చూస్తుండగానే ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయి. మరో పదేళ్లల్లో వస్తాయనుకున్న మార్పులు కరోనా దెబ్బకి ఇప్పుడే వచ్చేసాయి. అయితే కొందరు మార్పుని గుర్తించి మసలుకుంటున్నారు. కొందరైతే ఇంకా పాత పద్ధతులు పాటించి నష్టపోతున్నారు.
మనం చెప్పుకునేది డిజిటల్ యుగంలో సామాన్యుడు డబ్బును సంపాదించుకునే అవకాశాల గురించి, వ్యాపార ప్రకటనల గురించి, సినీ రంగం నుంచి ప్రభుత్వపరమైన శాఖల వరకు అవలంబిస్తున్న విధానాల గురించి.
ఒక్కొక్కటిగా విశ్లేషించుకుందాం.
నిజానికి ఒక వ్యక్తి టీచరవ్వాలంటే బీ.ఈడీ లో ఉత్తీర్ణులయ్యి ప్రభుత్వ నోటిఫికేషన్ కోసం వేచి చూస్తూ, అందాకా ఏ ప్రైవేట్ స్కూల్లో అయినా కొలువు దొరుకుతుందేమోనని రకరకాల సిఫార్సులు చేయించుకుంటూ ఉద్యోగాన్ని పొందాలి. పొందాక క్రమం తప్పకుండా స్కూలుకెళ్లాలి, పడాల్సిన కష్టం పడాలి, నెలకింతని ఇంటికి తీసుకెళ్లాలి. పై డబ్బులకోసం ఇంటికి దగ్గర్లో నాలుగు వీధులు వరకు ఉన్న విద్యార్థులకి ట్యూషన్స్ చెప్పుకోవాలి.
కానీ ఇప్పుడున్న వనరులకి కాస్త బుర్ర వాడాలే కానీ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నవారున్నారు.
జూములోనూ, గూగుల్ చాట్ లోనూ లెక్కలు, సైన్స్ లాంటి ట్యూషన్స్ చెప్పుకోవడంతో పాటూ..డ్యాన్స్, సంగీతం, ఛెస్ లాంటి పలురకాల క్లాసెస్ చెప్పుకుంటూ ఇంటిపట్టునే ఉండి నెలకు లక్షన్నరకు పైగా సంపాదిస్తున్న ఎందరో భారతీయ టీచర్లున్నారు.
అది కూడా ఎక్కువ శ్రమ పడకుండా, రోజుకి ఇన్ని గంటలే పని చెయ్యాలి, వారానికి ఇన్ని రోజులే కష్టపడాలి అని నియమాలు పెట్టుకుంటూ “ఇది చాల్లే” అనుకునేవారికి మాత్రమే. అలా కాకుండా ధనార్జనే పరమావధిగా పరుగెత్తే వారు ఇంకా సంపాదిస్తున్నారు.
అంతా బానే ఉంది. మరి ఫలానా టీచర్ ఫలానా సబ్జెక్ట్ చెప్తారని ప్రచారం ఎలా చేసుకోవాలి?
మామూలుగా ఆఫ్‌లైన్ అయితే బయట పోస్టర్లు అతికించడం, పాంప్లెట్స్ పంచడం, టీవీల్లో ప్రకటనలు ఇవ్వడం చెయ్యాలి. కానీ ఆన్లైన్ పద్ధతి అది కాదు. ఆన్లైన్లోనే ప్రకటనలివ్వాలి. అది పెద్ద ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఫేస్బుక్కులో కనీసం వెయ్యి మంది ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నా “నేనీ పని మొదలుపెట్టాను” అని చెబితే రిఫెరెన్సెస్ చాలానే వస్తాయి. ఫేస్‌బుక్కులోనే ఒక వెయ్యి రూపాయలు పెట్టి ప్రకటనకి సంబంధించిన పోస్టుని బూస్ట్ చేసుకుంటే చాలా మందికి రీచ్ కూడా అవుతుంది. ఇంత తక్కువ ఖర్చుతో ప్రచారమనేది ఆఫ్‌లైన్‌లో సాధ్యం కాదు.
