ఈ అల‌వాట్లే మిమ్మ‌ల్ని రిచ్ గా మార్చేస్తాయ్!

మ‌న ప్ర‌వ‌ర్త‌న హుందాగా ఉండాలి, మ‌నం వ్య‌వ‌హ‌రించే తీరు మ‌న క్యారెక్ట‌ర్ ను రిచ్ గా ప‌రిచ‌యం చేయాలి.. అంటే దీని కోసం బోలెడంత డ‌బ్బు ఉండ‌న‌క్క‌ర్లేదు. మ‌న మాట‌లు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌.. మ‌న‌ల్ని…

మ‌న ప్ర‌వ‌ర్త‌న హుందాగా ఉండాలి, మ‌నం వ్య‌వ‌హ‌రించే తీరు మ‌న క్యారెక్ట‌ర్ ను రిచ్ గా ప‌రిచ‌యం చేయాలి.. అంటే దీని కోసం బోలెడంత డ‌బ్బు ఉండ‌న‌క్క‌ర్లేదు. మ‌న మాట‌లు, మ‌న ప్ర‌వ‌ర్త‌న‌.. మ‌న‌ల్ని ఉన్న‌తంగా నిలుపుతాయి. రిచ్ నెస్ అనేది డ‌బ్బుకు సంబంధించిన‌దే కాదు, ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించిన‌ది కూడా. 

రిచ్ గా ఉండాల‌ని, రిచ్ కావాల‌ని అనుకోని వారు ఉండ‌రు. ఆర్థికంగా ఎలా రిచ్ కావాల‌నేది వేరే సంగ‌తి కానీ, మ‌న‌ల్ని ఉన్న‌త స్థాయిలో నిలిపే అల‌వాట్లు కొన్ని ఉన్నాయి. మ్యాన‌రిజమ్స్ అనండి, ప్ర‌వ‌ర్తించ‌డం అనండి, అల‌వాట్లు కానివ్వండి… వీటిని ఆచ‌రిస్తే మీరు న‌లుగురి మ‌ధ్య‌నా రిచ్ గా అనిపిస్తారంతే. అవేమిటంటే..

వార్తా ప‌త్రిక‌ను చద‌వ‌డం!

ఇప్పుడు ముప్పైల్లో ఉన్న వారికి వార్తా ప‌త్రిక చ‌ద‌వ‌డంలో ఉన్న రిచ్ నెస్ ఏమిటో బాగా తెలుసు. ఎలాగంటే.. వీరు పిల్ల‌లుగా ఉన్న‌ప్పుడు, ఊళ్ల‌లో ఎవ‌రో ఒక‌రిద్ద‌రి ఇంటికే వార్తా ప‌త్రిక ప‌డేది. పేప‌ర్ చ‌ద‌వాలంటే వారి ఇంటి వ‌ద్ద‌కు వెళ్లాల్సిందే. రోజుకో మూడు రూపాయ‌లు పెట్టి పేప‌ర్ వేయించుకోవ‌డం అంటే అప్ప‌ట్లో చాలా రిచ్! ఇప్పుడు పేప‌ర్ ను ఎవ‌రైనా ఈజీగా కొనేయ‌వ‌చ్చు. అయితే పేప‌ర్ చ‌ద‌వ‌డం మాత్రం రిచ్ హ్యాబిట్.  

ఈ రోజుల్లో ప‌త్రిక చ‌దవ‌డం ఏమిటి?  నెట్ ఉండ‌గా.. అని కొట్టి పారేయ‌వ‌ద్దు. ఆఫీసులోనో, ప్ర‌యాణంలోనో.. మీరు పేప‌ర్ చ‌ద‌వ‌డం అనేక మందిని ఆక‌ర్షిస్తుంది. ఈ రోజుల్లో ఫోన్ ప్ర‌తివాడి చేతిలోనూ ఉంటుంది. అదే పేప‌ర్? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం చాలు, పేప‌ర్ చ‌ద‌వ‌డం ఎంత ప్ర‌త్యేక‌తో. కేవ‌లం షో ఆఫ్ కోసం కాదు, పేప‌ర్ చ‌ద‌వ‌డం వ‌ల్ల మీరు ఇంటెలిజెన్స్, నాలెడ్జ్ పెరుగుతాయి. అవి సంప‌ద కాదా?

