2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బద్వేల్ నియోజకవర్గంలో టీడీపీ సాధించిన ఓట్ల శాతం సుమారు 30. ముప్పై శాతం ఓట్లను సాధించిన పార్టీ ఉప ఎన్నికలో పోటీ చేయనే లేదు. వాస్తవానికి ఈ ఉప ఎన్నికలో పోటీకి దూరంగా ఉండమంటూ టీడీపీ ఆఫీసుకు వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ అడగలేదు. ఒకవేళ మరణించిన వ్యక్తి కుటుంబీకులు పోటీ చేసిన ఉప ఎన్నిక కాబట్టి తాము పోటీకి దూరంగా ఉండాలని టీడీపీ అనుకున్నా, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విన్నవించి ఉండాల్సింది. అయితే మొదట్లోనే టీడీపీ బద్వేల్ ఉప ఎన్నిక విషయంలో అభ్యర్థిని ఖరారు చేసింది.
తమ అభ్యర్థి పేరును కూడా ప్రకటించింది. ఇక బద్వేల్ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయ్యాకా కూడా ఆ అభ్యర్థి పేరును మరోసారి ప్రకటించింది. ఆయనే టీడీపీ తరఫున పోటీ చేస్తాడంటూ టీడీపీ ప్రకటించింది. ఆ తర్వాత టీడీపీకి మానవీయ కోణం గుర్తుకు వచ్చింది. అభ్యర్థి పేరు ప్రకటన తర్వాత పోటీ నుంచి తప్పుకుంది! దీంతో టీడీపీ ఓటమికి భయపడి తప్పుకుంది తప్ప, ఆ పార్టీ తరఫున మానవీయత ఏదీ పొంగి పొర్లలేదని స్పష్టం అయ్యింది.
ఎలాగైతేనేం.. బద్వేల్ ఉప ఎన్నిక ముగిసింది. ఫలితం కూడా వచ్చేసింది. మరి ఇంతకీ టీడీపీ గతంలో సొంతం చేసుకున్న 30 శాతం ఓట్లు ఎటు పడ్డట్టు అనేది ఆసక్తిదాయకమైన అంశంగా నిలుస్తోంది. ఈ అంశంపై క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలిస్తే.. నిఖార్సైన టీడీపీ ఓటు బ్యాంకు ఈ ఎన్నికల్లో పోలింగ్ కు దూరంగా ఉంది. అయితే అది చాలా తక్కువ! ఈ ఉప ఎన్నిక పోటీకి దూరంగా ఉండటం వల్ల ఓటేయని వారి శాతం నాలుగుకు మించి లేదు. సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఏడెనిమిది శాతం పోలింగ్ తగ్గింది. అయితే అందులో ఈ ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఓటేయని వారు కొందరుంటారు.
వేర్వేరు ప్రాంతాల్లో విద్య, ఉపాధి, ఉద్యోగాల కోసం ఉన్న వారు ఇలాంటి బై పోల్ కు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల అనాసక్తిని ప్రదర్శించి ఉండవచ్చు. ఒకవేళ పోటాపోటీ పరిస్థితి ఉంటే పార్టీలు పోటాపోటీగా ప్రజలను బూత్ లకు తరలిస్తాయి. అది కూడా లేదు కాబట్టి.. మరో రెండు మూడు శాతం ఓటింగ్ నమోదు కానేలేదు. స్థూలంగా ఈ ఉప ఎన్నికలో టీడీపీ పోటీలో లేకపోవడం వల్ల తగ్గిన పోలింగ్ శాతం మూడు నుంచి నాలుగు వరకూ ఉంటుంది.
ఇక మరి కొందరు టీడీపీ సానుభూతి పరులు నోటా మీట నొక్కారు. అందుకే ఈ నియోజకవర్గం ఉప ఎన్నికలో దాదాపు రెండున్నర శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. నోటాకు పడ్డ ఓట్ల సంఖ్య 3,650 వరకూ ఉంది. అందులో రొటీన్ గా నోటాకు పడే ఓట్ల సంఖ్య 900 నుంచి వెయ్యి వరకూ ఉంటుంది. మిగిలిన 2500 ఓట్ల వరకూ పక్కా టీడీపీ ఓట్లు అని స్థానిక పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ-జనసేన, కాంగ్రెస్, ఇండిపెండెంట్లు పోటీలో ఉన్న పరిస్థితుల్లో.. టీడీపీ హార్డ్ కోర్ అభిమానులు కొందరు నోటాకు ఓటేసి పై వాళ్లందరినీ తిరస్కరించారు. ఇలా నోటాలో టీడీపీ వాటా చెప్పుకోదగిన స్థాయిలో ఉంది.
మరోవైపు బీజేపీకి పడ్డ ఓట్లలో టీడీపీ వాటా గణనీయంగా ఉందని కూడా స్పష్టం అవుతోంది. బీజేపీ బద్వేల్ లో తెచ్చుకున్న 21,678 ఓట్లలో 90 శాతం ఓట్లు టీడీపీవే అని స్థానికులు స్పష్టంగా చెబుతున్నారు. టీడీపీ పోటీలో లేకపోవడంతో బీజేపీ ప్రధానంగా ఆ పార్టీ క్యాడర్ మీద, ఓట్ల మీద దృష్టి సారించింది. ఎలాగూ టీడీపీ పోటీలో లేదు కాబట్టి.. తమకు సహకారం అందించాలంటూ బీజేపీ ప్రచారం చేసుకుంది.
టీడీపీ చోటామోటా నేతల ఇళ్లకు కూడా బీజేపీ నేతలు వెళ్లారు. ఈ సారి ఒక్కసారికీ తమకు సహకరించమంటూ కోరారు. ఎలాగూ టీడీపీ పోటీలో లేదనే విషయాన్ని గుచ్చిగుచ్చి ప్రస్తావించారు. బీజేపీ తరఫున నిలిస్తే కొద్ది మేర తాయిలాలు కూడా అందుతాయనే నమ్మకం టీడీపీ శ్రేణుల్లో కలిగింది.
ఇది కొంత వరకూ వర్కవుట్ కావడంతో బీజేపీ ఆ మాత్రం ఓట్లను అయినా సంపాదించుకుందనేది వాస్తవం. ఇప్పుడు బద్వేల్ లో 21 వేల స్థాయి ఓట్లను తెచ్చుకున్న బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కనీసం ఇదే స్థాయిలో ఓట్లను పొందుతుందనేది అస్సలు సాధ్యం అయ్యే విషయం కాదు. టీడీపీ పోటీలో లేకపోవడంతో… ఆ పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకును బీజేపీ తనవైపుకు తిప్పుకుంది. ఇదే పని కాంగ్రెస్ కూడా కొంత వరకూ చేయగలిగింది.
బీజేపీకి ఓటేయడం ఇష్టం లేని, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు మళ్లలేని టీడీపీ శ్రేణులను కాంగ్రెస్ కూడా క్యాప్చర్ చేయగలిగింది. అది నోటా కాన్న కాస్త ఎక్కువగా! కాంగ్రెస్ కు సుమారు ఆరు వేల ఓట్లు వచ్చాయి. నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన కమలమ్మ పోటీ చేశారు కాబట్టి.. కాంగ్రెస్ కు సొంత ఓట్లు కనీసం వెయ్యి, 1500 వరకూ ఉండవచ్చు. టీడీపీ పోటీలో లేకపోవడంతో.. అదనంగా నాలుగైదు వేల ఓట్లు కాంగ్రెస్ కు కలిసి వచ్చాయి.
నోటా ఓట్లలో సగం, బీజేపీకి పడ్డ ఓట్లలో 90 శాతం, కాంగ్రెస్ ఓట్లలో 70 శాతం ఓట్ల వరకూ పక్కా టీడీపీ ఓట్లే ఉన్నాయి. ఇలా టీడీపీ ఓట్లు అటు ఇటుగా 25 వేలు ఈ తరహాలో పోల్ అయ్యాయి. మరో మూడు నాలుగు వేల ఓట్లు పోలింగ్ ప్రక్రియకే దూరంగా నిలిచాయి. మరి ఈ ప్రభావం ముందు ముందు ఎలా ఉంటుందనేది ఆసక్తిదాయకమైన అంశం.
ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోలింగ్ కు దూరం అయినా, ఆ పార్టీ పోటీలో లేకపోవడం వల్ల ప్రభావం మాత్రం తక్కువగానే నమోదైంది. టీడీపీ పోటీకి దూరం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నచ్చని ఓటర్ మరో పార్టీకి ఓటేశాడు. అంతే కానీ, టీడీపీ పోటీలో లేదనే భావనతో తన ఓటు హక్కును వినియోగించుకోవడం పట్ల అనాసక్తిని చూపలేదు. మరోవైపు చంద్రబాబేమో ఎన్నికలు అంటే.. బహిష్కరణలు, కోర్టుకు వెళ్లి ఆపడాలు చేస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ అంతా అప్రజాస్వామ్యకంగా జరుగుతోందంటూ తమ ఓటములను తక్కువ చేసి చూపే పనిలో ఉన్నారు. దీని వల్ల నష్టం ఓటరుకు కాదు.
టీడీపీ పోటీలో లేకపోతే ఓటర్ వేరే పార్టీల వైపు మళ్లడానికి రెడీగానే ఉన్నాడని బద్వేల్ ఉప ఎన్నిక కొంత స్పష్టతను ఇస్తోంది. దీర్ఘకాలం ఇలాంటి ఎన్నికలకూ, జరిగే ప్రతి ఎన్నికా ప్రజాస్వామ్యబద్ధం కాదంటూ చంద్రబాబు నాయుడు చేతులెత్తేస్తూ ఉంటే మాత్రం, ప్రజల మధ్యన టీడీపీ అడ్రస్ గల్లంతయ్యే అవకాశాలు క్రమంగా పెరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.