క‌ష్ట‌పెట్ట‌క‌పోతే, సుఖం తెలియ‌ద‌నేది బీజేపీ భాష్యం!

క‌రోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్నాము అంటున్నారు. అయితే క‌మ‌ల నాథుల‌కు తెలుసు తెలియ‌దో కానీ, దేశంలో స్వ‌తంత్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలా ర‌కాల వ్యాక్సిన్ల‌ను ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్లు నిత్యం…

క‌రోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్నాము అంటున్నారు. అయితే క‌మ‌ల నాథుల‌కు తెలుసు తెలియ‌దో కానీ, దేశంలో స్వ‌తంత్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి చాలా ర‌కాల వ్యాక్సిన్ల‌ను ఉచితంగానే ఇస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్లు నిత్యం దుమ్మెత్తి పోసే నెహ్రూ హ‌యాం నుంచి, సోనియా హ‌యాం వ‌ర‌కూ దేశంలో సామాన్యుల‌కు ర‌క‌ర‌కాల వ్యాక్సిన్లు ఉచితంగానే అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏడాదికి రెండు మార్లు ఐదేళ్ల లోపు చిన్నారుల‌కు అందించే పోలియో డ్రాప్స్ తో మొద‌లుపెడితే, ప్ర‌భుత్వ వైద్య శాల‌ల్లో ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు అనేక ర‌కాల వ్యాక్సిన్లు ఉచితంగానే అందిస్తోంది కేంద్ర ప్ర‌భుత్వం. 

ఈ మాత్రం ఆరోగ్య వ్య‌వ‌స్థ దేశానికి స్వ‌తంత్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఏర్ప‌డింది. కాంగ్రెస్ పాలించిన అర‌వై యేళ్ల హ‌యాంలోనే వ్యాక్సినేష‌న్ ద్వారా మ‌నుషుల పాలిట న‌ర‌క‌ప్రాయం అయిన పోలియో వంటి వ్యాధికి చెక్ పెట్టారు. మోడీగారు దేశం ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌క ముందే.. ఉచిత వ్యాక్సినేష‌న్ ద్వారా పోలియో పై సంపూర్ణ విజ‌యాన్ని న‌మోదు చేసిన దేశం మ‌న‌ది. అయితే బీజేపీకి, భ‌క్తుల‌కూ అలాంటివి క‌న‌ప‌డ‌వు.

ఎంత‌సేపూ క‌రోనా వ్యాక్సిన్ ను ఉచితంగా ఇస్తున్న‌ట్టుగా డ‌ప్పేసుకోవ‌డ‌మే స‌రిపోతూ ఉంది. డెబ్బై యేళ్లుగా ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన అన్ని వ్యాక్సిన్లూ ఉచితంగా, నిర్బంధంగా కూడా ఇచ్చే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌నే విష‌యం ప్ర‌జ‌ల‌కు గుర్తుండ‌ద‌ని బీజేపీ న‌మ్మ‌కం కాబోలు. ఇక క‌రోనా వ్యాక్సిన్ కూ పెట్రో ధ‌ర‌ల‌కూ ముడిపెట్ట‌డం మ‌రో కామెడీ. 

ఇన్నాళ్లూ క‌మ‌లం పార్టీ నేత‌లు, కేంద్ర మంత్రులు ఇదే సెల‌విచ్చారు. పెట్రో ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయంటే.. క‌రోనా వ్యాక్సిన్ కోస‌మ‌ని త‌మ‌కు తోచిన భాష్యాన్ని చెప్పారు బీజేపీ నేత‌లు. ప్ర‌జ‌ల‌కు నిత్య‌వ‌స‌రాలుగా మారిన పెట్రో ఉత్ప‌త్తుల‌ను, అన్ని ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌నూ ప్ర‌భావితం చేసే పెట్రో ఉత్ప‌త్తుల ధ‌ర‌ల‌ను భారీగా పెంచేసి… ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్లు ఇస్తున్న‌ట్టుగా క‌మ‌లం నేత‌లు ఘ‌నంగా ప్ర‌క‌టించుకున్నారు.

ఇక పెట్రో ధ‌ర‌ల పెంపుకూ అభివృద్ధికి, సంక్షేమ ప‌థ‌కాల‌కూ ముడి పెట్టేస్తారు. రోడ్లు వేసేందుకు టోల్ చార్జీల‌ని కేంద్ర‌మంత్రి పార్ల‌మెంట్ లో ఘ‌నంగా ప్ర‌క‌టించేశారు చాలాకాలం కింద‌టే. దేశంలోని ఏ రోడ్ మీదా టోల్ గేట్ల‌ను ఎత్తేసే ఉద్దేశం లేద‌ని, టోల్స్ శాశ్వ‌తం అని ఆయ‌న సెల‌విచ్చారు. ప్ర‌జ‌లు తాము ప్ర‌యాణించే ప్ర‌తి కిలోమీట‌రుకు ఒక రూపాయి చొప్పున నిత్యం టోల్స్ చెల్లిస్తూ ఉంటే.. ఆ డ‌బ్బుతో మిగ‌తా ప్రాంతాల్లో రోడ్లు వేస్తార‌ట‌. మ‌రి కొత్త రోడ్ల‌పై అయినా టోల్స్ ఉండ‌వా అంటే.. అదేం లేదు. ఆ రోడ్ల‌పై  టోల్స్ బాదుడు మ‌ళ్లీ రొటీనే!