హ్యాండ్ షేక్!

క‌రోనా కాలంలో హ్యాండ్ షేక్ క‌రువ‌యిపోయింది. అయితే.. హ్యాండ్ షేక్ అనేది మీరో కాన్ఫిడెన్స్ లెవ‌ల్ కు సంకేతం. హ్యాండ్ షేక్ అంటే మొహ‌మాటంతో ఇచ్చేది కాదు. మ‌నం చేయందిస్తే.. అవ‌త‌లి వారికి అది శాశ్వ‌తంగా గుర్తుండిపోతుంది తెలుసా? ఏ ఫ‌స్ట్ మీటింగులోనే మీకు కాన్ఫిడెంట్ గా చేయందించిన బాస్ నో, స‌హోద్యోగో మీకు ఇప్ప‌టికీ గుర్తుండి ఉంటాడు. 

గుర్తుచేసుకోండి! ఎక్కువ సేపు మ‌న చేతిని ప‌ట్టుకుని.. షేక్ చేస్తూ.. మాట క‌లుపుతూ.. చాలా హుందాగా వ్య‌వ‌హ‌రిస్తూ వారు చేసిన ప‌ల‌క‌రింపు అంత‌తేలిక‌గా మరిచిపోయేది కాదు. వాళ్లేమీ మిమ్మ‌ల్ని ఇంప్రెస్ చేయ‌డానికి కాదు, వారికి ఆ అవ‌స‌రం కూడా ఉండ‌దు. వారి కాన్ఫిడెన్స్ లెవ‌ల్స్ అలా ఉంటాయంతే. అలాంటి హ్యాండ్ షేక్ ఇవ్వ‌గ‌లగ‌డం నిజంగా రిచ్ హ్యాబిట్! మ‌రిదాన్ని ప్రాక్టీస్ చేయండి!

రిజ‌ర్వ్ గా ఉండ‌గ‌ల‌గ‌డం!

అవ‌త‌లి వారిని చూడ‌గానే న‌వ్వుతూ ప‌ల‌క‌రించ‌డం ఎంత మంచి అల‌వాటో, అతిగా రియాక్ట్ కాక‌పోవ‌డం కూడా అంతే మంచి అల‌వాటు. ఓవ‌ర్ షేరింగ్ అంత గొప్ప‌తైదే కాదు. అతిగా రియాక్ట్ కావ‌డం, స‌హోద్యోగుల వ‌ద్ద త‌మ ఫ్ర‌స్ట్రేష‌న్ల‌ను, కోపాన్ని అతిగా వ్య‌క్తీక‌రించ‌డం మాత్రం మంచి అల‌వాటు కాదు. అవ‌స‌రం లేని స‌మాచారాన్ని ఇవ్వ‌డం గురించి వ‌లంటీరుగా మార‌డం, వ‌ర్బ‌ల్ డ‌యేరియాను క‌లిగి ఉండ‌టం.. త‌ప్ప‌నిస‌రిగా మానుకోవాల్సిన అల‌వాట్లు.

అతిగా స్పందించ‌క‌పోవ‌డం, డైనింగ్ టేబుల్ వ‌ద్ద ప‌ద్ధ‌తిగా ఉండ‌టం కూడా రిచ్ హ్యాబిట్సే. అవ‌త‌లి వారి కోసం త‌లుపు తెర‌వ‌డం, య‌స్ ప్లీజ్, థ్యాంక్యూ అంటూ వ్య‌క్తీక‌రించ‌గ‌ల‌గ‌డం, మిమ్మ‌ల్ని మీరు స‌ర‌దాగా ఇంట్ర‌డ్యూస్ చేసుకోగ‌ల‌గ‌డం.. డ‌బ్బున్నా లేక‌పోయినా ఇవి రిచ్ హ్యాబిట్స్. ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్లు నిజంగానే రిచ్!