సీనియర్లను చూసి జూనియర్లు నేర్చుకోవడం లో ఎంత మాత్రం తప్పులేదు. అందులోనూ కేసిఆర్ లాంటి కాకలు తీరిన రాజకీయ నాయకులను చూసి జగన్ లాంటి బుడ్డోళ్లు నేర్చుకోవడంలో అసలు తప్పు లేదు.
ప్రతిపక్షాలు ప్రభుత్వం పై ధ్వజమెత్తడం మామూలే. వాళ్ల నోటికి వచ్చింది, వాళ్లకు అనుకూలంగా నిర్మించుకున్న వాదనలతో, ప్రజలను మాయచేయడానికి ప్రయత్నించడమూ మామూలే. దీనికి కౌంటర్ గా అధికార పక్షం కూడా కాస్త నోరు చేసుకోవాలి. వాస్తవాలు వివరించాలి. లేదా వారు వారికి అనుకూలంగా నిర్మించే వాదన వినిపించాలి. అంతే కానీ కోట్లు ఖర్చు చేసి ప్రకటనలు ఇస్తే సరిపోదు.
ప్రకటనలు జనాలకు రీచ్ కావడం కన్నా, నాయకుల మాటలు చేరడం ఎక్కువ. పోనీ అధికార పక్షం మాటలు, ప్రతిపక్ష మొగ్గు వున్న మీడియా సంస్థలు ప్రసారం చేయవు అనుకున్నా, మిగిలిన వాటిల్లో అయినా ప్రసారం అవుతాయి. పెట్రోలు ధరల మీద కావచ్చు, వేరే విషయాల మీద కావచ్చు, ఎల్లో మీడియా కావచ్చు, ప్రతిపక్షనేతలు కావచ్చు. వారి వార్తలు వారు టాం టాం చేస్తున్నారు. జనాలు అవే నిజమని నమ్మే ప్రమాదమూ వుంది.
ఇలాంటి నేపథ్యంలో చేయాల్సింది కోట్లు ఖర్చు చేసి అడ్వర్ టైజ్ మెంట్లు వేయడం కాదు. ప్రాంతానికో పెద్ద మంత్రి వున్నారు. లేదా ఫైనాన్స్ మంత్రి వున్నారు. పెట్రోలు ధరల మీద ప్రభుత్వం వాదనను వినిపించలేరా? నిన్నటికి నిన్న తెలంగాణ సిఎమ్ కేసిఆర్ ఏం చేసారు.కేంద్రం చేస్తున్న అన్యాయాలను, పాలనా విధానాలను తూర్పారపట్టలేదా? దమ్ముంటే చూసుకుందాం రమ్మని సవాల్ చేయలేదా?
పోనీ జగన్ అంతలా రంకెలు వేయనక్కరలేదు. కనీసం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనల్లో వున్నదాన్నే వివరించవచ్చు కదా? పెట్రోలు, వంట గ్యాస్ పాపం కేంద్రానిదో, రాష్ట్రానిదో వివరించవచ్చు కదా? అప్పులు, ఆర్థిక ఇబ్బందుల గురించి పత్రికలు నిత్యం వార్తలు వండి వారుస్తున్నాయి. అసలు లెక్కలు జగన్ చెప్పవచ్చు కదా?
మీడియా ముందుకు వచ్చి కేంద్రం ఇస్తున్నదేమిటి? రాష్ట్రం ఖర్చులు ఏమిటి? అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది. తను అధికారంలోకి వచ్చేసరికి వున్న అప్పులు ఎన్ని? చేసినవి ఎన్ని? ఏ ఖర్చుకు ఎంత చేయాల్సి వచ్చింది? ఇవన్నీ జనాలకు వివరించాలి కదా?
ఎవరు ఏం రాసుకుంటే తమకేంటీ? జనాలకు గెలిపించేస్తున్నారు అని ధీమా పడితే, 2024 ఎన్నికల వేళకు ప్రమాద ఘంటికలు మోగే ప్రమాదం వుందని గమనించాలి. ఉపఎన్నికల విజయాలు శాశ్వతం కాదని గుర్తించాలి. కానీ జగన్ ఆ దిశగా ఆలోచిస్తారని, తరచు మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వివరిస్తారని ఆశించడం అత్యాశేమో? ఎందుకంటే జగన్ మైండ్ సెట్ నే వేరు.