పైగా ఆన్లైన్ అంటే ప్రపంచమంతా మార్కెట్టే. తిరుపతిలో కూర్చున్న ఒక సంగీతం టీచర్ ఆరు దేశాల్లో ఉన్న పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. నెలకి ఎనిమిది రోజులే పని చేసి లక్ష సంపాదిస్తున్నారు.
అమెరికాలోని టెక్సాసులో ఉన్న ఒక డ్యాన్స్ టీచర్ ఇండియా, దుబాయ్, ఆస్ట్రేలియాలోని విద్యార్థులకు క్లాసెస్ తీసుకుంటున్నారు. వారానికి రెండువేల డాలర్లు సంపాదిస్తున్నారు. ఇలాగే ఏదైనా.
అలాగే ఫిట్నెస్ క్లాసులు కూడా. యోగా, ఎయిరోబిక్స్ లాంటివి కూడా ఆన్లైన్లో తరగతులు తెరిచి ఘనంగా సంపాదించుకుంటున్నవాళ్లున్నారు.
మనసుండాలి, తపనుండాలి, విద్య ఉండాలి..అంతే ఇప్పుడు సంపాదించుకోవడం అస్సలు కష్టం కాదు. ఉద్యోగాల్లేవని అందరూ బాధపడక్కర్లేదు.
ప్రపంచమంతా ఇలా ఆన్లైన్లో ఉంటే ఇంకా కోట్లు ఖర్చుపెట్టి న్యూస్ పేపర్స్ లో యాడ్స్ ఇస్తున్న వ్యాపార సంస్థలు, సినీ నిర్మాతలు ఉన్నారు. అంటే ఇంకా డిజిటల్ యుగాన్ని అర్థం చేసుకోకపోవడమే.
ఇప్పుడు యువతరమంతా ఇన్‌స్టాగ్రాములో బతుకుతున్నారు. అక్కడ ఎవరికైనా మిలియన్ కి పైగా ఫాలోవర్స్ ఉంటే ఏకంగా మాల్దీవ్స్ రెజార్ట్స్ నుంచి పిలుపులొస్తున్నాయి. వాళ్లక్కడ నుంచి ఫోటోలు దిగి ఇన్‌స్టాలో పెడితే ప్రచారమేగా. ఈ మధ్యన పలువురు బాలీవుడ్, టాలీవుడ్ నటీమణులు అలాగే మాల్దీవుల్ని ప్రచారం చేసారు ఇన్‌స్టాలో. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాని మాల్దీవ్స్ అనే చిన్న దేశం ఎలా వాడుకుంటోందో.
ఇక సెలెబ్రిటీలు, మంత్రులు ట్విట్టర్లో ఉంటారు. అక్కడ కూడా ప్రచారానికి చాన్స్ ఉంటుంది.
మధ్య వయసువాళ్లు, వృద్ధులు ఫేస్బుక్కులో ఎక్కువగా బిజీగా ఉంటున్నారు. వాళ్లకి సంబంధించిన వ్యాపార ప్రకటనలు అక్కడివ్వాలన్నమాట.
అసలు నరేంద్రమోదీ జనాల్లోకి దూసుకుపోవడానికి కారణం డిజిటల్ ప్రపంచాన్ని అర్థం చేసుకుని వాడుకోవడమే.
ఆంధ్ర, తెలంగాణా ప్రభుత్వాలు డిజిటల్ ప్రపంచాన్ని పెద్దగా వాడుకుంటున్నట్టు లేదు. ఇంకా దినపత్రికల్లో సర్క్యులేషన్ లెక్కల్లో ప్రచారానికే పెద్దపీట వేస్తున్నారు.
ఇక సినిమాల విషయానికొద్దాం.
అసలు రోడ్డు మీద పోస్టర్ చూసి ఫలానా సినిమా వస్తోందని తెలుసుకునే రోజులు వెళ్లిపోయి ఎన్నాళ్లయ్యిందో. ఇప్పుడంతా మొబైల్లోనే. యూట్యూబులో మోషన్ పోస్టర్, అక్కడే పాటలు, ఆ పైన ప్రీ రిలీజ్ వేడుక, ట్రైలర్..అంతే ఇవే ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తున్నాయి.
