టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ముందుకు వెళ్లే దారులు మూసుకుపోయాయి. తొలి రెండు మ్యాచ్ లలో ఓటమితో ఈ ప్రపంచకప్ లో భారత జట్టు అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆ తర్వాత వరసగా రెండు మ్యాచ్ లలో నెగ్గినా, అది కూడా మంచి నెట్ రన్ రేటునే సాధించినా… ఇంకా ఒక మ్యాచ్ మిగిలే ఉన్నా, ఆ మ్యాచ్ గెలిచే అవకాశమే ఉన్నా.. ఈ ప్రపంచకప్ లో అయితే ఇండియాకు ఇంతే సంగతులు.
కనీసం ఆఫ్గానిస్తాన్ అయినా కివీస్ జట్టును ఓడిస్తుందని భారత క్రికెట్ ఫ్యాన్స్ చాలా ఆశలే పెట్టుకుని కనిపించారు. అయితే… ఈ మ్యాచ్ ను న్యూజిలాండ్ జట్టు సునాయాసంగా నెగ్గింది. రాజమార్గంలో సెమిస్ లోకి అడుగు పెట్టింది.
గ్రూప్ బీ నుంచి పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు సెమిస్ లోకి ఎంటరయినట్టే. ఇండియా ఈ ప్రపంచకప్ లో తన చివరి మ్యాజ్ ను నమీబియాతో ఆడాల్సి ఉంది. ఆ మ్యాచ్ ఫలితం సెమిస్ లో స్థానాలను ఏ రకంగానూ ప్రభావితం చేయదు.
గత కొన్నేళ్లుగా ఐసీసీ ఈవెంట్స్ లో ఇండియా కనీసం సెమిస్, వీలైతే ఫైనల్ స్థాయికి చేరుతూ వచ్చింది. చాలా యేళ్ల తర్వాత ఇండియా ఆ మాత్రం సత్తాను కూడా చూపించలేకపోయింది ఈ సారి. విరాట్ కొహ్లీ కెప్టెన్సీలో ఇది వరకటి ఐసీసీ ఈవెంట్స్ లో ఇండియా సెమిస్ వరకూ అయితే దర్జాగా చేరింది. అయితే ఈ సారి టీ20 ప్రపంచకప్ లో లీగ్ దశ నుంచినే నిష్క్రమించింది. అరివీర భయంకర టీ20 ఆటగాళ్లుగా కీర్తనలు అందుకుంటూ.. ధాటిగా ఆడలేక తొలి రెండు మ్యాచ్ లలో ఓటమితోనే భారత ఆటగాళ్లు ఫెయిల్యూర్ స్టోరీని లిఖించారు.
ఇక కెప్టెన్ గా ఇదే తనకు ఈ టీ20 ప్రపంచకప్ .. ఈ ఫార్మాట్ లో చివరిది అని ఇది వరకూ కొహ్లీ ప్రకటించాడు. ఇలా ఫెయిల్యూర్ తో కొహ్లీ టీ20 గా కెప్టెన్ గా కెరీర్ ను ముగించాడు. కొహ్లీ వ్యక్తిగత ఫామ్ రీత్యా చూసినా, కెప్టెన్ గా ట్రాక్ రికార్డును గమనించినా అతడు తప్పుకోవడం మంచిదే. టీమ్ తర్వాతే ఎంత స్టార్ ఆటగాడు అయినా. అయితే అతడు తప్పుకున్నది కేవలం టీ20 కెప్టెన్సీ నుంచి మాత్రమే.
అయితే కొహ్లీని ఇతర ఫార్మాట్ల ఆటకు సంబంధించి కూడా కెప్టెన్సీ నుంచి తప్పిస్తే మంచిదనే అభిప్రాయాలు క్రికెట్ ఫ్యాన్స్ నుంచి వ్యక్తం అవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు ప్రదర్శనను పరిశీలించిన తర్వాత బీసీసీఐ కూడా ఈ విషయంలో ఘాటుగా స్పందించే అవకాశాలు లేకపోలేదు.