అభివృద్ధి కావాలా.. రోడ్లు వేయాలా.. మీరు జీవితాంతం ప‌న్నులు చెల్లిస్తూ ఉండండి. వ్యాక్సిన్లు కావాలా.. పెట్రోల్ ను ఎక్కువ రేటుకు కొని ప్ర‌భుత్వ గ‌ల్లా పెట్టెను నింపండి. మీరెంత ఎక్కువ రేటు చెల్లిస్తే అన్ని స‌దుపాయాల‌న‌మాట ఇదే పాల‌నా సూత్రం! అయినా.. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్న‌ప్పుడు ఇలా చెప్ప‌లేదే! పెట్రోల్ ధ‌ర‌ల‌పై అప్ప‌ట్లో గుజ‌రాత్ సీఎం హోదాలో మోడీగారు ఎలా స్పందించారు?  నేటి ఆర్థిక మంత్రి ఆనాడు ఏమ‌న్నారు? పెట్రో చార్జీల‌ను పెంచడం కేంద్రం చేసే దోపిడీగా అభివ‌ర్ణించారు క‌దా! 

ఇది చెప్పిందీ మీరే క‌దా? అభివృద్ధికీ, ప‌న్నుల‌కూ సంబంధం లేద‌న్నారు క‌దా. త‌మ ఛాతీ సైజు పెద్ద‌ది కాబ‌ట్టి.. త‌మ‌కు అధికారం ఇస్తే ప్ర‌జ‌ల‌కు నొప్పి తెలియ‌కుండా చేస్తామ‌న్నారే! కాంగ్రెస్ దోపిడీని అరికడితే ప్ర‌జ‌ల‌పై ప‌న్నులు వేయ‌కుండా అభివృద్ధి చేయొచ్చు అన్నారు క‌దా. స్విస్ బ్యాంకుల్లోని సొమ్మును తీసుకొస్తే చాలు.. దేశం సుసంప‌న్నం అవుతుంద‌ని క‌థ‌లు చెప్పారు క‌దా!

అభివృద్ధి మాత్ర‌మే కాదు.. వంద కోట్ల మంది భార‌తీయుల ఖాతాల్లోకి త‌లా 15 ల‌క్ష‌లో ఇర‌వై ల‌క్ష‌లో వేయొచ్చ‌ని అప్ప‌ట్లోనే వాట్సాప్ యూనివర్సిటీ లెక్క‌లు క‌ట్టి ప్ర‌చారం చేసి పెట్టింది క‌దా. దాన్ని బీజేపీ నేత‌లు ధృవీక‌రించి హామీ ఇచ్చారు క‌దా! మ‌రి అప్పుడు చెప్పిన‌దానికీ, ఇప్పుడు చేస్తున్న‌దానికీ ఏమైనా సంబంధం ఉందా? ఏడాదిన్న‌ర వ్య‌వ‌ధిలో లీట‌ర్ పెట్రోల్ రేటును న‌ల‌భై రూపాయ‌ల మేర పెంచేసి, ఇప్పుడు ఐదు రూపాయ‌లు త‌గ్గించేయ‌డం గొప్ప ప‌రిపాల‌న అయిపోయింది.  

న‌ల‌భై రూపాయ‌లు బాది, ఐదు రూపాయ‌లు త‌గ్గించి… చూశారా మా గొప్ప‌ద‌నం అన్న‌ట్టుగా రియాక్ష‌న్ ఇస్తున్నారు క‌మ‌లం పార్టీ నేత‌లు. న‌ల‌భై రూపాయ‌ల మేర బాదించుకున్న వారికి ఇప్పుడు ఐదు త‌గ్గించేస్తే అదే ఊర‌ట అని వారే నిర్దారించేసుకున్న‌ట్టుగా ఉన్నారు.

త‌మ‌కు అధికారం ఇస్తే ప్ర‌జ‌లు ప‌న్నులే క‌ట్ట‌న‌క్క‌ర్లేదు. ప్ర‌జ‌లు క‌డుతున్న ప‌న్నంతా కాంగ్రెస్ దోచేసుకుంటోంది త‌ప్ప దాన్ని ఖ‌ర్చు పెట్ట‌డం లేదు. మాకు అధికారం ఇస్తే వ‌చ్చేస్తుంది రామ‌రాజ్యం, ఇండియా అవుతుంది భూత‌ల స్వ‌ర్గం అనేంత రేంజ్ లో ప్ర‌సంగాల‌ను దంచి, ఏడేళ్ల పాల‌న త‌ర్వాత‌.. కూడా అంతా ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌ట్టుగా, ప్ర‌జ‌ల‌పై ప‌న్ను భారం మోప‌డ‌మే పాల‌న‌గా త‌నేంటో, త‌న విధానాలేంటో మోడీ-బీజేపీ నిరూపించుకుంటూ ఉన్నారు. ప్ర‌జ‌ల‌కూ ఈ మేర‌కు స్ప‌ష్ట‌త అయితే వ‌చ్చింది. ఇక వీరి భ‌విష్య‌త్తును నిర్దేశించాల్సింది ఓట‌ర్లే.