అలాంటప్పుడు బయట అంతంత ఖర్చు పెట్టి పొస్టర్స్ కానీ, కటౌట్స్ కానీ పెట్టడం దేనికి? పేపర్ యాడ్స్ దేనికి? ఎక్కువమంది జనాన్ని రీచ్ కావడానికి ఏమాత్రం ఉపయోగపడని ఖర్చది.
ఒక చిన్న తెలుగు సినిమాని ప్రమోట్ చేయాడానికి తక్కువలో తక్కువ ఒక కోటి నుంచి రెండు కోట్లు ఖర్చవుతాయి. అందులో అసలు బయట పోస్టర్స్, కటౌట్స్, పేపర్ యాడ్స్ పూర్తిగా మానేసి కంప్లీట్ గా యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్టా, ట్విటర్ లో డిజిటల్ ప్రొమోషన్స్ చేస్తే చాలా ఖర్చు కలిసొస్తుంది, రావాల్సిన దాని కంటే ఎక్కువ రీచ్ వస్తుంది.
సినిమాలకే కాకుండా నగల దుకాణాలు, వెడ్డింగ్ మాల్స్ ఇలా అన్ని బ్రాండ్స్ కి పేపర్ యాడ్స్ కంటే డిజిటల్ ప్రొమోషన్స్ ఎంతో లాభదాయకం.
అన్నిటికీ మించి ఆన్లైన్లోనే షాపింగ్ కూడా చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులున్నప్పుడు ఇంకా జాగ్రఫీని, న్యూస్ పేపర్ సర్క్యులేషన్ ని లెక్కేసుకుని వ్యాపారాలు చేయడమంటే వెనకబడి ఉన్నట్టే కదా!
ఎందుకంటే మనం విజయవాడలో కూర్చుని అమేజాన్ లో ఒక వస్తువు కొంటాం. అది మనకి మనం ఉన్న ఊళ్లోంచే రాకపోవచ్చు. ఎక్కడో లక్నో నుంచో, నాసిక్ నుంచో కూడా ప్యాక్ అయ్యి వస్తుంది. అంటే లక్నోలో ఉన్న ఒన షాపుకి విజయవాడలో ఉన్నవాడు కూడా కష్టమరే.
ఇలా ప్రపంచ విపణి మొత్తం గుప్పెట్లో ఉన్న ఈ రోజుల్లో ఇంకా పూర్తిగా ఈ విప్లవాన్ని అర్థం చేసుకోక కొత్తగా షాపులు తెరవడం, పేపర్లో యాడ్స్ ఇవ్వడం వంటివి చాలామంది చేస్తున్నారు. అధికమొత్తంలో తెలియకుండా నష్టపోతున్నారు. అవసరంలేని వ్యవస్థల్ని పొషిస్తున్నారు.
ఉన్న దినపత్రికలు కూడా ఇప్పుడు చాలామంది మొబైల్లోనే ఉచితంగా చదువుతున్నారు. అలాంటప్పుడు మా పత్రిక సర్క్యులేషన్ ఇంత అనే లెక్కన కోట్ల రూపాయలు బిల్లు వేసే యాడ్స్ దేనికి? అదే కోటి డిజిటల్లో ఖర్చు పెడితే ఫలానా పత్రిక ఫిజికల్ సర్క్యులేషన్ కంటే వందరెట్లు ప్రజానీకానికి చేరువవుతుంది.
ఇప్పుడు డిజిటల్ విప్లవం ఇంకా తొలి దశలోనే ఉంది. దీనిని అందిపుచ్చుకున్నవాడే విజయం సాధిస్తాడు. సమీప భవిష్యత్తులో ప్రింట్ పరిశ్రమ అంతర్ధానమవడం ఖాయం. వస్తువుల కొనుగోళ్లు, సినిమా వీక్షణాలు అన్నీ ఇప్పుడు డిజిటల్లో రుచి మరుగుతున్నవారు పెరుగుతున్నారు. రాను రాను ప్రపంచమంతా వీళ్ళే ఉంటారు. కనుక ఇప్పటి నుంచే డిజిటల్ దారుల్లో నడిచేవాళ్లకే భవిష్యత్తుంటుంది.
నండూరి సత్యలక్ష్మి