుర్తిస్తే మంచిది. సినిమాల్లో ఆయనే హీరో. చివరికి గెలిచేది కూడా ఆయనే. రాజకీయాల్లో విశ్వసనీయత, ధైర్యం, ఎత్తుగడ, నాయకత్వ పటిమ లేకపోతే విజయం కష్టం. పవన్‌పైన ప్రజల్లో ఆరోపణలు లేవు కానీ, నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ఆవేశంగా మాట్లాడి, మళ్లీ కనపడకుండా పోతాడు. ప్రజల్లో వుండే అలవాటు లేదు.
2019 తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాలు జనసేన యాక్టీవ్‌గా లేదు. జగన్ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న పవన్ ఈ నాలుగేళ్లలో జనసేన తరపున గట్టిగా చేసిన ధర్నాలు, ఉద్యమాలు లేవు. గ్రౌండ్ లెవెల్‌లో పార్టీ బలమెంతో ఎవరికీ తెలియదు. స్థానిక ఎన్నికల్లో పోటీకి దిగలేదు. ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం చేస్తోందని ఆరోపిస్తే చాలదు. అదే నిజమైతే, గట్టిగా వ్యతిరేకించడమే కదా ప్రతిపక్షాలు చేయాల్సిన పని. అది ఎప్పుడైనా పవన్ క్రియాశీలకంగా, వ్యూహాత్మకంగా చేశాడా? ఓడిపోయినా సరే తెలుగుదేశం తన ఉనికిని, రాజకీయ పార్టీ లక్షణాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. జనసేనకి ఒక రాజకీయ పార్టీ లక్షణాలు ఉన్నాయా? మనవి మెజార్టీగా గ్రామీణ నియోజకవర్గాలు. పల్లెల్లో జనసేన బలమెంత? కేవలం జగన్ వ్యతిరేకతతో గెలిచిపోతామనే నమ్మకంలో గ్రౌండ్ రియాల్టీ ఎంత? ఇవన్నీ పుట్టిన రోజు నాడు పవన్ వేసుకోవాల్సిన ప్రశ్నలు.
సినిమాల్లో ఎలాగైతే చిరంజీవి ఇమేజ్ నుంచి బయటికొచ్చి తనకు తానుగా పవర్‌స్టార్‌గా ఎలా ఎదిగాడో, అదే రాజకీయాల్లో కూడా జరగాలి. చిరంజీవి తమ్ముడు పవన్‌కల్యాణ్‌గా వచ్చి, సొంతంగా బ్రాండ్ ఇమేజ్ ఏర్పరచుకున్న పవన్, రాజకీయాల్లో మాత్రం చంద్రబాబు నీడగా వుండాలని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు.
రాజకీయాల్లో పొత్తులు, ఇచ్చిపుచ్చుకోడాలు సహజం. అయితే చంద్రబాబు ఎవరినైనా కరివేపాకులా వాడి పారేస్తారు. ఆయన 45 ఏళ్ల ట్రాక్ రికార్డులో ఇది స్పష్టంగా ఉంది. జనాలకి నిజంగా మంచి చేయాలనే కోరిక వుంటే రాజకీయాల్లో తాను ఏంటో పవన్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే జనసేన అంటే పవన్ ఒక్కడు కాదు. ఆయన్ని నమ్మి లక్షలాది మంది యువకులు, మహిళలు ముందుకు దూకుతారు. వాళ్లంతా ఎంతో డబ్బు ఖర్చు పెట్టుకుని ఒడిదుడుకులకి గురవుతారు. పవన్ ఒకచోట తానే ముఖ్యమంత్రి అంటారు. ఇంకో చోట ఓటు చీలనివ్వను, పొత్తులకి రెడీ అంటారు. విధాన నిర్ణయాల్లో స్పష్టత లేకపోతే పార్టీ కేడర్ తికమక పడుతుంది.
సమయం లేదు. కానీ పార్ట్ టైమ్ రాజకీయ నాయకుడా? ఫుల్ టైమ్ రాజకీయ నాయకుడా? పవన్ తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది.