బెయిల్ ద‌క్కినా ఆర్య‌న్ ను వ‌ద‌ల‌ని ఎన్సీబీ!

బాలీవుడ్ న‌టుడు షారూక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ను చాలా రోజుల పాటే క‌స్ట‌డీలో ఉంచుకున్న ఎన్సీబీ.. చివ‌ర‌కు కోర్టు తీర్పు మేర‌కు బెయిల్ మీద వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ…

బాలీవుడ్ న‌టుడు షారూక్ ఖాన్ త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ను చాలా రోజుల పాటే క‌స్ట‌డీలో ఉంచుకున్న ఎన్సీబీ.. చివ‌ర‌కు కోర్టు తీర్పు మేర‌కు బెయిల్ మీద వ‌దిలిన సంగ‌తి తెలిసిందే. ఇక ఈ కేసులో ర‌క‌రకాల ప‌రిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఆర్య‌న్ ను అదుపులోకి తీసుకున్న  ఎన్సీబీ ముంబై జోన‌ల్ ఆఫీస‌ర్ స‌మీర్ వాంఖేడే విష‌యంలో ఆరోప‌ణ‌లు గుప్పుమంటున్నాయి. ఈ అంశం రాజ‌కీయంగా కూడా ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. 

ఆర్య‌న్ ను అరెస్టు చూప‌డానికి ముందు స‌మీర్ వాంఖేడే డ‌బ్బులు డిమాండ్ చేశాడ‌నే ఆరోప‌ణ‌ల అంశం కూడా కోర్టును చేరింది. ఇదంతా ముంద‌స్తు ప్లాన్ ప్ర‌కారం జ‌రిగింద‌ని, ఆర్య‌న్ ను ఈ కేసులో స‌మీర్ వాంఖేడే ఫ్రేమ్ చేశాడ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతూ ఉంది. ఇలా ఈ వ్య‌వ‌హారం ప‌లుమ‌లుపుల‌తో సాగుతూ ఉండ‌గా.. మ‌రోవైపు ఈ కేసుపై సిట్ విచార‌ణ కూడా మొద‌లైంది.

ఈ కేసులో ఎన్సీబీపై కూడా విమ‌ర్శ‌లు వ‌స్తుండ‌గా.. ఈ కేసు విచార‌ణ‌కై ఎన్సీబీ సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ ఆఫీస‌ర్లు ఈ కేసులోని నిందితుల‌ను విచారిస్తూ ఉంది. ఇప్ప‌టికే ఆర్బాజ్ మ‌ర్చంట్ ను సిట్ అధికారులు విచారించారు.

ఆదివార‌మే షారూక్ త‌న‌యుడు ఆర్య‌న్ ను కూడా విచార‌ణ‌కు పిలిచార‌ట ఎన్సీబీ సిట్ అధికారులు. అయితే ఆరోగ్య కార‌ణాల రీత్యా ఆర్య‌న్ విచార‌ణ నుంచి మిన‌హాయింపును కోరిన‌ట్టుగా స‌మాచారం. సోమ‌వారం రోజున ఆర్య‌న్ సిట్ విచార‌ణ‌కు హాజ‌రు కావొచ్చ‌ని తెలుస్తోంది.

బెయిల్ మీద బ‌య‌ట‌కు వ‌చ్చినా ఈ కేసు వ్య‌వ‌హారం ఆర్య‌న్ ఖాన్ ను తేలిక‌గా వ‌దిలేలా లేదేమో. సిట్ ఏర్పాటు నేప‌థ్యంలో విచార‌ణ మళ్లీ మొద‌టికి వ‌చ్చిందేమో! ఈ కేసులో ఎన్సీబీ కూడా క్ర‌మంగా కార్న‌ర్ అయిన నేప‌థ్యంలో.. ఇప్పుడు సిట్ తో త‌మ‌పై ప‌డుతున్న మ‌ర‌కల‌ను ఎన్సీబీ కూడా తుడుచుకోవాల్సి ఉంది. మ‌రి దానికి ఏ మార్గాన్ని అనుస‌రిస్తుందో!