దక్షిణాదిన సినిమాల్లో కాస్తూ కూస్తో గుర్తింపు సంపాదించుకున్నాకా నటీనటులకు వెంటనే గుర్తుకు వచ్చేది సమాజ సేవ! ఈ సమాజ సేవ తాము సంపాదించిన డబ్బులో కొంత శాతాన్ని ఉపయోగించి, తాము వ్యక్తిగతంగా కష్టపడుతూ చేయడం సంగతి అటుంచితే, వారి లెక్కలో సామాజిక సేవ అంటే రాజకీయాల్లోకి వచ్చేయడమే! ప్రజలకు సేవ చేయడానికే తాము రాజకీయాల్లోకి వచ్చినట్టుగా స్టార్ హీరోల నుంచి, ఐటమ్ గర్ల్స్ పాత్రలు చేసిన వారి వరకూ ఇచ్చే స్పీచ్ లు కామెడీగా మారి చాలా కాలం అయ్యింది. అయితే.. ఈ హీరోలకు రాజకీయాలంటే తగని మక్కువ!
తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ… ఈ భాషల్లో సినిమాలకు విపరీతమైన ఆదరణ. ఆ ఆదరణ నటులను స్టార్లుగా చేస్తుంది. అటుపై వారిని రాజకీయ నేతలుగా మార్చేస్తుంది. దశాబ్దాలుగా ఇలాంటి నేపథ్యంతో అనేక మంది నటులు పొలిటికల్ వేషం వేశారు. వారిలో కొందరు గొప్ప సక్సెస్ అయ్యారు. మరి కొందరు భారీ అంచనాల మధ్య వచ్చిన సినిమా ఫ్లాప్ అయితే ఎలాంటి అనుభవాన్ని ఎదుర్కొంటారో, రాజకీయాల్లోనూ అదే అనుభవాన్నే ఎదుర్కొన్నారు. సీఎం సీటునే టార్గెట్ గా చేసుకుని రాజకీయాల్లోకి వచ్చి ఆరంభంలోనే ఆ కల నెరవేరకపోవడంతో, ఇక తమతో కాదన్నట్టుగా పొలిటికల్ సినిమాకు శుభం కార్డు వేశారు.
పేర్లు అనవసరం కానీ… సినిమా స్టార్ల పొలిటికల్ స్టంట్లు చాలానే జరుగుతున్నాయి. తమ సినీ నేపథ్యాన్ని, కలిసొస్తే ఆ పై తమ కులాన్ని ఉపయోగించుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, తాము శాసించే శక్తులు కావాలని, వారు తెగ తపించి పోతూ ఉన్నారు. ఆఖరికి ప్రజలు ఛీత్కరించినా.. ఈ హీరోల అహం చల్లారడం లేదు. ఒకటికి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాకా కూడా.. ఇంకా తగ్గడం లేదు. అలా అని వీరు ప్రజల మధ్యన ఉండి రాజకీయం చేస్తే, రాజకీయాలనే ప్రవృత్తిగా మార్చుకుంటే ఎవరూ అభ్యంతరం చెప్పలేరు.
ఎన్నికలు వస్తే మాత్రమే హీరోలకు రాజకీయం గుర్తుకు వస్తుంది. ఎన్నికలకు ఐదారు నెలల ముందు తమ కాల్షీట్లను రాజకీయానికి కేటాయించి, మిగిలిన నాలుగున్నరేళ్లూ సినిమాలు చేసుకోవడం. అదేమంటే తమకు వేరే ఆదాయ మార్గం లేదని, సినిమాల్లో సంపాదించి, తాము రాజకీయంలో ఖర్చు చేసుకోవాలంటూ కథలు అల్లడం! ఈ తీరంతా సగటు ప్రజలు విసిగించుకునే స్థాయికి ఎప్పుడో చేరిపోయింది. అందుకే సినీ నటులను రాజకీయంగా ఆదరించడం కూడా బాగా తగ్గిపోయింది.
అతి పెద్ద స్టార్ హీరోలు కూడా ఎమ్మెల్యేలుగా నెగ్గడం గగనం అయిపోయిందిప్పుడు. ఒకప్పుడు వెండితెర వేల్పులను మరో ఆలోచన లేకుండా సీఎంలుగా ఎన్నుకున్న దక్షిణాది ప్రజలు, ఇప్పుడు అదే స్థాయి నటులు రాజకీయం అంటున్నా.. రాజకీయాల్లోకి వచ్చినా.. లైట్ తీసుకుంటున్నారు. సినిమా హీరోల పొలిటికల్ హీరోయిజం ఏ పాటిదో ప్రజలు చూసేశారు. తమ సీనియర్ల తరహాలో తాము కూడా సీఎంలు కావాలని కలలు కన్న విజయ్ కాంత్, చిరంజీవి, కమల్ హాసన్ వంటి హీరోలకు ప్రజలు బ్రహ్మరథాలు పట్టలేదు. సినిమాల్లో మిమ్మల్ని ఆదరించగలం కానీ, రాజకీయంగా పట్టం కట్టలేమని వీరికి స్పష్టమైన సంకేతాలను ఇచ్చి పంపించారు.
ఇక పవన్ కల్యాణ్, శరత్ కుమార్ లాంటి వాళ్లు అవకాశవాద రాజకీయాలను చేస్తూ సాగుతున్నారు. తమ ఉనికిని చాటుకోవాలనే ప్రయత్నాల్లో అటూ ఇటూ గెంతుతూ, పడుతూ లేస్తూ సాగుతూ ఉంది వీరి వ్యవహారం. ఖాళీ సమయాలను రాజకీయాలకు అంకితం ఇస్తూ సాగుతోంది వీరి పెజా సేవ! ఉపేంద్ర పరిస్థితి అటూ ఇటూ కాకుండా ఉన్నట్టుంది.
మరి ఈ సినీ రాజకీయానికి దశాబ్దాలుగా సుదూరంగా ఉన్న కుటుంబం డాక్టర్ రాజ్ కుమార్ ది. కన్నడ సినిమాకు కేరాఫ్ గా నిలిచిన రాజ్ కుమార్ కుటుంబం మాత్రం తమ గ్లామర్ ను రాజకీయంలో సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. రాజ్ కుమార్ కావొచ్చు, ఆయన కుమారులు కావొచ్చు.. తమకు ఉన్న అసమాన సినీ అభిమానాన్ని ఆదరణను రాజకీయాల వైపుకు మళ్లించుకుని, తామేదో పదవులు పొందాలని, అనుభవించాలనే ప్రయత్నం చేయలేదు. రాజ్ కుమార్ కు, ఆయన తనయుడు శివరాజ్ కుమార్ కు కూడా పలు సార్లు రాజకీయ పార్టీల నుంచి ఒత్తిళ్లు వచ్చాయి.
తమ పార్టీ సభ్యత్వం తీసుకోవాలనే విన్నపంతో మొదలు.. తమ పార్టీ నుంచి పోటీ చేయాలనే ఒత్తిడి వరకూ అనేక వాటిని వారు అధిగమించారు. జాతీయ పార్టీలే వారి రాజకీయ ఎంట్రీ కోసం ఎదురుచూపులు చూశాయి. రాజ్ కుమార్ అనుకుని ఉంటే.. ఒక పార్టీని రిజిస్టర్ చేయించి, తనే సీఎం అభ్యర్థినంటూ ప్రకటించుకుని, ఒక ట్రయల్ వేయడం పెద్ద కష్టం కాదు! లేదా ఏదైనా పార్టీకి మద్దతు ప్రకటించడం, లేదా ఇంకో పార్టీని ఓడించండి అంటూ పిలుపును ఇవ్వడమూ పెద్ద కథ కాదు. అయితే ఆయన ఏనాడూ అలాంటి పనులు చేయలేదు. తన పిలుపు వల్ల ఫలానా పార్టీ ఓడిపోయిందంటూ రజనీకాంత్ లా కూడా ప్రకటించుకోలేదు!
పాలిటిక్స్ తమ కప్ ఆఫ్ టీ కాదని రాజకీయ కుటుంబం ప్రబలంగా విశ్వసించింది. రాజకీయ కుటుంబాలతో రాజ్ కుమార్ కుటుంబం వియ్యమందింది. ఆ ప్రభావంతో రాజ్ కుమార్ కోడలు ఒకరు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే అప్పుడు కూడా రాజ్ కుమార్ తనయులు అంటీముట్టనట్టుగానే వ్యవహరించి వాటికి తామెంత దూరమో నిరూపించుకున్నారు.
ఒకవైపు దక్షిణాది భాషల సినీ తారలు, జూనియర్ ఆర్టిస్టులు కూడా తమ గ్లామర్ నే రాజకీయాలకు పెట్టుబడిగా పెట్టి అల్లకల్లోలాలు చేయాలని తపిస్తున్న తరుణంలో, పునీత్ రాజ్ కుమార్ మరణం తర్వాత ఆయన సేవలను అంతా కొనియాడుతున్న నేపథ్యంలో.. రాజకీయాలకు దూరంగా నిలవడం ద్వారా రాజ్ కుమార్ కుటుంబానికి ఆదరణ అనేక రెట్లు పెరిగిందనే అంశం తప్పక ప్రస్తావనకు వస్తూ ఉంది. రాజకీయాల్లోకి వచ్చి తమ అహాన్ని చల్లార్చుకోవాలనే సినీతారలు రాజ్ కుమార్ కుటుంబ ప్రస్థానాన్ని ఒకసారి గమనిస్తే మంచిది.