పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అతడి అభిమానులకు ముచ్చటగా మూడో ట్రీట్ అందింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కొత్త పోస్టర్ రిలీజైంది.
రక్తంతో తడిచిన కత్తిని పట్టుకొని, తనదైన స్టయిల్ లో లుంగీ కట్టి కూర్చున్న పవన్ కల్యాణ్ స్టిల్ ను విడుదల చేశారు. అతడి వెనక ఓ వర్గానికి చెందిన సమూహం గుర్రుగా చూస్తూ నిల్చున్నట్టు చూపించాడు దర్శకుడు హరీశ్ శంకర్.
తాజా పోస్టర్ తో పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు పరిసమాప్తమయ్యాయి. ఈరోజు ఉదయం ఓజీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. అంతకంటే ముందు హరిహర వీరమల్లు సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ కూడా విడుదల చేయడంతో.. పవన్ నటిస్తున్న 3 సినిమాల నుంచి 3 అప్ డేట్స్ వచ్చినట్టయింది.
వీటిలో మరో అప్ డేట్ కూడా ఉంది. తన పుట్టినరోజు వేడుకలు పూర్తయిన తర్వాత పవన్ మొదలుపెట్టే సినిమా డీటేయిల్స్ కూడా బయటకొచ్చాయి. 5వ తేదీ నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేయబోతున్నాడు పవన్ కల్యాణ్.
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ షెడ్యూల్ పూర్తిచేశాడు పవన్. చేసిన ఆ ఒక్క షెడ్యూల్ నుంచే గ్లింప్స్ కట్ చేసి వదిలాడు హరీశ్. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమాకు పవన్ కాల్షీట్లు కేటాయించలేకపోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు మోక్షం దక్కింది.