అఖిలప్రియ భర్తను వెంటాడుతున్న గతం!

అఖిలప్రియ భర్తను వెంటాడుతున్న గతం.. అని అనుకుంటున్నారు ఆళ్లగడ్డ ప్రజానీకం. మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ నాయుడు తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు అఖిలప్రియ- భార్గవ్…

అఖిలప్రియ భర్తను వెంటాడుతున్న గతం.. అని అనుకుంటున్నారు ఆళ్లగడ్డ ప్రజానీకం. మాజీ మంత్రి  భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ నాయుడు తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. మంత్రి హోదాలో ఉన్నప్పుడు అఖిలప్రియ- భార్గవ్ ల పెళ్లిజరిగిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయాకా భార్గవ్ రామ్ పై వరసగా వివిధ అంశాల్లో కేసులు నమోదు అవుతూ ఉన్నాయి. అధికారం చేతిలో ఉన్నప్పుడు భార్గవ్ తమను ఇబ్బంది పెట్టారని పలువురు ఆయన మీద పోలిస్ స్టేషన్ల గడప ఎక్కుతున్నారు.

అలాగే ఆర్థిక వ్యవహారాల్లో భార్గవ్ తమపై హత్యాయత్నం  చేశారని మరొకరు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇలాంటి క్రమంలో ఆయనను అరెస్టు చేయడానికి పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇటీవలే అందుకు సంబంధించి హైదరాబాద్ లో ఒక హైడ్రామా చోటు చేసుకుంది. దానికి సంబంధించి పోలీసులు భార్గవ్ రామ్ పై మరో కేసు పెట్టారు. ఇక తమను పోలీసులు వేధిస్తున్నారంటూ  భూమా అఖిలప్రియ వాపోతున్నారు.

ఇలా ఈ పొలిటికల్ డ్రామా కొనసాగుతూ  ఉంది. ఆ సంగతలా ఉంటే..కర్నూలు జిల్లా జనాల్లో మాత్రం ఈ వ్యవహారం గురించి వేరే చర్చ కొనసాగుతూ ఉంది. అఖిలప్రియ భర్తను ఒక గతం వెంటాడుతూ ఉందని వారు అనుకుంటున్నారు. భార్గవ్ రామ్ కు అఖిలప్రియతో కన్నా ముందే ఒక యువతితో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని వారు కూడా అధికారికంగా ధ్రువీకరించారు.

ఒక పోలీసాఫీసర్ కూతురును అఖిలప్రియ భర్త ముందుగా పెళ్లి చేసుకున్నారనే విషయం.. అతడి రెండో పెళ్లి సమయంలో మార్మోగింది. అందుకు సంబంధించిన గతమే ఇప్పుడు భార్గవ్ రామ్ ను వెంటాడుతూ ఉందని ఆళ్లగడ్డ ఏరియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు.

భార్గవ్ రామ్ మొదటి పెళ్లితో ఒక యువతి జీవితంతో ఆటలు ఆడుకున్నాడంటారు. ఆ యువతి తండ్రి పోలీసాఫీసర్. అయితే ఆయన ఇప్పుడు సర్వీసులో లేరు. కానీ.. గతంలోనే ఒక ఉన్నత స్థాయి పదవిని చేపట్టారు. ఆయన శిష్యులు ఎంతో మంది పోలీసులుగా కొనసాగుతూ ఉన్నారు. ఉన్నతాధికారిగా రిటైర్డ్ అయినా ఆయన పై ఆ శిష్యులకు మమకారం ఉందట. ఇప్పుడు వారు తమ గురువు మాజీ అల్లుడికి చుక్కలు చూపిస్తున్నారనేది ఆళ్లగడ్డలో జరుగుతున్న చర్చ!

వారేమీ తప్పుడు కేసులు బనాయించడం లేదు. తన భార్య మంత్రిగా  ఉన్న సమయంలో భార్గవ్ రామ్ కూడా అధికార దర్పాన్ని ప్రదర్శించాడని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు అధికారం చేతిలో ఉందని బాగా హడావుడి చేశారు. ఇప్పుడు అధికారం చేతిలో లేదు. దీంతో పోలీస్ కేసులన్నీ మీదకు వస్తున్నాయి. దానికి తోడు భార్గవ్ రామ్ గతంలో వ్యవహరించిన తీరు పోలీసుల మనసుల్లో ఉందనేది జనం నుంచి వినిపిస్తున్న అభిప్రాయం. పోలీసులు ఎంత వరకూ భార్గవ్ రామ్ పై పాత కక్షలను పెట్టుకున్నారనేది మనం చెప్పలేం. అలాంటిదేమీ ఉండకపోవచ్చు కూడా. అయితే ప్రజలు మాత్రం అలా అనుకుంటున్నారు.  అఖిలప్రియ కూడా పదే పదే పోలిసులనే లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతూ ఉండటం ప్రజల్లో ఈ వ్యవహారంలో మరింత చర్చనీయాంశంగా మారింది.