ఏంటా ఇంకా పవన్ ఈ సబ్జెక్ట్ టచ్ చేయలేదు అనుకున్నారంతా. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను గుడ్డెద్దు చేలో పడ్డట్టు విమర్శించడమే పనిగా పెట్టుకున్న ప్రతిపక్షాలకు వంతపాడే పవన్ కల్యాణ్ కాస్త లేటుగా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టే జీవోపై స్పందించారు. అయితే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రస్తుతానికి 1నుంచి 6వ తరగతి వరకు పరిమితం చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత పవన్ స్పందించడం విశేషం. ఎప్పట్లానే లేట్ అన్నమాట.
అయితే పేదపిల్లల భవిష్యత్ గురించి ఏమాత్రం ఆలోచించకుండానే జనసేనాని ట్వీట్ పడేశారు. తెలుగు మీడియం ఆపేస్తుంటే అధికార భాషా సంఘం ఏం చేస్తుందని ట్విట్టర్ లో ప్రశ్నించారు. తెలుగు గొప్పదనం అర్థమైతే తెలుగు మీడియంపై నిషేధం విధించరంటూ సెలవిచ్చారు. పవన్ వ్యాఖ్యలకు పరాకాష్ట ఏంటంటే కేసీఆర్ ని చూసి జగన్ భాషాభిమానం నేర్చుకోవాలట. ఇంకా నయం పరిపాలన కూడా కేసీఆర్ ని చూసి నేర్చుకోమని చెప్పలేదు.
అసలు జగన్ కి కేసీఆర్ కి పోలికేంటి? అధికారంలోకి వచ్చీ రాగానే వందరోజుల్లో పథకాలన్నీ అమలులో పెట్టిందెవరు? రైతుకు భరోసా అందించింది ఎవరు, నేతన్నలకు ఆర్థిక సాయం చేసిందెవరు? మద్యపాన నిషేధం దిశగా అడుగులేసిందెవరు? అమ్మఒడి తీసుకొచ్చిందెవరు? అగ్రిగోల్డ్ బాధితులకు ఆర్థిక సాయం చేసిందెవరు? దేనిలో జగన్ కేసీఆర్ కంటే తక్కువో పవనే చెప్పాలి.
ఆర్టీసీ విలీనం విషయంలో జగన్ ని చూసి నేర్చుకోండి అని కేసీఆర్ కి చెప్పే దమ్ము పవన్ కి ఉందా? అక్కడ లేవని నోరు, ఇక్కడ మాత్రం పచ్చబ్యాచ్ సపోర్ట్ ఉండే సరికి పెద్ద పెద్దగా లేస్తుంది. మంత్రులు ఎదురుదాడికి దిగితే మాత్రం ఎక్కడలేని పౌరుషం తన్నుకొస్తుంది. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే తెలుగు భాషకు వచ్చే నష్టమేంటో పవన్ కల్యాణ్ చెప్పి ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడితే మంచిది.
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెడితే ఈ పోటీ యుగంలో పేద పిల్లలు కూడా కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులకు ధీటుగా రాణించగలరనే ఒకే ఒక్క సదుద్దేశంతో జగన్ ఈ విధానాన్ని ముందుకు తెచ్చారు. ఈ నిర్ణయంతో ముఖ్యమంత్రికో లేక వైసీపీ నేతలకో వచ్చే లాభం ఏమీ లేదు. ఈ దిశగా పవన్ ఎందుకు ఆలోచించరు.
నా ఇంట్లో, నా అల్మరాలో ఇన్నేసి తెలుగు పుస్తకాలున్నాయంటూ ఫొటోలు తీసి ట్విట్టర్ లో పెట్టే పవన్ తన పిల్లలు ఏ స్కూల్ లో ఏ మీడియం చదువుతున్నారో కాస్త బైటకు చెబితే బాగుంటుంది. పిల్లల్ని తెలుగు మీడియంలో చదివించలేని ఏ ప్రబుద్ధుడికీ పేద పిల్లల ఇంగ్లిష్ మీడియంపై విమర్శించే అర్హత లేదు.