రాయలసీమ అంటే అంత చులకనా పవన్!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని, ఆ పార్టీ అధినేతను విమర్శించాలనుకుంటే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మరేమైనా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి విమర్శలు అయినా చేసుకోవచ్చు. అది జగన్ కు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ని, ఆ పార్టీ అధినేతను విమర్శించాలనుకుంటే జనసేన అధిపతి పవన్ కల్యాణ్ మరేమైనా మాట్లాడుకోవచ్చు. ఎలాంటి విమర్శలు అయినా చేసుకోవచ్చు. అది జగన్ కు, పవన్ కల్యాణ్ కు సంబంధించిన వ్యవహారం. అయితే మధ్యలో రాయలసీమను కించపరచడానికి పవన్ కల్యాణ్ వెనుకాడక పోవడమే ఆశ్చర్యకరంగా ఉంది. రాయలసీమను చులకన చేస్తూ మాట్లాడటం పవన్ కల్యాణ్ కు ఇది కొత్త కాదు.

ఎన్నికలకు ముందు కూడా పలు సార్లు పవన్ కల్యాణ్ అలాంటి మాటలే మాట్లాడారు. అప్పుడే రాయలసీమ  వాళ్లు గట్టిగా చెప్పారు.. పవన్ కల్యాణ్ మీ అన్న చిరంజీవి పరువు నిలబెట్టింది రాయలసీమ వాళ్లే అని అప్పుడే చెప్పడం  జరిగింది. సొంతూరి జనాలే చిరంజీవిని ఎమ్మెల్యేగా ఓడిస్తే.. తిరుపతి జనాలు చిరంజీవిని ఎమ్మెల్యేగా చేశారు. అలా చిరంజీవి పరువు నిలబెట్టింది రాయలసీమ వాళ్లే!

ఒకవేళ అప్పుడు చిరంజీవిని కూడా తిరుపతి జనాలు ఓడించి ఉంటే..మెగా బ్రదర్స్  రాజకీయానికి అప్పుడే తెరపడేది! ఎమ్మెల్యేగా కూడా నెగ్గలేక ఇప్పుడు పవన్ కల్యాణ్ రాజకీయంగా ఏ రేంజ్ లో తిరస్కరించబడ్డాడో, చిరంజీవి కి కూడా అలాంటి అనుభవమే ఎదురయి ఉంటే వీళ్లకు తెలిసేది. అయితే అప్పుడు జాలి చూపినందుకు పవన్ కల్యాణ్ ఇప్పుడు రాయలసీమ మీద విషం కక్కుతూ ఉన్నాడు.

సీమాంధ్ర మిళితం అయిన చిన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. అలాంటి చోట కూడా ఇప్పుడు పవన్ కల్యాణ్ లాంటి వాళ్లు ప్రాంతీయ విబేధాలకు తెర లేపడానికి, ఒక ప్రాంతాన్ని అవమానించడానికి వెనుకాడకపోవడం ఆయన ఉద్దేశాన్ని కూడా తేటతెల్లం చేస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు.

హైకోర్టును కర్నూలులో పెట్టుకోండి అంటూ పవన్ కల్యాణ్ వ్యంగ్యంగా మాట్లాడటం ఏమీ తెలియక కాదు. ఒక రకమైన అహకారంతో పవన్ కల్యాణ్ ఆ మాట మాట్లాడారు. హైకోర్టే కాదు.. ఒక దశలో ఏపీకి రాజధానిగానే కర్నూలు నిలిచిందనే విషయం పవన్ కల్యాణ్ కు తెలుసో తెలియదో!

కర్నూలుకు రాజధానిగా నిలిచే అర్హతే ఉంది. సీమాంధ్ర సహిత ఆంధ్రప్రదేశ్ లో రాజధాని అవకాశం కర్నూలుకే దక్కాలి కూడా. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం.. రాజధాని కర్నూలులో ఉండాలి. అయితే చంద్రబాబు నాయుడు ఆ ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. కర్నూలుకు రాజధానే కాకుండా ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు.

అమరావతి అంటూ గ్రాఫిక్స్ సిటీకి ఏపీ రాజధానిని పరిమితం చేశారు చంద్రబాబు నాయుడు. ఈ విషయంలో ప్రజల్లో కూడా అసహనం ఉంది. అందుకు నిదర్శనమే ఎన్నికల ఫలితాలు.

రాయలసీమ మొత్తం మీదా తెలుగుదేశం పార్టీ కేవలం మూడంటే మూడు అసెంబ్లీ సీట్లకు పరిమితం అయ్యిందంటే.. దానికంతా కారణం సీమతో చంద్రబాబు నాయుడు వ్యవహరించిన తీరే. ఇంకా నయం సీమ ప్రజలు  చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేగా ఓడించేసి ఉంటే.. ఆ తర్వాత టీడీపీ కథ మరోలా ఉండేది. ఏదో దయదలిచి చంద్రబాబు నాయుడుకు స్వల్ప మెజారిటీని ఇచ్చారు.

చంద్రబాబుకు ఆ రేంజ్ లో బుద్ధి చెప్పి, ఆయన పార్ట్నర్  పవన్ కల్యాణ్ కు కూడా అదే రేంజ్ తీర్పును ఇచ్చారు రాయలసీమ ప్రజలు. జనసేనకు సీమలో డిపాజిట్ దక్కిన స్థానాలను కూడా వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. అలా పార్ట్నర్స్ కు ప్రజా తీర్పు షాక్ ఇచ్చింది.

ఆ అసహనంతో ఇప్పుడు రాయలసీమను అవమానించేలా మాట్లాడటానికి పవన్ కల్యాణ్ వెనుకాడుతున్నట్టుగా లేడు. గతంలో తన దృష్టిలో రాజధాని కర్నూలే అంటూ చిలకపలుకులు పలికిన పవన్ కల్యాణ్, ఇప్పుడు అదే కర్నూలును అవమానించి తన తీరు ఏమిటో చాటి చెప్పుకున్నాడు. ఈ విషయంలో రాయలసీమ మేధావి వర్గాలు మండిపడుతూ ఉన్నాయి. పవన్ కల్యాణ్ కొంచెం ఒళ్లు ఎరిగి మాట్లాడాలని, అడ్డగోలుగా మాట్లాడితే తీవ్ర పర్యవసానాలను ఎదుర్కొనాల్సి ఉంటుందని రాయలసీమ వాదులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.

పాతికేళ్ల రాజకీయం చేయడానికి వచ్చానంటూ చెప్పుకునే జనసేన అధిపతి ప్రాంతీయ విబేధాలు తలెత్తాలా మాట్లాడితే.. పరిస్థితులు వేరేగా ఉంటాయని వారు హెచ్చరిస్తూ ఉన్నారు. మత్తులో ఉన్నట్టుగా సీమను అవమానించినట్టుగా మాట్లాడిన పవన్ కల్యాణ్ కు తనేం మాట్లాడాడో ఇప్పటికైనా అర్థం అయ్యిందో లేదో!